భారత ఫుట్‌బాల్‌ అధ్యక్షుడిగా చౌబే

ABN , First Publish Date - 2022-09-03T09:36:53+05:30 IST

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఊహించిన ఫలితమే వచ్చింది.

భారత ఫుట్‌బాల్‌ అధ్యక్షుడిగా చౌబే

భూటియా  ఓటమి

సమాఖ్య చరిత్రలో తొలిసారి ఆటగాడి సారథ్యం

న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఊహించిన ఫలితమే వచ్చింది. భారత జట్టు మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియాపై మరో మాజీ ఆటగాడు కళ్యాణ్‌ చౌబే విజయం సాదించాడు. తద్వారా 85 ఏళ్ల సమాఖ్య చరిత్రలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి మాజీ ఫుట్‌బాలర్‌గా 45 ఏళ్ల చౌబే చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో చౌబే 33-1 ఓట్ల తేడాతో భూటియాపై నెగ్గాడు. భూటియాకు ఒకేఒక ఓటు రావడం గమనార్హం. రాష్ట్రాల ప్రతినిధులతో రూపొందించిన 34 మంది సభ్యుల ఓటర్ల జాబితాలో ఎక్కువమంది మద్దతు లేకపోవడంతో దిగ్గజ ఆటగాడు భూటియాకు పరాజయం తప్పలేదు.


అంతకుముందు పనిచేసిన ఇద్దరు అధ్యక్షులు ప్రియరంజన్‌దా్‌స మున్షీ, ప్రఫుల్‌ పటేల్‌ మాదిరే చౌబే కూడా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కావడం గమనార్హం.పశ్చిమ బెంగాల్‌కు చెందిన చౌబే గత లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణనగర్‌ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. మోహన్‌ బగాన్‌, ఈస్ట్‌బెంగాల్‌ జట్ల గోల్‌కీపర్‌గా వ్యవహరించిన కళ్యాణ్‌.. టీమిండియాకు ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించలేదు. అయితే భూటియా, చౌబే ఈస్ట్‌బెంగాల్‌కు కలిసి ఆడారు. ఏకైక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన కర్ణాటక ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎన్‌ఏ హారిస్‌ 29-5 ఓట్లతో మానవేంద్ర సింగ్‌(రాజస్థాన్‌)పై నెగ్గాడు. 


కేంద్ర మంత్రి జోక్యం: మానవేంద్ర ఆరోపణ

ఫుట్‌బాల్‌ సమాఖ్య ఎన్నికల్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు జోక్యం చేసుకున్నారని రాజస్థాన్‌ ఫుట్‌బాల్‌ సంఘం చీఫ్‌, కాంగ్రెస్‌ నాయకుడు మానవేంద్ర సింగ్‌ ఆరోపించారు. రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘాల సభ్యులు బస చేసిన హోటల్‌కు వెళ్లిన మంత్రి..భూటియాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వారిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 


అయినా..ఫుట్‌బాల్‌ అభివృద్ధికి కృషి

‘ఎన్నికల్లో ఓడినా భారత ఫుట్‌బాల్‌ అభివృద్ధికి భవిష్యత్‌లోనూ కృషి చేస్తా. కళ్యాణ్‌కు కంగ్రాట్స్‌. దేశ ఫుట్‌బాల్‌ను అతడు ముందుకు తీసుకు వెళతాడని ఆశిస్తున్నా. నాకు మద్దతు ప్రకటించిన సాకర్‌ అభిమానులకు కృతజ్ఞతలు’ అని ఫలితాల అనంతరం భూటియా స్పందించాడు. 


కొత్త కార్యవర్గం ఇదే..

అధ్యక్షుడు:

కళ్యాణ్‌ చౌబే, ఉపాధ్యక్షుడు: పఎన్‌ఏ హారిస్‌, కోశాధికారి: అజయ్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు: ఫల్గుణ (తెలంగాణ), అవిజీత్‌ పాల్‌, పి.అనిల్‌కుమార్‌, నటాషా అలెమావో, మాలోజీ రాజె, మెన్లా ఎథెన్పా, మోహన్‌ లాల్‌, అరీఫ్‌ అలీ, నీబౌ సెఖోస్‌, హమర్‌, దీపక్‌ శర్మ, విజయ్‌ బాలీ, సయ్యద్‌ ఇంతియాజ్‌, సయ్యద్‌ నఖ్వీ. ఆటగాళ్ల తరపున భూటియా, ఐఎం విజయన్‌, షబ్బీర్‌ అలీ, క్లైమాక్స్‌ లారెన్స్‌. 


గోపాలకృష్ణ ఓటమి

కోశాధికారి పదవికి ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ సంఘానికి చెందిన కొసరాజు గోపాలకృష్ణ పోటీ చేశాడు. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కిపా అజయ్‌ 32-1 ఓట్లతో గోపాలకృష్ణను ఓడించాడు. ఒక ఓటు చెల్లలేదు. అధ్యక్ష పదవికి భూటియా పేరును కొసరాజు ప్రతిపాదించగా మానవేంద్ర సింగ్‌ బలపరచడం గమనార్హం. 14 ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి. 

Updated Date - 2022-09-03T09:36:53+05:30 IST