ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ABN , First Publish Date - 2021-01-18T05:36:05+05:30 IST

జిల్లాలో కరోనా విలయతాండవం సృష్టించింది. తొలినాళ్లలో రోజూ కేసుల సంఖ్య డబుల్‌ డిజిట్‌ రాగా రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. వందకు పైగా కేసులు పెరిగాయి. ఆ సంఖ్య మరింత పెరిగి 500కు పైగా నమోదయ్యేవి.

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

పదిన్నర నెలల తరువాత కరోనా జీరో కేసు

తగ్గుముఖం పడుతున్న కేసులు

ఊపిరి పీల్చుకుంటున్న జనం, అధికారులు

అందుబాటులోకి వ్యాక్సిన

(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విలయతాండవం సృష్టించింది. తొలినాళ్లలో రోజూ కేసుల సంఖ్య డబుల్‌ డిజిట్‌ రాగా రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. వందకు పైగా కేసులు పెరిగాయి. ఆ సంఖ్య మరింత పెరిగి 500కు పైగా నమోదయ్యేవి. ప్రతిరోజూ కేసులే.. కరోనా పీడ ఎప్పుడు విరగడవుతుందని జనాలు వేయి కళ్లతో ఎదురు చూసేవారు. అయితే ఇటీవల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈనెల 16వ తేదీ కూడా కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారం మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పదిన్నర నెలల తరువాత ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి. కరోనా వ్యాక్సిన అందుబాటులోకి వచ్చి మొదటి విడతలో ఫ్రంట్‌లైన వారియర్స్‌కు వ్యాక్సిన వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో కరోనా పీడ వదిలిపోతుందని జనం సంతోషిస్తున్నారు. 


ఏప్రిల్‌ 1న 15 కేసులు 

కరోనా వ్యాపించిన మొదట్లో పొరుగు జిల్లాల్లో వైరస్‌ వ్యాపిస్తున్నప్పటికీ జిల్లాలో దాని జాడ లేకుండా ఉండేది. అయితే గత ఏడాది ఏప్రిల్‌ 1న ఒకేరోజు 15 కేసులు నమోదై కలకలం సృష్టించింది. ఢిల్లీ, నిజాముద్దీన మర్కజ్‌లో జరిగిన తబ్లిక్‌ జమాతలకు జిల్లా నుంచి పలువురు వెళ్లి వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా కడపలో నలుగురికి, ప్రొద్దుటూరులో 7, పులివెందుల 1, బద్వేలు 1, వేంపల్లెలో ఇద్దరికి పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. అప్పట్లో అది కలకలం రేపింది. ఏప్రిల్‌ చివరి నాటికి కేసుల సంఖ్య 73కు చేరుకుంది. ఏప్రిల్‌ 15న 36 కేసులు నమోదైతే చివరి నాటికి 73 కేసులు నమోదయ్యాయి. మే 15కు 102 కేసులు, 31కి 136 కేసులు నమోదయ్యాయి. జూన 15కి 373 కేసులు నమోదయ్యాయి.


విలయతాండవం

జూన రెండో వారం నుంచి జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. జూన 15కు 373 కేసులు నమోదైతే 31 నాటికి 1099 కేసులు నమోదయ్యాయి. జూలై 15 నాటికి ఆ సంఖ్య 2248కి చేరింది. 15 రోజుల వ్యవధిలో 1100 కేసులు నమోదయ్యాయి. జూలై 30 నాటికి 8061 కేసులు నమోదయ్యాయి. 15 రోజుల వ్యవధిలోనే 5813 కేసులు వచ్చాయి. ఆగస్టు 15 నాటికి 16,707 కేసులకు చేరుకుంది. 31కి 26,304 కేసులు వచ్చాయి. సెప్టెంబరు 15కు 37,337 కేసులకు పెరిగాయి. సెప్టెంబరు 30కి 44,003 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 1 నాటికి 44,403 పాజిటివ్‌ కేసులు ఉంటే 15 నాటికి 49,324కు చేరింది. నవంబరు 1న 52,395 కేసులు నమోదయ్యాయి. 15కు 53,200 చేరింది. డిసెంబరు 1కి 54,567 కేసులకు చేరుకోగా 15కు 54,872కు చేరింది. జనవరి 1 నాటికి 55,193కు చేరుకుంది. జనవరి 16కు 55,342 కేసులు నమోదయ్యాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కరోనా కలకలం రేపగా, నవంబరు నుంచి కాస్త తగ్గుముఖం పట్టింది. మొత్తానికైతే పదిన్నర నెలల తరువాత ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-01-18T05:36:05+05:30 IST