Abn logo
Oct 27 2021 @ 02:11AM

మీరే నిర్ణయించండి

పదోన్నతుల్లో కోటాపై.. నిర్దిష్ట కొలమానాన్ని


ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనుకబడే ఉన్నారు

వారికి రిజర్వేషన్‌ తప్పనిసరి

ప్రమోషన్లలో కూడా ఇవ్వాల్సిందే

అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదనలు

సుప్రీంకోర్టు తీర్పు వాయిదా

న్యూఢిల్లీ, అక్టోబరు 26: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే నిర్దిష్ట, నిర్ణయాత్మక కొలమానాన్ని నిర్ధారించాలని భారత అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ కోరారు. ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకే వదిలేస్తే.. అంతులేని కథగా తయారవుతుందన్నారు. కోర్టుల్లో లెక్కలేనన్ని వ్యాజ్యాలు దాఖలవుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించే విషయమై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ తన వాదనలు వినిపించారు. అనంతరం తన తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలు వందల ఏళ్లుగా నిరాదరణకు గురై.. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉన్నారని ఏజీ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు. ‘దేశహితం దృష్ట్యా వారికి రిజర్వేషన్‌ రూపంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.   ఈ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను కోర్టు నిర్ణయించకపోతే.. లెక్కకుమిక్కిలి లిటిగేషన్లు వచ్చిపడతాయి. దేని ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి? ప్రభుత్వానికి వదిలేస్తే.. రిజర్వేషన్లు ఎంత వరకు అవసరమో.. ఎంత కాదో తెలియదు. ఈ కథకు ఇక అంతు ఉండదు. వందల ఏళ్ల అణచివేత, అస్పృశ్యత కారణంగా.. మిగతావారితో పోటీపడలేని పరిస్థితి. అందుచేత ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నది నిర్వివాదాంశం. రిజర్వేషన్‌ కల్పన ద్వారా అర్హతలు, మార్కుల విషయంలో సడలింపులు, మినహాయింపులు ఇచ్చాం. ఎంత వరకు వీరికి రిజర్వేషన్‌ కల్పించాలన్నది 1950లోనే చర్చకు వచ్చింది. విద్య, ఉద్యోగావకాశాల్లో గత ఏడు దశాబ్దాల్లో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఏం చేశాయి? రిజర్వేషన్లు ఫలితాన్నిచ్చాయో లేదో ధర్మాసనమే పరిశీలించాలి. ఆ చర్యలు సంతృప్తి కలిగించకపోతే.. ప్రత్యామ్నాయం  చూపించాల్సిన బాధ్యత కోర్టుపైనే ఉంది. నిర్దిష్ట కొలమానం ప్రాతిపదికన అమలయ్యే విధానాన్ని మీరు సూచించాలి. సమాన అవకాశాల కల్పన రాత్రికి రాత్రి జరిగేది కాదు. కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దేశ జనాభాలో వెనుకబడిన వర్గాలు 52 శాతం ఉన్నాయి. దానిప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీలతో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 74.5 శాతం ఉండాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు యాభై శాతానికి మించకూడదని కటాఫ్‌ పెట్టింది’ అని గుర్తుచేశారు. గ్రూప్‌ ఏ కేటగిరీలో అత్యున్నత ఉద్యోగాలు పొందడం ఎస్సీ, ఎస్టీలకు కష్టసాధ్యమని.. అందుచేత వారితోపాటు ఓబీసీలతో ఖాళీల భర్తీకి కోర్టు నిర్మాణాత్మక ప్రమాణాలు సూచించాలని కూడా కోరారు. 1991లో ఇందిరా సాహ్ని (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2018లో జర్నైల్‌సింగ్‌  కేసులో ఇచ్చిన తీర్పు వరకు ఏజీ అన్నిటినీ ప్రస్తావించారు. 1975లో ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీలు 3.5 శాతం, ఎస్టీలు 0.62 శాతం ఉండేవారని.. 2008 నాటికి 17.5, 6.8 శాతానికి పెరిగారని.. అయినప్పటికీ ఇది తక్కువేనని చెప్పారు. అందుకే కోటాను సమర్థిస్తున్నానని తెలిపారు. వాస్తవానికి పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా ఇచ్చే విషయంలో గతంలో తానిచ్చిన ఆదేశాల పునఃసమీక్షకు ఽధర్మాసనం గత నెల 14న నిరాకరించింది. దానినెలా అమలు చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని స్పష్టంచేసింది.