అభివృద్ధి కోసమే అప్పులు!

ABN , First Publish Date - 2022-09-14T08:37:10+05:30 IST

ద్రవ్య నియంత్రణ బడ్జెట్‌ నిర్వహణ చట్టం(ఎ్‌ఫఆర్‌బీఎమ్‌) పేరుతో రుణ సేకరణకు పరిమితులు విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

అభివృద్ధి కోసమే అప్పులు!

  • కేంద్రం పరిమితి మించి అప్పులు చేస్తోంది
  • రాష్ట్రాలకు మాత్రం కోతలు పెడుతోంది
  • పెరిగిన సంపద పేదలకు పంచుతున్నాం
  • మీలా కార్పొరేట్‌ గద్దలకు ధారపోయట్లేదు
  • నిధుల వాటా 42%.. ఇస్తోంది 29.6 శాతమే
  • కేంద్రం అప్పులు కోటిన్నర కోట్లు
  • తెలంగాణది రూ.3 లక్షల కోట్లు మాత్రమే
  • శాసన సభలో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ద్రవ్య నియంత్రణ బడ్జెట్‌ నిర్వహణ చట్టం(ఎ్‌ఫఆర్‌బీఎమ్‌) పేరుతో రుణ సేకరణకు పరిమితులు విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మంగళవారం శాసనసభలో రాష్ట్ర ప్రగతిపై ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ చట్టం ప్రభావం అన్న అంశంపై లఘ చర్చ జరిగింది. చర్చలో మంత్రి హరీశ్‌  మాట్లాడారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదిహేనో ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్ర రుణ పరిమితులపై సమీక్ష చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సూచించిందని గుర్తు చేశారు. కేంద్రం మాత్రం కమిటీనే వేయకుండా ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ చేసిందన్నారు. తాను ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను పాటించకుండా రాష్ట్రాలను పాటించాలని ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ అవల కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటూ రాష్ట్రాలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర జీఎ్‌సడీపీలో 4 శాతం వరకు అప్పు తీసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని, విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే మరో  అర శాతం అదనంగా తీసుకోవచ్చని చెబుతోందని ప్రస్తావించారు. అర శాతం విలువ రూ.6,144 కోట్లని, సంస్కరణలకు అంగీకరిస్తే రైతు ప్రయోజనాలు దెబ్బ తింటాయని చెప్పారు. ఏపీ సర్కారు విద్యుత్‌ సంస్కరణకు అంగీకరించి, మోటార్లకు మీటర్లు పెట్టి, ఆరు వేల కోట్లు అప్పు తెచ్చుకుందన్నారు.


 రాష్ట్రాలకు ఇచ్చే నిధుల శాతాన్ని  32 నుంచి 42 శాతానికి పెంచినట్లు చెప్పి కేవలం 29.6 శాతం ఇస్తోందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి రూ.33,712 కోట్ల నష్టం జరిగిందన్నారు. కేంద్రం పరిమితికి మించి తీసుకున్న అప్పులకు రికవరీ పెట్టడం లేదని, రాష్ట్రాలకు మాత్రం రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌తో రికవరీ చేస్తామంటోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చింది అభివృద్ధి కోసమేనని హరీశ్‌రావు చెప్పారు. ప్రతీ పైసా సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడం లాంటి కాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కోసం ఖర్చు పెట్టామన్నారు. దేశంలో సొంత పన్నుల రాబడితో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఏటా పన్నుల రాబడి సగటున 11.5 శాతం పెరుగుతోందని గుర్తు చేశారు. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 2.9 శాతమైతే దేశ జీడీపీకి రాష్ట్ర ప్రజలు ఇస్తోంది 4.9 శాతమని ప్రస్తావించారు. దేశం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం ఎక్కువగా ఉందన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర సంపదను పెంచి, నిరుపేదలకు పంచారన్నారు. కేంద్రం లాగా కార్పొరేట్‌ గద్దలకు పంచలేదని దుయ్యబట్టారు. గత ఐదారేళ్లలో కేంద్రం రూ.6 లక్షల కోట్లు పరిమితికి మించి అప్పులు తీసుకుందని హరీశ్‌ ఆరోపించారు. కాళేశ్వరం అతి తక్కువ వ్యయంతో పూర్తి చేశామని హరీశ్‌ చెప్పుకొచ్చారు.

   

అప్పుల్లో  మనది 23వ స్థానం 

ఆర్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన నివేదికలో అతి ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల జాబితా ఇచ్చిందని, అందులో తెలంగాణ 23 ర్యాంకుతో అడుగున ఉందని హరీశ్‌ ప్రస్తావించారు. రాష్ట్రానికి కేంద్రం హక్కుగా రావాల్సిన నిధులను ఇచ్చి ఉంటే తెలంగాణ లక్ష కోట్ల అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఆ డబ్బును బీజేపీ నేతలు ఇప్పించగలిగితే వారికి దండ వేసి సన్మానం చేస్తామన్నారు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 3,65,797 కోట్లు ఇస్తే, కేంద్రం నుంచి కేవలం రూ.1.96,448 కోట్లే తిరిగి వచ్చాయన్నారు. కేంద్రం రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. దాని వల్ల సగటు పౌరుడిపై రూ.1,25,679 తలసరి అప్పు పడిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన రూ.3,29,980 కోట్ల అప్పులతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.94,272 మాత్రమే పడిందన్నారు. 


ప్రభుత్వ ఆసుపత్రుల్లో దసరాకు కొత్తగా 1,000 మంది వైద్యులను నియమించనున్నట్లు  మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అదేక్రమంలో స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టుల నియామకాలను వారం, పది రోజుల్లో ప్రకటిస్తామన్నారు. వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ), అదనపు డైరెక్టర్‌ పదవులకు వయోపరిమితిని 65 ఏండ్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... వైద్యుల నియామకాలు పత్రికల్లోనే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.


కోర్టులకు ఎక్కుతాం 

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కేంద్రం పెండింగులో పెడుతోందని హరీశ్‌అన్నారు. రాష్ట్రానికి వాటాగా రావాల్సిన 550 టీఎంసీలను కేంద్రం కారణంగా కోల్పోతున్నామని చెప్పారు. అన్యాయాన్ని నిలదీస్తున్నందుకే తమపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కేంద్రంపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని, ప్రజా ఉద్యమాలు చేస్తామని, అవసరమైతే న్యాయస్థానాలనూ ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకుంటామని ప్రకటించారు.


రోడ్లు తాకట్టు పెట్టి లక్ష కోట్లు ఇచ్చామని చెబుతారా?

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ.లక్ష కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రులు అబలు చెబుతున్నారని హరీశ్‌రావు అన్నారు. పెట్టింది రూ.21,676 కోట్లు మాత్రమేనన్నారు. తెలంగాణ రోడ్లను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి.. ఆ వచ్చిన డబ్బుతో రోడ్లు వేసి.. టోల్‌గేట్ల ద్వారా ప్రజల ముక్కు పిండి పన్ను వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టం హామీలపై సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హరీశ్‌కు ముందు భట్టి విక్రమార్క, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎర్రబెల్లి దయాకర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌ అన్నారు. గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదని, దేశంలో కొత్తగా 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, రెండు ఐఐఎ్‌సఈఆర్‌లు, 16 త్రిపుల్‌ ఐటీలు, నాలుగు ఎన్‌ఐడీలు ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చింది సున్నా అన్నారు.


వివిధ రాష్ట్రాల్లో మొత్తం 157 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిన కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేంద్ర 80 నవోదయ పాఠశాలలను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి.. మన రాష్ట్రానికి ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం కన్నా తెలంగాణ రాష్ట్రమే (రూ.1900 కోట్లకు పైగా) ఎక్కువ ఖర్చు చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితుల దృష్ట్యా.... ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు ప్రతిపాదనపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని చెప్పారు.  గోదావరి జలాల వాటా తేల్చకుండా కావేరితో అనుసంధానిస్తామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదమన్నారు. తల్లిని చంపి.. బిడ్డను బతికించారని రాష్ట్ర విభజన గురించి మోదీ పదేపదే మాట్లాడటం తెలంగాణను అవమానించడమేనని హరీశ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణకు వారం వారం వచ్చే కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అంశాలపై సమీక్షించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-09-14T08:37:10+05:30 IST