దేదీప్యం

ABN , First Publish Date - 2020-12-01T05:11:10+05:30 IST

కార్తీక పౌర్ణమి నేపథ్యంలో సోమవారం ఇరుజిల్లాల్లోని దేవాలయాల్లో పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునుంచే దీపాలు వెలిగించేందుకు ఆలయాలకు భక్తులు తరలివెళ్లారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పౌర్ణమి శోభను సంతరించుకుంది.

దేదీప్యం
భద్రాచలంలో గోదావరి తీరాన కార్తీక స్నానాలు చేస్తున్న భక్తులు, (ఇన్‌సెట్‌లో) ఖమ్మంలోని గుంటుమల్లేశ్వరస్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు 

పౌర్ణమి రోజున ఆలయాలకు పోటెత్తిన భక్తులు

దీపకాంతులతో శోభిల్లిన భద్రగిరి 

గోదావరిలో ప్రమిదలు వదిలిన భక్తులు

రామాలయంలో వైభవంగా కృత్తికా దీపోత్సవం 


ఖమ్మం సాంస్కృతికం /కొత్తగూడెం సాంస్కృతికం / భద్రాచలం, నవంబరు 28: కార్తీక పౌర్ణమి  నేపథ్యంలో సోమవారం ఇరుజిల్లాల్లోని దేవాలయాల్లో పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునుంచే దీపాలు వెలిగించేందుకు ఆలయాలకు భక్తులు తరలివెళ్లారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పౌర్ణమి శోభను సంతరించుకుంది. ఈసారి కార్తీక పౌర్ణమి ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉండటంతో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దామోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదిలో కార్తీక దీపాలు వదిలారు. గోదావరి తీరంలో ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, భద్రాద్రి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు భక్తులు సత్యనారాయణస్వామి వ్రతం చేశారు.

భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పూజలు

భక్తులు ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో తెల్లవారుజామునుంచే కార్తీక దీపాలను వెలిగించారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఖమ్మం నగర పరిధిలోని వైరా రోడ్డు జలాంజనేయస్వామి ఆలయం, ఎస్పీ ఆఫీసురోడ్డులోని శివాలయం, బ్రాహ్మణబజారులోని శివాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. నగరంలోని యూపీహెచ్‌ కాలనీలోని స్వయంభూ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.    కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొండల్‌రావు, సూర్యం, అంజయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కూసుమంచి గణపేశ్వరాలయం, మధిర, వైరా స్నానాల లక్ష్మీపురం, తల్లాడ తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం గణేష్‌ టెంపుల్‌, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు.    

రామాలయంలో వైభవంగా కృత్తికా దీపోత్సవం

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో కృత్తికా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కృత్తికా దీపోత్సవానికి అంకురార్పణ నిర్వహించగా సోమవారం ఉదయం అగ్నిప్రతిష్ట, హోమం నిర్వహించారు. నిత్య కల్యాణ మండప వేదిక వద్ద ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం హోమం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఏటా భద్రాద్రి రామాలయంలో కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహిస్తుండగా... ఈ ఏడాది కూడా పోలీసుశాఖ సహకారంతో నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామిని తిరువీధి సేవకు తీసుకెళ్లగా చప్టా దిగువలో చొక్కాసుర వధ కార్యక్రమాన్ని సంప్రదాయద్ధంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ కుటుంబ సభ్యులు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, తదితర వైదిక సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-01T05:11:10+05:30 IST