రేషనీకరణ!

ABN , First Publish Date - 2020-04-09T12:33:33+05:30 IST

రేషన్‌ షాపులను వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

రేషనీకరణ!

జిల్లాలో రేషన్‌ షాపుల వికేంద్రీకరణ 

డిపో పరిధిలో మూడు చోట్ల పంపిణీ

6,660 కేంద్రాలు ఏర్పాటుపై యోచన

16 నుంచి రెండో విడతకు సన్నద్ధం

సచివాలయ సిబ్బంది నియామకం

అధికారుల మల్లగుల్లాలు


మొదటి విడత ఉచిత రేషన్‌ పంపిణీ పరేషాన్‌గా మిగిలింది.. జనం ఎగబడ్డారు.. కరోనాను మరచి రేషన్‌ తీసుకునేందుకు పోటీపడ్డారు.. లబ్ధిదారులను నియంత్రించడం  అధికారులు.. పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమించింది.. ఇలాగే 8 రోజుల్లో 90 శాతం పంపిణీ పూర్తయింది.. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీపై అధికారులు.. అటు ప్రజల్లో ఆందోళన నెలకొంది.. ఎందుకంటే జిల్లాలో ఇప్పటికే 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రేషన్‌ షాపుల వికేంద్రీకరణ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెల 15 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ 6660 కేంద్రాల్లో సాగనుంది.. 


నల్లజర్ల, ఏప్రిల్‌ 8 : రేషన్‌ షాపులను వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.ఈ నెల 15వ తేదీ నుంచి రెండో విడత బియ్యం,కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం రేషన్‌ షాపులకు సరుకులను సరఫరా చేస్తోంది. మొదటి విడత తీసుకునేందుకు జనం పోటీపడడంతో  క్యూలు భారీగా పెరిగిపోయాయి. రెండో విడత రేషన్‌లో అటువంటి సమస్య ఉండకూడదనే దిశగా ప్రభుత్వం యోచన చేస్తోంది. దీనిలో భాగంగానే రేషన్‌ షాపుల వికేంద్రీకరణ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మండలస్థాయి నుంచి వికేంద్రీకరణపై అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. ఒక రేషన్‌ షాపు పరిధిలో మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి సచివాలయ సిబ్బందిని నియమించి పంపిణీ చేయాలని ఆలోచన చేస్తుంది.ఇప్పటికే సచివాలయ సిబ్బంది నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 2220 రేషన్‌ డిపోలు ఉండగా వికేంద్రీకరణ జరిగితే 4440 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.                కమ్యూనిటీ హాల్స్‌, ప్రభుత్వ భవనాల్లో  వికేంద్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు చెబుతున్నారు.


జిల్లాలో కొత్తగా 4440 కేంద్రాలు

ప్రతి రేషన్‌ డిపో పరిధిలో మూడు వికేంద్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే అధికారులకు కత్తిమీద  సాములా ఉంది. మూడు          కేంద్రాల్లో మూడు వేయింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసి.. ఒక్కో రేషన్‌ డిపోలో ఉన్న సరుకులను వికేంద్రీకరణ కేంద్రాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 4440 వెయింగ్‌ మిషన్లు సరఫరా చేయడం సాధ్యమయ్యే పనికాదని తెల్చి చెబుతున్నా కిరాణా షాపుల్లో ఉన్న వెయింగ్‌ మిషన్లను ఉదయం 9 గంటల తరువాత సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.


వికేంద్రీకరణ కేంద్రాల్లోనే రేషన్‌ పంపిణీ:రాజు, సివిల్‌ సప్లయిస్‌ డీఎం 

జిల్లాలో 2220 రేషన్‌ డిపోలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ ఇచ్చే ఉచిత సరుకులకు జనం ఇబ్బందిపడకుండా ప్రభుత్వ డిపో పరిధిలో మూడు వికేంద్రీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రేషన్‌ షాపు డీలర్‌ ఆధ్వర్యంలోనే వికేంద్రీకరణ  కేంద్రాలను సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 6660 డిపోల్లో పంపిణీ సాగుతోంది. 


తొలి విడత 90 శాతం రేషన్‌ పంపిణీ

ఉచిత రేషన్‌ పంపిణీ ముగింపుదశకు వచ్చింది.జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం రేషన్‌ పంపిణీ చేసినట్టు జిల్లా పౌరసర ఫరాల శాఖాధికారుల నివేదికలు చెబుతున్నాయి. గతంలో ఉన్న పాత రేషన్‌ కార్డులన్నింటికీ ఈ రేషన్‌ పంపణీ చేశారు.ఏప్రిల్‌ నెల కోటా ఉచిత ంగా బియ్యం,కందిపప్పు, నగదు తీసుకుని పంచ దార అందించారు.జిల్లాలో 12.59 లక్షల రేషన్‌ కార్డులుండగా ఇప్పటి వరకు 11 లక్షల 30 వేల కార్డుదారులకు రేషన్‌ పంపిణీ పూర్తయింది. ఇంకా లక్షా 29 వేల మంది రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేయాల్సి ఉంది.అంతేగాక పోర్టబులిటీ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు.


జిల్లాలో 2,220 చౌకడిపోలు ఉండగా అన్ని చౌకడిపోలలోను రేషన్‌ పంపిణీ దాదాపు పూర్తి కావొచ్చింది.  చాలా చౌక డిపోల్లో సరుకులు పూర్తయిపోయాయి.ఈ మేరకు ఆ షాపులు మూసి వేశారు. మిగిలిన షాపుల్లో మాత్రం సరుకు ఉన్నంత మేరకు పంపిణీ   కొనసాగిస్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి పీఎం మోదీ ప్రకటించిన సాయాన్ని చౌకడిపోల ద్వారా రేషన్‌ కార్డుదారులకు అందించ డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-09T12:33:33+05:30 IST