రాష్ట్రంలో 125 హాట్‌ స్పాట్లు

ABN , First Publish Date - 2020-04-09T09:30:55+05:30 IST

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్యకు అనుగుణంగా హాట్‌ స్పాట్ల నంబరు కూడా పెరుగుతోంది. ఇప్పటి దాకా రాష్ట్రవ్యాప్తంగా 125 హాట్‌స్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఒక్క రాజధానిలోనే 60 ఉన్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట

రాష్ట్రంలో 125 హాట్‌ స్పాట్లు

  • ఒక్క హైదరాబాద్‌లోనే 60
  • ఇంకా పెరగొచ్చని అంచనా
  • రంగంలోకి 3,500 వైద్య బృందాలు
  • 8 3.50 లక్షల మంది వివరాల సేకరణ
  • ఐసొలేషన్‌ నుంచి హోం క్వారంటైన్‌కు మర్కజ్‌ యాత్రికులు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్యకు అనుగుణంగా హాట్‌ స్పాట్ల నంబరు కూడా పెరుగుతోంది. ఇప్పటి దాకా రాష్ట్రవ్యాప్తంగా 125 హాట్‌స్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఒక్క రాజధానిలోనే 60 ఉన్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్‌లో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. హాట్‌స్పాట్లలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ముందు నిర్ణయించింది. అయితే ఆయా ప్రాంతాల్లో వైరస్‌ సామూహికంగా వ్యాప్తి చెందకపోవడంతో ర్యాపిడ్‌ పరీక్షలు అవసరం లేదన్న నిర్ణయానికొచ్చింది. ర్యాపిడ్‌ పరీక్షల కిట్‌ల కోసం పెట్టిన ఇండెంట్‌ను రద్దు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో బుధవారం సాయంత్రం వరకు 454 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధిక కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక ప్రాంతంలో 5-6 కేసులు నమోదైతే దాన్ని హాట్‌స్పాట్‌గా వైద్య ఆరోగ్య శాఖ గుర్తిసోంది. కొన్నిచోట్ల రెండు మూడు కేసులు నమోదైనా హాట్‌స్పాట్లుగా గుర్తించింది. అక్కడ వైరస్‌ తీవ్రతను బట్టి హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.


రంజాన్‌పై దృష్టి 

ఈ నెల 25 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కాబోతోంది. అప్పటికి ప్రస్తుతమున్న వారందరి హోం క్వారంటైన్‌ పూర్తవుతుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. అప్పటికి మర్కజ్‌తో సంబంధం ఉన్న కేసులన్నీ పూర్తయి, రికవరవుతారని భావిస్తోంది. ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశం ఉన్నందున ఇబ్బంది లేదు. ఆ తరువాత ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టింది.


రంగంలోకి 3,500 బృందాలు

రాష్ట్రవ్యాప్తంగా 125 వరకు హాట్‌స్పాట్లను గుర్తించారు. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలను మోహరించారు. కరోనా తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో 60 వేల ఇళ్లను గుర్తించారు. మొత్తం 3.50 లక్షల మందిని పరీక్షించారు. ఇంటింటికి వెళ్లి వారికేమైనా ప్రయాణ చరిత్ర ఉందా? కరోనా పాజిటివ్‌ వ్యక్తులను కలిశారా? వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వైరస్‌ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? తదితర వివరాలు సేకరించారు. 

3,158 మంది ఇంటికి!

మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని హైదరాబాద్‌, జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌లో ఉంచారు. హైదరాబాద్‌లోని గాంధీ, సరోజిని, కింగ్‌ కోఠీ, చెస్ట్‌, నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రుల్లో ఉన్న వారి ఐసోలేషన్‌ గడువు బుఽధవారం ముగియడంతో ఇళ్లకు పంపించారు. ఏప్రిల్‌ 28 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని వారిని అధికారులు ఆదేశించారు. మొత్తం 167 కేంద్రాల నుంచి 3,158 మందిని ఇంటికి పంపుతున్నారు. 

Updated Date - 2020-04-09T09:30:55+05:30 IST