‘అప్పు’ తిప్పలు

ABN , First Publish Date - 2021-06-12T06:16:50+05:30 IST

కొవిడ్‌ మహమ్మారితో గడచిన రెండు నెలలుగా వందలాది మంది కన్నుమూశారు. వేలాదిమంది ఆసుపత్రుల పాలయ్యారు. అయితే ఇప్పుడు దీని ప్రభావం జిల్లాలో వందల కోట్ల ఫైనాన్స్‌ వ్యాపారంపై భారీగా పడింది.

‘అప్పు’ తిప్పలు
కాకినాడలో వడ్డీ వ్యాపార సంస్థల సముదాయం

  • కొవిడ్‌తో జిల్లావ్యాప్తంగా వందల కోట్లలో ఫైనాన్స్‌ వ్యాపారం కుదేలు
  •  వేలల్లో కేసులు, మరణాల నేపథ్యంలో అప్పు ఇవ్వడానికి వ్యాపారుల జంకు
  • ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందోరాదోననే అనుమానంతో లావాదేవీలన్నీ బంద్‌
  • కుటుంబ వైద్య ఖర్చులు, ఇళ్లు గడవడానికి అప్పు కావాలన్నా దొరకని పరిస్థితి
  • బడుగులు, కూలీలు, చిరు, మధ్యతరగతి కుటుంబాలు అప్పుకోసం అల్లాడుతున్న వైనం
  • రూ.50 వేల నుంచి రూ.లక్ష ఆపైన అప్పు పుట్టడమూ గగనమే
  • అప్పు ఇచ్చాక తమకేమైనా అయితే రోడ్డున పడతామని ఫైనాన్స్‌ వ్యాపారుల్లో గుబులు
  • బంగారం కుదువ పెట్టే స్తోమత ఉన్న వారికే అతికష్టంపై దొరుకుతున్న అప్పు
  • ముఖ్యంగా పల్లెల్లో అప్పులిచ్చే దళారులు, దుకాణాలు ఎక్కడికక్కడ బంద్‌
  • జిల్లావ్యాప్తంగా కోట్లలో నిర్వహించే అనపర్తి వ్యాపారుల డైలీ ఫైనాన్స్‌ కుదేలు
  • ఫైనాన్స్‌ దొరక్క కాకినాడ, రాజమహేంద్రవరంలలో తాకట్టు వ్యాపారం జోరు


ఏలేశ్వరానికి చెందిన ఓ కుటుంబానికి  కొవిడ్‌ వైద్య అవసరాలకు అత్యవసరంగా రూ.3లక్షల అప్పు అవసరం వచ్చింది. తాకట్టు పెట్టడానికి బంగారం చేతిలో లేదు. బంధువులు, తెలిసినోళ్లు, వ్యాపారుల వద్దకు తిరిగినా అప్పు పుట్టలేదు. అంతకుముందు అప్పు ఇచ్చిన వాళ్లు కూడా ముఖం చాటేశారు. చివరకు డబ్బు దొరక్క చికిత్స ఆలస్యమై ఇంట్లో పెద్దదిక్కు పోయింది.

అనపర్తికి చెందిన ఓ ఫైనాన్సర్‌ రూ.50 లక్షలతో కొన్నేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. కొవిడ్‌తో ఇటీవల కన్నుమూశాడు. ఎక్కడెక్కడ ఎంత అప్పు ఇచ్చారో రాసిన పుస్తకం పట్టుకుని బంధువులు వసూలుకు వెళ్తే మేం ఎప్పుడో ఇచ్చేశాం అని అటు నుంచి సమాధానం వచ్చింది. చివరకు రూ.2 లక్షలు వసూలై మొత్తం ఆస్తి కోల్పోయారు.


...ఇదీ జిల్లాలో అటు ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవారు, అటు అవసరానికి అప్పు కావలసిన వాళ్ల దుస్థితి. కొవిడ్‌ మహమ్మారితో గడచిన రెండు నెలలుగా వందలాది మంది కన్నుమూశారు. వేలాదిమంది ఆసుపత్రుల పాలయ్యారు. అయితే ఇప్పుడు దీని ప్రభావం జిల్లాలో వందల కోట్ల ఫైనాన్స్‌ వ్యాపారంపై భారీగా పడింది. కొవిడ్‌ భయంతో ఎక్కడికక్కడ అప్పులిచ్చే వ్యాపారం పూర్తిగా కుదేలైపోయింది. వ్యాపారులు పూర్తిగా అప్పులు ఇవ్వడం మానేశారు. ఇచ్చిన అప్పులు వసూలుకు లైన్లకు వెళ్లడానికీ ఎవరూ సాహసించడం లేదు. వెళ్తే ఎక్కడ కొవిడ్‌ బారిన పడతామోననే భయంతో వణుకుతున్నారు. మరోపక్క పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అవసరానికి పుట్టే అప్పు కూడా మునుపటిలా దొరకడం లేదు. అప్పు కోసం ప్రయత్నిస్తే తమకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందోననే ముందుచూపుతో కొందరు డబ్బు దాచుకుని ఇవ్వడం లేదు. మరికొందరేమో అప్పు ఇస్తే ఈలోపు తీసుకున్నవారికి కొవిడ్‌తో జరగరానిది జరిగితే నష్టపోతామనే భయంతో ఇవ్వడం లేదు. ఇలా బంధువులు మొదలు వడ్డీ వ్యాపారుల వరకు కొవిడ్‌ భయంతో అప్పు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఫైనాన్స్‌ వ్యాపారానికి అనపర్తి నియోజకవర్గం పెట్టింది పేరు. ఇక్కడ వందల కోట్లలో వడ్డీ వ్యాపారులు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల వరకు వ్యాపారం చేస్తారు. జిల్లా వరకు చూస్తే అనపర్తి, మామిడాడ, రాయవరం, బిక్కవోలు తదితర ప్రాంతాల్లోని ఫైనాన్స్‌ వ్యాపారులు కాకినాడ, రాజమహేం ద్రవరం, కోరుకొండ, గోకవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, ఏలేశ్వరం, రంప చోడవరం, ఎటపాక, కూనవరం, చింతూరు, భద్రాచలం వరకు డైలీ ఫైనాన్స్‌ వ్యాపారం వందల కోట్లలో చేస్తారు. వీరంతా పది వేల నుంచి రూ.పది లక్షల వరకు కూడా అప్పు ఇస్తారు. ఎవరికి అప్పు అవసరం అయినా వడ్డీ ఎంత నేది కాగితంపై రాసుకుంటారంతే. ఒకరకంగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వీరి ద్వారా సులువుగా అప్పు పుట్టేది. వ్యాపారులు, చిన్న దుకాణాలు, అనేక కుటుంబాలు వీరి నుంచి కొన్నేళ్లుగా అప్పు తీసుకోవడం, చెల్లించడం జరుగు తోంది. అయితే కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లాలో కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం రెండువేలకుపైగా కేసులు, వారానికి నలభై వేల కేసులు వస్తున్నాయి. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. మరికొన్ని వేలమంది ఇళ్లల్లో హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. అటు కొవిడ్‌ సోకి ఆక్సిజన్‌ అందక, పరిస్థితి విషమించి, పడకలు దొరక్క వందల్లో కన్నుమూస్తున్నారు. ఒకరకంగా ఈకల్లోల పరిస్థితి ఇప్పుడు ఫైనాన్స్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాపారులు నాలుగు నెలలుగా కొవిడ్‌ భయంతో పూర్తిగా లైన్లకు వెళ్లడం మానేశారు. ఇచ్చిన అప్పుల వసూ ళ్లు కూడా పక్కనపెట్టేశారు. తెగించి వెళ్తే వైరస్‌బారిన పడతామనే భయంతో ఎక్కడకు వెళ్లడం లేదు. చివరకు వడ్డీ వ్యాపారానికి నియమించిన ఉద్యోగులు కూడా స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఎక్కడ ఏ అవసరానికి అప్పు కావాలన్నా దొరకని పరిస్థితి ఉంది. అనపర్తి ఫైనాన్స్‌ వ్యాపారులే కాదు జిల్లాలో అనేక మండలాలు,గ్రామాల్లో స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసేవాళ్లు కూడా ఇప్పుడు ఫైనాన్స్‌  పూర్తిగా మూసేశారు. అప్పు ఇస్తే తిరిగి వసూల య్యే పరిస్థితి లేకపోవడమే కారణం. ప్రస్తుత కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో ఏ కుటుంబంలో ఎప్పుడు ఎలా ఉంటుందో? అప్పు తీసుకున్నవారు రేపటికి ఉంటారో లేదో అనే అపనమ్మకం పెరిగిపోయి అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇదంతా ఒకెత్తయితే ఒకవేళ అప్పులు ఇస్తే తమకు కొవిడ్‌తో ఏమైనా అయితే ఆ డబ్బు వసూలవదనే భయం కూడా వడ్డీ వ్యాపారం నిలిపివేయడానికి మరో కారణంగా కనిపిస్తోంది. కొన్ని నెలల కిందట అన పర్తి, రాయవరం, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, తుని, కాకినాడ, కరప తదితర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసిన కుటుంబాల్లో పెద్దదిక్కు అయిన వ్యక్తులు కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో ఒక్క అప్పు కూడా తిరిగి రాలేదు. ఇదంతా వ్యాపారం కోణంలో కాగా, మరోవైపు ప్రస్తుతం కొవిడ్‌తో చిన్నచిన్న వ్యాపారా లు చేసుకునే వాళ్లు, మధ్యతరగతి కుటుంబాలు, చిరు బతుకులు చాలినంత ఆదాయం లేక అల్లాడుతున్నారు. వీరి కుటుంబాల్లో వైద్యసంబంధిత ఖర్చుల కు డబ్బులు కావలసి వస్తే ఎక్కడా అప్పు పుట్టడం లేదు. దీంతో సమ యానికి డబ్బు చేతిలో లేక నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతం అనేక కుటుంబాల్లో అవసరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష, ఆపై రూ.5 లక్షల వరకు అప్పు అవసరమైతే వ్యాపారుల నుంచి బంధువుల వరకు ఇవ్వడానికి ముఖం చూపించడం లేదు. ఇస్తే తిరిగి ఇప్పట్లో రావడం కష్టమనే భావనతో చాలామంది అప్పు ఇవ్వడానికి ముందుకురావడం లేదు. అనపర్తితోపాటు మామిడాడ ఫైనాన్స్‌ వ్యాపారులు జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారం కోసం అన్ని ప్రాంతాల్లో నిత్యం తిరుగుతూ కాగితంపై రాస్తే ఎంతైనా అప్పు ఇచ్చేవారు. గ్రామాల్లోని వ్యాపారులు, దళారులు కూడా అప్పు ఇప్పించేవారు. ఇప్పుడు కొవిడ్‌ ముప్పుతో డబ్బు అప్పు ఇవ్వాలనే ఆలోచన విరిమించుకోవడంతో అప్పు పుట్టడం మునుపటితో పోల్చితే ఇప్పుడు చాలాకష్టంగా మారింది. అయితే ఇంట్లో కాస్తోకూస్తో బంగారం ఉన్న వారికి కొంతవరకు అప్పు దొరుకుతోంది. అదికూడా బయట వ్యాపారులు ఇవ్వడం లేదు. ఏదైనా బ్యాంకు లేదా అప్పులిచ్చే కొన్ని ప్రముఖ కంపెనీలు రుణాలిస్తున్నాయి. ప్రస్తు తం బంగారం కుదువ పెట్టి తీసుకునే అప్పులు బ్యాంకుల్లోను, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్న చెన్నై ఫైనాన్స్‌ కంపెనీలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. అయితే బంగారం కుదువపెట్టే స్తోమత లేనివారికి అప్పు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా కూలీ చేసుకునేవారు, చిరు వర్తకులు, రోడ్డుపక్క దుకాణాలు ఏర్పాటుచేసుకున్న వారు, పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అవసరానికి అప్పు దొరకడం లేదు. కొందరైతే బంగా రం లేకపోవడంతో కాకినాడ, రాజమహేంద్రవరం ఇతర ప్రాంతాల్లోని తాకట్టు వ్యాపారం చేసే దుకాణాల వద్దకు బైక్‌లు, ఇంట్లో టీవీలు, ఇతర వస్తువులు కుదువ పెట్టి అప్పులు తేవడం పెరిగింది. దీంతో ఇప్పుడు ఈ వ్యాపారాలు కొంతవరకు పుంజుకున్నాయి. కానీ గ్రామాలు, ఓ మోస్తరు టౌన్లలో వడ్డీ వ్యాపారం చేసేవారు అప్పులు ఇవ్వడం పూర్తిగా ఆపేయడంతో వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు డబ్బు అందక అనేకమంది అగచాట్లు పడుతున్నారు. అక్కడక్కడా కొందరు వ్యాపారులు, ఇంట్లో ఉంటూ ఫైనాన్స్‌ చేసేవాళ్లు మాత్రం ఇదే అదనుగా నూటికి రూ.5 నుంచి రూ.7 వరకు అధికవడ్డీ తీసు కుని ఓ స్థాయి వరకు అప్పులు ఇస్తున్నారు. తీరా ఇవి పేరుకుపోవడంతో అప్పులు భరించలేక తిరిగి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల పిఠాపురంలో ఓ వ్యాపారి మిల్లు ఏర్పాటుకు రూ.25 లక్షలు అప్పు తెచ్చారు. తీరా వడ్డీ రూ.5 లక్షలు అవడం, లాక్‌డౌన్‌తో వ్యాపారం నడవకపోవడంతో అప్పు పెరిగిపోయిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - 2021-06-12T06:16:50+05:30 IST