Abn logo
May 19 2021 @ 00:46AM

రేషన్‌ డీలర్లపైకరోనా పంజా!

  జిల్లాలో ఇప్పటికే ఆరుగురు మృతి 

  గత ప్రభుత్వ జీవో బుట్టదాఖలు

  తెలంగాణాలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్‌గా గుర్తింపునకు సిఫార్సు

విజయవాడ, మే 18 : జిల్లాలో రేషన్‌ డీలర్ల మీద కరోనా పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌లోనే ఇప్పటికి ఆరుగురిని బలి తీసుకుంది.   మరికొందరు ఆసుపత్రిపాలు చేసింది. అదనపు సౌకర్యాలు కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉన్న సౌకర్యాలనూ ఊడబీకింది. కరోనా జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. జిల్లాలో డీలర్లు ఎంత మంది కరోనాతో మరణించారనే కనీస లెక్కలు కూడా అధికారులు వద్ద లేవు. పొరుగు రాష్ర్టాల్లో కరోనా సమయంలో డీలర్లకు ప్రాధాన్యత ఇచ్చినా ఇక్కడి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. 

జిల్లాలో దాదాపు 13 లక్షల కార్డులు ఉన్నాయి. వీరికి 2350 మంది డీలర్లు జనవరి 2020 వరకు తమ దుకాణాలలో రేషన్‌ పంపిణీ చేసేవారు. కరోనా మొదటి వేవ్‌లో ఎప్రిల్‌ 2020 నుంచి నవంబర్‌ 2020 వరకు నెలకు రెండు సార్లు కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశారు. 2021 ఫిబ్రవరి నుంచి  రాష్ట్రంలో  డీలర్లను స్టాకిస్టులుగా మార్చి ఎండీయూల వ్యవస్థను తీసుకొచ్చి డోర్‌ డెలివరీ ద్వారా బియ్యం, కందిపప్పు, పంచదారను కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ఎండీయూలు డీలర్‌ వద్ద ఉన్న ఈ-పోస్‌లను తీసుకెళ్లి కార్డుదారుల వేలిముద్రలు వేయించి బియ్యం ఇస్తున్నారు.  కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు అమ్మగా వచ్చిన నగదును డీలర్‌కు ఇస్తున్నారు. ఒకే ఈ-పోస్‌ మిషన్‌ను డీలర్‌లు, ఎండీయూలు ఆపరేట్‌ చేయాల్సి రావడం, నగదు లావాదేవీలు ఉండటంతో డీలర్‌లకు,  ఎండీయూలకు కరోనా సోకే  అవకాశం ఉంటోంది. 

కరోనాతో మరణించినవారు వీరే..

జిల్లా రేషన్‌ డీలర్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి పెదమల్లు సత్యన్నారాయణ, పామర్రు సంఘం కోశాధికారి శ్రీనివాసరావు, విజయవాడ డీలర్లు నాంచారమ్మ, కమలాకరరావుతోపాటు పెనమలూరు డీలరు భర్త ఆంజనేయులు, విజయవాడలో ఒక డీలర్‌ వద్ద సహాయకుడిగా ఉండే గోపాల్‌ కరోనాతో మరణించారు. మరి కొందరు డీలర్‌లు, వారి కుటుంబ సభ్యులు కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఎండీయూలలో  కూడా కొందరు అనారోగ్యం పాలయినట్లు సమాచారం. అయినా డీలర్‌  గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.

 చంద్రబాబు ఇచ్చిన జివో చెత్తబుట్టలోకి..

 2019 మార్చి 9న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో నెంబరు 5ను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ జీవోలో రేషన్‌ డీలర్‌ చనిపోయినచోట మట్టి ఖర్చుల కింద రూ.15వేలు ఇవ్వాలని, దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించాలని ఉంది.  వైసీపీ అధికారంలోకొచ్చాక ఈ జివోను అమలు చేయాలని రేషన్‌ డీలర్‌ సంఘాలు అడిగినా స్పందన లేదు. ఈ జివో కనుక అమలులో ఉంటే ఈ రెండేళ్లలో వివిఽధ కారణాలతో మరణించిన డీలర్‌ల కుటుంబాలకు ప్రయోజనం కలిగి ఉండేది. 

తెలంగాణాలో గుర్తింపునకు సిఫార్సు

గత ఏడాది కరోనా మొదటి వేవ్‌ మొదలైనపుడే రేషన్‌ డీలర్‌లు తమను కూడా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు. గుజరాత్‌లో ఇచ్చినట్టుగా అయినా కరోనా బీమా కల్పించాలని మొత్తుకున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణా పౌరసరఫరాల కమిషనర్‌ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సెక్రటరీకి లేఖ రాస్తూ రాష్ట్రంలో రేషన్‌ డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తిస్తూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఉండే ప్రయోజనాలన్నీ కల్పించాలని, వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మన రాష్ట్రంలో మాత్రం అసలు పౌర సరఫరాల వ్యవస్థను నడిపే అధికారులు పట్టించుకోవడం లేదని డీలర్‌ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.  


Advertisement