పెట్రోల్‌పై తగ్గేదేలే!

ABN , First Publish Date - 2022-01-19T08:34:30+05:30 IST

పెట్రోల్‌పై తగ్గేదేలే!

పెట్రోల్‌పై తగ్గేదేలే!

సొంత పన్నులపై వెనక్కి తగ్గని వైసీపీ ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా 22 రాష్ర్టాలు, యూటీల్లో తగ్గింపు

జార్ఖండ్‌లో రూ.25, ఢిల్లీలో 8 చొప్పున ఉపశమనం 

కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిల్లోనూ కుదింపు 

ఆ దిశగా ఆలోచన కూడా చేయని జగన్‌ ప్రభుత్వం  

అత్యధిక రేట్ల జాబితాలో దేశంలోనే మూడో స్థానం

పెంపునకు అనుగుణంగా పెరిగిన సొంత ఆదాయం 

అది చెప్పకుండా మేం ధరలు పెంచలేదనే వాదన 

ఆదాయం పెరిగిందో, లేదో చెప్పాలని డిమాండ్లు 


పెట్రోల్‌ ధరలపై ‘‘ఊరందరిదీ ఒకదారి...’’ అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం తీరు తయారైంది. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ధరలు తగ్గించినా తాము మాత్రం పైసా కూడా తగ్గించే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర సర్కారు భీష్మించుకు కూర్చుంది. కేంద్రం చెప్పినా కూడా సొంత పన్నులు తగ్గించకుండా పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఆదాయం కోసం ఆవురావురుమంటోంది. పైకి మాత్రం పెట్రో ధరలు తామేమీ పెంచలేదని, పెంచిన వాళ్లే తగ్గించాలంటూ ప్రభుత్వ పెద్దలు కల్లబొల్లి కబుర్లతో ప్రజలను మాయ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై అధికార పార్టీపై దుమ్మెత్తి పోసిన జగన్‌.. ఇప్పుడు కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఆకాశాన్ని తాకడంతో గత దీపావళి రోజున కేంద్రం కొంత ఉపశమనం కలిగించింది. డీజిల్‌పై రూ.10, పెట్రోల్‌పై రూ.5 చొప్పున తగ్గించింది. కేంద్రం తన ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని కోరింది. దీనిపై అనేక రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు స్పందించాయి. సొంత పన్నులు తగ్గించుకోవడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించి కొంతైనా ఉపశమనం కలిగించాయి. తాజాగా జార్ఖండ్‌ ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తామని ప్రకటించింది. అయితే అది తెల్లకార్డులు ఉన్నవారికేనని, నెలకు పరిమిత లీటర్లు ఇస్తామని చెప్పింది. దీంతో ద్విచక్ర వాహనదారులకైనా అక్కడ ఎంతోకొంత ఉపశమనం లభిస్తోంది. ఇక కేంద్రం ఏం చెప్పినా పెడచెవిన పెట్టే ఢిల్లీ ప్రభుత్వం కూడా లీటరుపై రూ.8 తగ్గించింది. 30శాతంగా ఉన్న వ్యాట్‌ను 19.4శాతానికి తీసుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం దాదాపు రెండు నెలల కిందటే లీటరుపై రూ.3 తగ్గించింది. ఇక కర్ణాటక ప్రభుత్వం 7శాతం వ్యాట్‌ను తగ్గించడంతో కేంద్రం తగ్గింపు కూడా కలిపి లీటరు పెట్రోల్‌పై రూ.13 తగ్గింది. పుదుచ్చేరిలో రూ.12, మిజోరాంలో రూ.12.60, అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.10, బిహార్‌లో రూ.7.89, గుజరాత్‌లో రూ.11.53 మేర ధరలు తగ్గాయి. కానీ ఏపీలో మాత్రం కేంద్రం తగ్గించిన రూ.5 తప్ప అదనంగా ఒక్క పైసా కూడా తగ్గించలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు పెట్రో ధరల విషయంలో ఉపశమనం లేకుండా పోయింది. 


దేశంలోనే మూడో స్థానం 

పెట్రోల్‌ ధరల విషయంలో ఏపీ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. రాజస్థాన్‌లోని ఒక్కప్రాంతంలో అత్యధికంగా లీటరు రూ.112 ఉంది. అది మినహాయిస్తే ఆ రాష్ట్రంలో మిగిలినచోట్ల రూ.106 నుంచి రూ.108 మధ్యలోనే ఉంది. మహారాష్ట్రలో ధర రూ.110 నుంచి రూ.111 మధ్యలో ఉండగా, ఏపీలోనూ ఇదే తరహాలోనే రేట్లు ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఆ ఒక్క ప్రాంతం, మహారాష్ట్ర తర్వాత స్థానం ఏపీదే. డీజిల్‌ రేట్ల విషయంలోనూ ఏపీ మూడో స్థానంలో ఉంది. 


పన్నులతో బాదుడు  

పెట్రో ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం ఎక్కడాలేని పన్నులతో ప్రజలను బాదేస్తోంది. పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5శాతం వ్యాట్‌ వసూలు చేస్తోంది. ఇదికాకుండా లీటరుపై రూ.4 అదనపు సెస్‌ విధిస్తోంది. ఇవి చాలవన్నట్టు రోడ్ల అభివృద్ధి పన్ను పేరిట లీటరుపై రూ.1 వసూలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇన్ని రకాల పన్నులు వేయడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అదనపు సెస్‌ను రూ.2 పెంచింది. రోడ్ల అభివృద్ధి పన్ను కూడా కలిపితే లీటరుపై రూ.3 పెరిగింది. 


అదనపు ఆదాయం మాటేంటి... 

‘‘మేం పన్నులు పెంచలేదు. పెంచని పన్నులు మేమెందుకు తగ్గించాలి. పెంచినోళ్లే తగ్గించుకోవాలి’ అని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ కేంద్రం ధరలు పెంచడంతో రాష్ట్రం అదనపు ఆదాయం పొందుతోందా? లేదా? అనే విషయం మాత్రం చెప్పడం లేదు. ఉదాహరణకు పెట్రోల్‌ లీటరు ధర రూ.90 వద్ద ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వానికి లీటరుపై రూ.20.91 వ్యాట్‌ ఆదాయం వచ్చింది. అదే లీటరు ధర రూ.110 అయినప్పుడు రూ.28.49 వస్తోంది. డీజిల్‌ ధర రూ.80 ఉన్నప్పుడు రూ.16.3 వస్తే, ఇప్పుడు రూ.21.78 వస్తోంది. దీనిబట్టి ధరల పెంపుతో ప్రభుత్వం అదనంగా పన్నులు వసూలు చేస్తోందని అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో పెట్రోలు ధరల తగ్గింపు అనేది లేనందున, ఏపీ ప్రభుత్వం కేంద్రం పేరు చెప్పుకొని ప్రజల నుంచి పెద్దమొత్తంలో పన్నులు లాగుతోంది. ప్రజలు ఆశించినట్లుగా ధరలు తగ్గిస్తే రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఊహించని స్థాయిలో పెరిగిపోతాయి. 


అప్పుడు లేదా ఈ తెలివి? 

గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌... దేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్కడా లేని ధరలు ఏపీలో ఉన్నాయని పదేపదే చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై అసెంబ్లీలోనూ నిలదీశారు. పాదయాత్రలోనూ ఈ విషయాన్ని తరచూ ప్రస్తావించారు. ధరల పెంపు రాష్ట్రం చేతిలో ఉండదని అప్పట్లో జగన్‌కు తెలియదా అని ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అంత ప్రజలపై అంత ప్రేమ ఉంటే ఇప్పుడు ధరలు ఎందుకు తగ్గించడం లేదని నిలదీస్తున్నారు.

Updated Date - 2022-01-19T08:34:30+05:30 IST