Abn logo
Sep 28 2021 @ 11:08AM

వారం రోజుల్లో Kuwait లోని 60ఏళ్లకు పైబడిన ప్రవాసుల భవితవ్యంపై కీలక నిర్ణయం

కువైత్ సిటీ: కువైత్‌లోని 60ఏళ్లకు పైబడిన వలసదారుల విషయంలో అక్కడి సర్కార్ వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్లు పునరుద్ధరించకూడదని కువైత్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలా చేయడం వల్ల మంచి నైపుణ్యం ఉన్న కార్మికులను కువైత్ కోల్పోతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు. 

అటు మ్యాన్‌పవర్ అథారిటీతో పాటు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ విషయమై చాలా రోజులుగా పరస్పర చర్చులు జరుపుతున్నాయి. ఇటీవల ఇదే విషయమై ఆ దేశ ప్రధాని షేక్ సభా అల్ ఖలేద్‌కు వాణిజ్య, పరిశ్రమల మంత్రి డా. అబ్దుల్లా అల్ సల్మాన్ ఓ లేఖ కూడా రాశారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపాల్సిందిగా ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో మంత్రి మండలి అభిప్రాయంతో పాటు లేబర్ మార్కెట్ మరియు సంబంధిత రంగాల ఆసక్తి తదితర విషయాలను కులంకషంగా పరిశీలించి ఓ నివేదికను వారం రోజులలోపు ఇవ్వాల్సిందిగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు ప్రధాని ఆదేశించారు. దీంతో ఈ వారాంతంలో లేదా వచ్చే వారంలో ఈ సమస్యకు ముగింపు పలకడం ఖాయమని తెలుస్తోంది.   


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...