IMD: పలు రాష్ట్రాల్లో 5రోజుల పాటు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-09-15T16:05:22+05:30 IST

అల్పపీడన ప్రభావం వల్ల రాగల ఐదు రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అధికారులు వెల్లడించారు....

IMD: పలు రాష్ట్రాల్లో 5రోజుల పాటు భారీవర్షాలు

న్యూఢిల్లీ : అల్పపీడన ప్రభావం వల్ల రాగల ఐదు రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం వల్ల 13 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ బుధవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది. ఉత్తర కొంకణ్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో ఈ నెల 16వరకు, మధ్యప్రదేశ్ లో ఈ నెల 14,15 తేదీల్లో అతిభారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారు.


ఒడిశా, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో బుధవారం వరకు భారీవర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత క్రమేణా వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలోని సంభాల్ పూర్, డియోఘడ్, అంగూల్, సోనేపూర్, బార్ ఘడ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురవనున్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు.భారీవర్షాల వల్ల మహానది, దాని ఉప నదులు పొంగి ప్రవహించే అవకాశమున్నందున సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను అప్రమత్తం చేశారు. కటక్, ఖుర్దా, పూరి,జగత్ సింగ్ పూర్, ఝార్సుగూడ,బొలన్ గిరి ప్రాంతాల్లో నదులు వరదలతో ప్రవహించే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు.  


Updated Date - 2021-09-15T16:05:22+05:30 IST