ప్రాజెక్టులకు తగ్గుతున్న ప్రవాహం!

ABN , First Publish Date - 2021-06-22T10:06:14+05:30 IST

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు కొద్దిరోజులుగా వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో నీటి మట్టాలు నిలకడగా కొనసాగుతున్నాయి.

ప్రాజెక్టులకు తగ్గుతున్న ప్రవాహం!

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు కొద్దిరోజులుగా వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో నీటి మట్టాలు నిలకడగా కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్‌ నీటి మట్టం సోమవారం సాయంత్రానికి 532.70 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 500 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రానికి 7669 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 532.70 అడుగులు(173.4655టీఎంసీలు) ఉంది. మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 635.50అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు కాగా, ప్రస్తుతం 148.75అడుగులుగా ఉంది. డిండి ప్రాజెక్టు నీటిమట్టం 31.5 (రెండు టీఎంసీ) అడుగుల వద్ద స్థిరంగా ఉండగా.


ఈ ప్రాజెక్టు నుంచి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ సోమవారం నీటిని విడుదల చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని 12,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు కూడా వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసి వేయడంతో 5,139 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,067 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది. సోమవారం బ్యారేజీలోకి వచ్చే 16,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో పాటు అదనంగా బ్యారేజీలో నిల్వ ఉన్న మరో 4700 క్యూసెక్కుల నీటిని ఎగువన ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-22T10:06:14+05:30 IST