ఎండీయూ బినామీలుగారేషన్‌ డీలర్లు!

ABN , First Publish Date - 2021-07-29T06:00:47+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థలో మొబైల్‌ డి స్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లుగా రేషన్‌ డీలర్లు ఉండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఎండీయూ బినామీలుగారేషన్‌ డీలర్లు!

 ముగ్గురు రేషన్‌ డీలర్లు, మరొకరు వారి బంధువు 

 డీలర్ల పేరుతో డ్రా చేసిన డబ్బులు హుళక్కి 

సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత కలెక్టర్‌దే 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థలో మొబైల్‌ డి స్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లుగా రేషన్‌ డీలర్లు ఉండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రేషన్‌ డీలర్లను స్టాకిస్టులుగా పరిమితం చేసిన నేపథ్యంలో, అదే రేషన్‌ డీలర్లు ఎండీయూ ఆపరేటర ్ల అవతారం ఎత్తడం కలకలం సృష్టిస్తోంది. నగర పరిధిలో ముగ్గురు రేషన్‌ డీలర్లు ఎండీయూలుగా ఉన్నారన్న విషయం కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు ద్వారా కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇది ఇది ఏ ఒక్క సర్కిల్‌కో, మండలానికో సంబంధించినది కాదు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి తంతు నడుస్తోంది. అధికారులు తప్పు చేశారా? వ్యవస్థ సక్రమంగా నడుస్తుందా లేదా అన్నది తెలియాలంటే కలెక్టర్‌ నివాస్‌ యుద్ధ ప్రాతిపదికన ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంది. కలెక్టర్‌కు అందిన తాజా ఫిర్యాదు ఎండీయూ వ్యవస్థలోని లోపాలను బయట పెట్టింది. ప్రభుత్వం డోర్‌ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఈ పథకం పట్ల ఆసక్తితో మొదట్లో పోటీలు పడి దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో రాజకీయ సిఫార్సులే అధికంగా ఉన్నాయి.  తీరా ఆచరణకు వచ్చేసరికి ఓ బండపనిగా మారటంతో ఎండీయూ ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలా మానేసిన ఎండీయూ ఆపరేటర్ల స్థానంలో కొత్తవారిని తీసుకువస్తున్నారు. నూరుశాతం డోర్‌ డెలివరీ కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఏదో ఒకటి చేసి పని పూర్తి చేయండి అంటూ కిందిస్థాయిలో ఆదేశాలు ఇస్తున్నారు. పథకం  విజయవంతం కోసం ఎండీయూ ఆపరేటర్లుగా కొత్తవారితోనూ, వీఆర్‌వోలతోనూ, రేషన్‌ డీలర్లతోనూ నడిపిస్తున్నారు. చౌక దుకాణాలలో రేషన్‌ డీలర్ల చేత బియ్యం పంపిణీ చేయించటం త ప్పు కాదు. కానీ ఆ పంపిణీ చేసే విధానంలో తేడాలు ఉండకూడదు. ఎండీయూలు లేరని బలవంతంగా రేషన్‌  డీలర్ల చేత నిత్యావసరాలను పంపిణీ చేసిన ఉదంతాలు జిల్లాలో ఉన్నాయి. తాజాగా ఒక చోట రేషన్‌ డీలర్లుగా ఉన్న వారే మరో చోట ఎండీయూ ఆపరేటర్లుగా చెలామణి అవ్వటం విడ్డూరంగా ఉంది. పథకం విజయవంతం కోసం ఇది కూడా తప్పు కాదని అనుకుందాం. నిబంధనల ప్రకారం అయితే ఒక డీలర్‌ పరిధిలో ఎండీయూ ఆపరేటర్‌ ఉండి ఉంటే ఆ డీలర్‌ మరోచోట ఎండీయూ ఆపరేటర్‌గా పని చేయటం నేరమే అవుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలను చూస్తే ముగ్గురు రేషన్‌ డీలర్లు, మరొకరు రేషన్‌ డీలర్‌ బంధువు ఉన్నారు. ఇవన్నీ చూస్తే అనుమానాలను కలిగిస్తున్నాయి. రేషన్‌ డీలర్ల పేరున ఎండీయూ ఆపరేటర్ల వేతనాలను డ్రా చేసి వాటిని సద్వినియోగం చేసి ఉంటే సమస్య ఉండకపోవచ్చు. కానీ ఆ డబ్బులను సరిగా ఉపయోగించకుండా మళ్ళిస్తే మాత్రం సమస్యలు తప్పవు. 

  వీరే .. ఆ డీలర్లు  

కలెక్టర్‌ అందిన ఫిర్యాదు మేరకు బినామీ పేర్లలో ప్రధానంగా ముగ్గురు డీలర్ల పేర్లు ఉన్నాయి. వారిలో ఉదయరవితోపాటు మరో ఇద్దరు ఐఎస్‌ఎస్‌ శివశంకర్‌ రాజు, రాజు ఉన్నారు. ఈ డీలర్ల బంధువైన  మురళీ కూడా ఎండీయూ ఆపరేటర్‌గా కొనసాగుతున్నాడు. ఒక సర్కిల్‌లో వీరు డీలర్లుగా ఉంటూ మరోచోట ఎండీయూ ఆపరేటర్లుగా వ్యవహరించటం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరూ లేక ఇచ్చారనుకుంటే .. డ్రా చేసిన డబ్బులు ఏమయ్యాయి? ఎలా వినియోగించారన్నది విచారణలో కీలకమయ్యే అంశాలుగా ఉంటాయి. 


Updated Date - 2021-07-29T06:00:47+05:30 IST