రుణ విస్తరణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-23T05:14:25+05:30 IST

ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజల వద్దకే రుణాలను అందించేందుకు రుణ విస్తరణ కార్యక్రమం ద్వారా బ్యాంకులు ముందుకురావడం హర్షనీయమని ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు.

రుణ విస్తరణను సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘాలకు చెక్కును అందిస్తున్న అదనపు కలెక్టర్‌, బ్యాంకు అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 22: ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజల వద్దకే రుణాలను అందించేందుకు రుణ విస్తరణ కార్యక్రమం ద్వారా బ్యాంకులు ముందుకురావడం హర్షనీయమని ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఆవరణలో రుణ విస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు వివిధ రకాల రుణాలను అందిస్తున్నాయని వాటిని ఆర్థికంగా ఎదిగేందుకు వినియోగించుకోవాలన్నారు. సామాజిక దృక్పథంతో చేపట్టే కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు, వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  అర్హులైన వారందరు ఆన్‌లైన్‌ ద్వారా డాక్యుమెంటేషన్‌ చేసుకోవాలని, వారి పూర్వపరాలు, సిబిల్‌ స్కోర్‌ ప్రకారంగా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9500ల మహిళలకు రూ.198కోట్ల బ్యాంకు లింకేజి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అక్టోబర్‌ మాసాంతానికి రూ.118కోట్లు లక్ష్యం కాగా రూ.93కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందజేయడం జరిగిందని ఈ మాసంలో రూ.25కోట్లు లక్ష్యం కాగా రూ.10కోట్లకు పైగా బ్యాంకు లింకేజి రుణాలు అందిస్తున్నామన్నారు. డీఆర్డీవో కిషన్‌ మాట్లాడుతూ బ్యాంకులకు కేటాయించిన రుణలక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లను కోరారు. పరిశ్రమలు, వ్యాపారం వ్యక్తిగత రుణాల వంటి వాటిలో జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. బ్యాంకర్ల సహకారంతో ప్రజల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని తెలిపారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ఆదేశాల మేరకు రుణ విస్తర్ణ కార్యక్రమాన్ని ఒక రోజు నిర్వహిస్తూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల ద్వారా వివిధ రుణాలను అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారు  రుణాల విషయమై ఆయా బ్యాంకులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఏజీఎం సూర్యప్రకాష్‌కుమార్‌, టీజీబీ ఏసీఎం రఘునందన్‌రావు, జిల్లా సహాకార బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ సూర్యప్రకాష్‌ ఏపీడీ చరణ్‌దాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పద్మబూషన్‌రాజు తదితరులున్నారు. 

Updated Date - 2021-10-23T05:14:25+05:30 IST