Abn logo
Jul 8 2020 @ 00:00AM

మాస్టారూ మాస్క్ ఏస్కోండి!

కీప్‌ యువర్‌ డిస్టెన్స్‌... బాధ్యత ఉండక్కర్లా? సభ్య సమాజానికి ఏం మెస్సేజ్‌ ద్దామని! ...ఇది ఎవరో ఆవేశంలో అన్నది కాదు. ఇంకెవరి సలహానో అంతకంటే కాదు. మరి..! మాస్క్‌లు ఇచ్చే పంచ్‌లు! ‘ఒక్క సిరా చుక్క కోటి మెదళ్ల కదలిక’ అన్నట్టు... ఒక్క మాస్క్‌ ఎంతో మందిని జాగృతం చేస్తోంది. ఈ కరోనా కాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు గుర్తు చేస్తుంది. సినిమాల్లో పేలిన పంచ్‌ డైలాగ్‌లనే సందర్భోచితంగా... దేశాత్మకంగా మాస్క్‌లపై ముద్రించి సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది కొందరు యువత నిర్వహిస్తున్న ‘దేడ్‌ దిమాగ్‌’ అంకుర సంస్థ. 


‘మనిషి ఐడెంటిటీ అతని పని. ఆ పని చేయాలన్నా, కలలు నెరవేర్చుకోవాలన్నా అతడు బతికుండాలి. బతికుండాలంటే మాస్క్‌ వేసుకోవాలి’’... ఇది వాసిరెడ్డి హరీశ్‌ మాట. అతనెవరనా? ‘దేడ్‌ దిమాగ్‌’ సంస్థ వెనకనున్న క్రియేటివ్‌ మైండ్‌. ఏడాదిన్నర కిందట ఓ వినూత్న ఆలోచనతో దీన్ని ప్రారంభించాడు. అయితే ఇటీవల కరోనా కాలంలో మార్కెట్‌లో దొరికే మాస్క్‌లు నాణ్యత లేకపోవడం, అధిక ధరలకు అమ్మడం గమనించిన అతడు... ఎలాంటి లాభం లేకుండా వాటిని ఉత్పత్తి ధరకే ఇస్తున్నారు. నాణ్యత ఒక్కటే కాదు... స్టయిల్‌, క్యాప్షన్లతో యువతను ఆకర్షించేలా ట్రెండీగా ఉండడం వీటి ప్రత్యేకత. 


సమాజ హితం... 

‘‘సంపాదించిన డబ్బులు బ్యాంకు అకౌంట్‌లో నుంచి తీసివ్వడం ఒక పద్ధతి. సంపాదించే అవకాశం కళ్లెదురుగా కనిపిస్తున్నా సమాజ హితం కోరి వదులుకోవడం ఇంకో పద్ధతి. ఆ రెండో రకమే మేము’’ అంటాడు హరీశ్‌. అందుకే ఈ విపత్కాలంలో సాధ్యమైనంతమందికి మాస్క్‌లు అందించాలనుకున్నాడు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌ఓ) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేశాడు. వాళ్లు కాటన్‌తో కుట్టిన ఈ మూడు లేయర్ల మాస్క్‌ ధర యాభై రూపాయల లోపే! ఇది వాషబుల్‌, రీయూజబుల్‌. 


మనసు పడనివారు లేరు... 

ఇప్పుడు మాస్క్‌లు డ్రెస్సింగ్‌లో భాగమైపోయాయి. అవీ ఫ్యాషన్‌లో చేరిపోయాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే సరికొత్తగా ఆలోచన చేసింది హరీశ్‌ అండ్‌ టీమ్‌. చూడడానికి బాగుండాలి. సందేశం ఇచ్చినట్టుండాలి. అదేసమయంలో జనానికి రీచ్‌ అవ్వాలి. అప్పుడే అందరికీ అవగాహన పెరిగి, మాస్క్‌లు తమ జీవనంలో భాగం చేసుకొంటారనేది వాళ్ల ఆలోచన. ఆ ఆలోచనకు రూపమే ఈ ట్రెండీ మాస్క్‌లు. మార్కెట్‌లోకి వదలడమే ఆలస్యం... ఈ ట్రెండీ మాస్క్‌లకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన  వచ్చింది. ముఖ్యంగా కుర్రకారుకు తెగ నచ్చేశాయి. 


విదేశాల్లోనూ క్రేజ్‌... 

అంతగా ఆకట్టుకోవడానికి ఆ మాస్క్‌ల్లో ఏముంది? ఇవి మాట్లాడతాయి. మీ భావాలను ప్రతిబింబిస్తాయి. ఈ కరోనా కాలంలో ఎలా ఉండాలో... ఎలా ఉండకూడదో చెబుతాయి. అదీ సూటిగా... సుత్తి లేకుండా! ఇప్పటి వరకు యాభై వేలకు పైగా మాస్క్‌లు విక్రయించింది ‘దేడ్‌ దిమాగ్‌’. వెబ్‌సైట్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఎవరైనా మాస్క్‌లు కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు... వీటికి విదేశాల్లోనూ మాంచి డిమాండ్‌ ఉంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌, దుబాయ్‌, కువైట్‌, ఆస్ర్టేలియా, సింగపూర్‌లకు కూడా పంపిస్తున్నారు. ఆ దేశాల నుంచి చాలా ఆర్డర్లు వస్తున్నాయి. అమెరికాలో ‘కీప్‌ యువర్‌ డిస్టెన్స్‌’ మాస్క్‌ బాగా ఆదరణ పొందింది. 

వీటితో పాటు ఇప్పుడు ఫేస్‌ షీల్డ్స్‌ కూడా అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ. ‘‘బయట మార్కెట్‌లో 200 మైక్రాన్ల మందమున్న చౌకబారు ఫేస్‌ షీల్డ్స్‌ రూ.100 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. కానీ మేము 400 మైక్రాన్‌తో చేసినవి ఐదు రూపాయల మార్జిన్‌తో రూ.50కే ఇస్తున్నాం. ఆ ఐదు రూపాయలు కూడా మా ఆఫీస్‌ ఖర్చుల కోసం. అలాగే కొత్తగా అతి తక్కువ ధర (రూ.25)కు ‘కొవిడ్‌ కీ’ కూడా తెచ్చాం’’ అని హరీశ్‌ వివరించారు. 


‘హీరో’లకు ప్రత్యేకం... 

‘‘పోలీసులు, డాక్టర్లు, నర్సులు... ఈ కరోనా కాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న నిజమైన హీరోలు వారు. అలాంటి వారికి ఓ చిరుకానుకలా ‘హీరో’ మాస్క్‌లు రూపొందించాం. వాటిని తెలంగాణ పోలీసులకు ఇచ్చాం. కాన్సెప్ట్‌ నచ్చి, వివిధ ప్రభుత్వ విభాగాలు మాకు ఆర్డర్లు ఇస్తున్నాయి. మా ప్రయత్నం ప్రజలకు చేరినందుకు సంతోషంగా ఉంది’’ అంటారు హరీశ్‌. నిజానికి అతను చదివిన చదువుకు... ఇప్పుడు చేస్తున్న పనికీ ఎక్కడా పొంతన లేదు. 


వాళ్లూ పోటుగాళ్లే... 

ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన హరీశ్‌ జీవితం ఆ తరువాత అనుకోని మలుపు తిరిగింది. అతనికి సినిమాలకు స్ర్కిప్ట్‌ రాయడమంటే ఎంతో ఇష్టం. ‘‘ఆ ఇష్టంతోనే చదువుకొనే రోజుల్లో అటు వైపు అడుగులు వేశాను. ‘స్వాతి చినుకులు, చంద్రముఖి, ముద్దమందారం, కలవారి కోడలు, పెళ్లినాటి ప్రమాణాలు’ తదితర సీరియల్స్‌కు ఘోస్ట్‌ రైటర్‌గా పని చేశాను. నా అభిలాషను నెరవేర్చుకోవడానికి సినిమా ప్రయత్నాలు చేస్తుంటే... తెలిసిన వాళ్ల ద్వారా ‘శ్రేయస్‌ మీడియా’లో ఈవెంట్‌ హెడ్‌గా అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే మార్కెటింగ్‌, డిజైనింగ్‌... చాలా నేర్చుకున్నా. ఇంతలో నాన్న అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన కోసం మా సొంతూరు ఖమ్మం జిల్లాలోని పాయపూర్‌కు వెళ్లిపోయాను. ఏడాదిన్నర ఏ పనీ లేకుండా అక్కడే గడిచిపోయింది. ఖాళీగా ఉన్న నన్ను చూసి ‘దేడ్‌ దిమాగ్‌’ అంటూ చులకనగా మాట్లాడటం మొదలుపెట్టారు. అవన్నీ విని నాన్న... మానసికంగా కూడా కుంగిపోయి, చివరకు ఆ బాధతో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఆ ఘటన నన్ను మనోవేదనకు గురి చేసింది. అదే సమయంలో కసినీ పెంచింది. ఈ ‘దేడ్‌ దిమాగ్‌’ గాళ్లే ప్రపంచాన్ని మార్చగలరని నిరూపించాలనుకున్నా. అలా మొదలైందే ‘దేడ్‌ దిమాగ్‌’ అంకుర సంస్థ’’ అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు హరీశ్‌. సృజనే పెట్టుబడి... 

పేరుకు తగ్గట్టుగానే ‘దేడ్‌ దిమాగ్‌’ ఉత్పత్తులు కూడా వినూత్నంగా ఉంటాయి. తెలుగు సినిమా పాపులర్‌ డైలాగ్స్‌తో రూపొందించిన టీషర్ట్స్‌ సంస్థ ప్రత్యేకత. ఇలా పూర్తిస్థాయి తెలుగు క్యాప్షన్లతో టీషర్ట్‌ తేవడం ‘దేడ్‌ దిమాగ్‌’తోనే మొదలైంది. దీనికి సృజనే పెట్టుబడి. పెద్దగా ఖర్చు లేకుండానే హరీశ్‌ ఈ సంస్థను ప్రారంభించారు. సెలబ్రిటీలకు సైతం ఈ కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. ఇప్పుడిది తొమ్మిది మంది సభ్యుల బృందంతో విజయ పథాన నడుస్తున్న సంస్థ. డిజైనింగ్‌, మేకింగ్‌, మార్కెటింగ్‌... అన్నీ ఈ బృందమే చూసుకొంటుంది. ఇప్పుడు హరీష్‌ కథ విన్నవారెవరైనా చెప్పేది ఒక్కటే... ఒక ‘దేడ్‌ దిమాగ్‌’గాడు తలుచుకొంటే దునియాను దున్నగలడని! 


‘ముఖాల’పై పేలిన కొన్ని పంచ్‌లు... 

 1. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్‌ ఇద్దామని! 
 2. మాస్టారూ మాస్క్‌ ఏస్కోండి 
 3. బాధ్యత ఉండక్కర్లా? 
 4. కీప్‌ యువర్‌ డిస్టెన్స్‌ 
 5. లోపల ఒరిజినల్‌ అలాగే ఉంది 
 6. నాకు బూతులు ఊరికే రావు 
 7. ఉచిత సలహాలు ఇవ్వకు 
 8. గ్యాప్‌ ఇవ్వలేదు... వచ్చింది... 
 9. నాకు కొంచెం స్పేస్‌ కావాలి 
 10. గో కరోనా 
 11. నేను సైతం 
 12. మాస్క్‌యే కదా అని పీకేస్తే... 
-హనుమా 

Advertisement
Advertisement
Advertisement