తగ్గుతున్న కూరగాయల సాగు

ABN , First Publish Date - 2021-12-06T06:15:00+05:30 IST

జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతున్నది. విశాఖ నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతుండడం, పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు అవుతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది.

తగ్గుతున్న కూరగాయల సాగు

నగరంతో పాటు జిల్లాలోని ముఖ్య ప్రాంతాల వాసులకు రోజుకు 50 టన్నులు అవసరం

జిల్లాలో ఉత్పత్తి అవుతున్నది 20 టన్నులే!

మిగిలిన సరకు కోసం దిగుమతులే ఆధారం

అందుకే కొరత, ధరల పెరుగుదల

రైతుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవు

రెండున్నరేళ్లుగా సబ్సిడీలు నిలిపివేత 

రూ.కోట్లలో బకాయిలు 


జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతున్నది. విశాఖ నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతుండడం, పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు అవుతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. అధికారుల అంచనా ప్రకారం సుమారు దశాబ్ద కాలం క్రితం జిల్లాలో పది వేల హెక్టార్లకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగు అయ్యేవి. ఇప్పుడు ఐదు వేల హెక్టార్లలో కూడా సాగు చేయడం లేదు. మరోవైపు నగర జనాభా గణనీయంగా పెరుగుతున్నది. స్థానికంగా పండే కూరగాయలు ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ కారణాల వల్ల కూరగాయల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఆనందపురం, సబ్బవరం, కశింకోట, రోలుగుంట, కె.కోటపాడు, గొలుగొండ, రావికమతం, దేవరాపల్లి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, చింతపల్లి మండలాల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తుంటారు. ఈ ప్రాంతాల నుంచి సీజన్‌లో... అంటే డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు రోజుకు 25 నుంచి 30 టన్నుల వరకు, అన్‌ సీజన్‌లో (మే నుంచి నవంబరు వరకు) రోజుకు 20 టన్నులకన్నా తక్కువ కూరగాయలు ఆయా మార్కెట్లకు వస్తుంటాయి. విశాఖ నగరంతోపాటు అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, తదితర పట్టణ ప్రాంతాల ప్రజలకు నిత్యం 50 నుంచి 60 టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. ఈ లెక్కన జిల్లా ప్రజల అవసరాల్లో సగం కూరగాయలు మాత్రమే స్థానికంగా పండుతున్నాయి. మిగిలిన కూరగా యలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. స్థానిక రైతులు పండించే టమాటా ఇంకా కోతకు రాకపోవడంతో ప్రస్తుతం చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కోల్‌కతా నుంచి వంకాయలు, బీరకాయలు, చిక్కుళ్లు, బెంగళూరు నుంచి క్యారట్‌, క్యాప్సికమ్‌, తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం నుంచి వంగ, బెండ, కంద తదితర కూరగాయలు వస్తున్నాయి. ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల నుంచి క్యారట్‌,  క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వస్తున్నాయి. 


కార్తీక మాసంలో మండిన కూరల ధరలు

కార్తీకమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన కూరగాయ పంటలు అక్టోబరు నాటికి కాపు ఆగిపోతాయి. రైతులు నవంబరు నెలలో రబీ పంటలు వేస్తుంటారు. ఇవి డిసెంబరు మధ్య నుంచి కాపుకొస్తుంటాయి. దీంతో అక్టోబరు నుంచి డిసెంబరు చివరి వరకు కూరగాయల కొరత ఏర్పడి, ధరలు పెరుగుతుంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే ధరలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటాయి. ఏటా కార్తీకమాసంలో కూరగాయల ధరలు అధికంగా వుండడం సాధారణమే అయినప్పటికీ...ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబరు చివరిలో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏడాది పొడవునా టమాటా సాగు చేసే చిత్తూరు జిల్లాలో నవంబరు నెలలో కురిసిన భారీవర్షాలు, ఈ పంటను పూర్తిగా దెబ్బతీశాయి. దీంతో దిగుమతులు బాగా తగ్గిపోయి, ధరలు విపరీతంగా పెరిగాయి.


సగటు దిగుబడి అంతంత మాత్రమే....

జిల్లాలో కూరగాయ పంటల సగటు దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా పండే వంగ, బెండ, బీర, దొండ, తదితర పంటలు హెక్టారుకు సగటున 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తున్నాయి. డ్రిప్‌ సిస్టమ్‌ వున్నట్టయితే మరో పది టన్నుల వరకు పెరుగుతుంది. కానీ కొత్త రకం వంగడాలతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్న ప్రాంతాల్లో హెక్టారుకు 50 టన్నులకు పైబడి కూరగాయలు పండుతున్నాయి. విశాఖ జిల్లా రైతులకు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ప్రభుత్వం సరఫరా చేయకపోవడం, తెగుళ్ల బెడద, ఆధునిక పద్ధతులు పాటించకపోవడం వంటి కారణాల వల్ల పంట దిగుబడుల్లో పెద్దగా పురోగతి వుండడంలేదు. దీంతో జనాభా అవసరాలకు సరిపడ కూరగాయలు పండడంలేదు.


కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం

జిల్లాలో కూరగాయలు, ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులకు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందడం లేదు. కూరగాయలు సాగు చేసే రైతులకు విత్తనాల నిమిత్తం హెక్టారుకు రూ.3 వేలు సబ్సిడీ ఇవ్వాలి. రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు. కలుపు తీయడానికి ఉపయోగించే రొటోవేటర్ల కొనుగోలుపై రూ.40 వేలు, మందులు పిచికారీ చేసే స్ర్పేయర్లపై రూ.2-8 వేల వరకు సబ్సిడీ ఇవ్వాలి. బిందు, తుంపర సేద్య పరికరాలకు గత ప్రభుత్వం 50 నుంచి 100 శాతం వరకు రాయితీ ఇచ్చింది. తీగజాతి కూరగాయ పంటలు సాగు చేసే రైతులు పందిళ్లు వేసుకోవడానికి లక్ష రూపాయాల వరకు సబ్సిడీ ఇచ్చింది. ఇంకా క్రేట్లు, టార్పాలిన్లు సరఫరా చేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయితీలను పూర్తిగా ఆపేసింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడడంతో కూరగాయ పంటల సాగు తగ్గిపోతున్నది.  


సబ్సిడీ నిధులు రావలసి ఉంది

కె.గోపీకుమార్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌, సూక్ష్మసాగునీటి పథకం

కూరగాయ విత్తనాల నుంచి పరికరాల కొనుగోలు వరకు ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది. అయితే జిల్లాలో చాలా మంది రైతులకు రెండేళ్ల నుంచి సబ్సిడీలు అందడం లేదు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. కనీసం రూ.5 కోట్లు విడుదల చేస్తే ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తాం. కలెక్టర్‌ ఆదేశాలతో కూరగాయల పంటల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం.

Updated Date - 2021-12-06T06:15:00+05:30 IST