పత్తిపై దృష్టి

ABN , First Publish Date - 2020-06-01T10:30:11+05:30 IST

తెలంగాణలో పత్తి సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం, వానాకాలంలో మొక్కజొన్నను సాగు చేయవద్దని సూచించడంతో

పత్తిపై దృష్టి

లక్ష ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం

రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు

నకిలీలపై జాగ్రత్తగా ఉండాలని సూచన


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): తెలంగాణలో పత్తి సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం, వానాకాలంలో మొక్కజొన్నను సాగు చేయవద్దని సూచించడంతో రైతులు పత్తి సాగుపై దృష్టిసారిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా వస్తున్న నష్టాలు, పెరుగుతున్న పెట్టుబడులతో విసిగి వేసారిన రైతాంగం పత్తి సాగును క్రమేపి తగ్గిస్తూ వస్తున్నది. ఈ వానాకాలం కూడా గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 15 వేల ఎకరాల్లో పత్తి సాగు తగ్గిపోనున్నదని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే ప్రాథమిక సాగు అంచనాలను సిద్ధం చేసింది. ప్రభుత్వం పత్తి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించడంతో వాటిని మార్చివేసి 1,00,979 ఎకరాలలో పత్తి సాగు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం రైతులను పత్తి సాగు చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ ఉండడంతో నష్టపోయే ప్రమాదం లేదని భావించిన ప్రభుత్వం పత్తి సాగు వైపు రైతుల దృష్టి మళ్లిస్తున్నది. 


బీటీ-3 విత్తనాలపై నిషేధం

జిల్లాలో లక్ష ఎకరాలకు పైబడి పత్తి సాగు జరుగనున్నదని తెలువడంతో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులు అప్పుడే రంగ ప్రవేశం చేశారు. ప్రభుత్వం బీటీ-3 విత్తనాల సాగును నిషేధించింది. బీటీ-3 విత్తనాలు వాడితే కలుపు మందు వాడాల్సిన అవసరం లేదని, గులాబీ, లద్దె పురుగు పంటను ఆశించదని చెబుతూ బీటీ-3 విత్తనాల పేరిట నకిలీ విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకోవడానికి గతంలో మాదిరిగా వ్యాపారులు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రా నుంచి తెచ్చామని చెప్పి విడి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. కొందరు హెచ్‌టీ విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. ఈ విత్తనాలు వేసిన వారు గ్లైపోసైట్‌ మందును కూడా వేయాల్సి ఉంటుంది. దీని కోసం రైతులు ఆ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఈ మందుపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది.  ఇటీవల తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో పోలీసులు 25 లక్షల విలువ చేసే 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు.


అందుబాటులో బీటీ-2 విత్తనాలు

జిల్లాలో ఈ వానాకాలం 1,00,979 ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళిక రూపొందించింది. ఎకరాకు రెండు ప్యాకెట్ల (450 గ్రాములు) చొప్పున రెండు లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయి. సకాలంలో వర్షాలు పడక, నీటి వసతి లేని సందర్బంలో విత్తనాలు మొలవకపోతే మరో విడత విత్తడానికి 50వేల మేరకు విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. బీటీ-2 రకం విత్తనాలు మూడు లక్షల ప్యాకెట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లావ్యవసాయశాఖ చెబుతోంది.  


రైతులు ఆందోళన చెందవద్దు..డీఏవో వాసిరెడ్డి శ్రీధర్‌ 

నకిలీ పత్తి విత్తనాలను అడ్డుకోవడంపై జిల్లా వ్యవసాయశాఖ దృష్టిసారించింది. వ్యవసాయశాఖ, పోలీసుశాఖ నిఘా బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో పత్తి విక్రయాలను నిత్యం గమనిస్తున్నాయి. బీటీ-2 రకం పత్తి విత్తనాలు జిల్లాకు రెండు లక్షల ప్యాకెట్లు అవసరం కాగా మూడు లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీటీ-3, హెచ్‌టీ పత్తి విత్తనాలను రైతులు సాగు చేయవద్దు. హెచ్‌టీ విత్తనాలను విత్తిన పక్షంలో గ్లైపోసైట్‌ గడ్డి మందును వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గడ్డిమందును ప్రభుత్వం నిషేధించింది. ఈ మందును కొన్నవారిపై, అమ్మినవారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు అవకాశమున్నది. రైతులు నకిలీ విత్తన వ్యాపారులను నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దు. 

Updated Date - 2020-06-01T10:30:11+05:30 IST