పంజాబ్‌ అద్భుతం

ABN , First Publish Date - 2020-10-25T09:05:00+05:30 IST

ఎలాంటి మ్యాచ్‌నైనా ఉత్కంఠభరితంగా ముగించడం పంజాబ్‌కు అలవాటుగా మారినట్టుంది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో తక్కువ స్కోరే చేసినా కూడా

పంజాబ్‌ అద్భుతం

లక్ష్యం కేవలం 127 పరుగులు.. డేవిడ్‌ వార్నర్‌ బాదుడుకు పవర్‌ప్లేలోనే 52 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్‌ మరో 10 ఓవర్లు సాగితే గొప్ప అనిపించింది. కానీ చివరి బంతి వరకు నమ్మకం కోల్పోని పంజాబ్‌ బౌలర్లు అద్భుతమే చేశారు. ఏడో ఓవర్‌ నుంచి ఆఖరి వరకు మ్యాచ్‌ను తమ అధీనంలోనే ఉంచుకుని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చుక్కలు చూపించారు. పేసర్లు అర్ష్‌దీప్‌,  జోర్డాన్‌ ఆఖర్లో చేసిన మాయాజాలానికి 14 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయి చిత్తయింది. పంజాబ్‌కిది వరుసగా నాలుగో విజయం కాగా, అటు చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయిన సన్‌రైజర్స్‌ తమ ప్లేఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది.


స్వల్ప స్కోరును కాపాడిన బౌలర్లు 

హైదరాబాద్‌ ఓటమి


దుబాయ్‌: ఎలాంటి మ్యాచ్‌నైనా ఉత్కంఠభరితంగా ముగించడం పంజాబ్‌కు అలవాటుగా మారినట్టుంది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో తక్కువ స్కోరే చేసినా కూడా బౌలర్ల పట్టుదలతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 12 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. పూరన్‌ (32) మాత్రమే ఆడాడు. రషీద్‌, హోల్డర్‌, సందీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. వార్నర్‌ (35) రాణించాడు. జోర్డాన్‌ (3/17), అర్ష్‌దీప్‌ (3/23)లకు మూడేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జోర్డాన్‌ నిలిచాడు.


శుభారంభం దక్కినా..: స్వల్ప ఛేదనే అయినప్పటికీ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకునేందుకు రైజర్స్‌ తొలి ఓవర్‌ నుంచే దూకుడు ప్రదర్శించింది. దీంతో పంజాబ్‌కు దారుణ ఓటమి ఖాయమనిపించింది. అయితే ఈ జోరు వార్నర్‌ క్రీజులో ఉన్నంతసేపే సాగింది. తొలి రెండు ఓవర్లలో వార్నర్‌ ఒక్కో సిక్సర్‌తోపాటు ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. అటు బెయిర్‌స్టో ఆరో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులతో జోరు చూపింది. అయితే ఏడో ఓవర్‌లో వార్నర్‌ను అవుట్‌ చేసిన బిష్ణోయ్‌ పంజాబ్‌కు రిలీ్‌ఫనిచ్చాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో బెయిర్‌స్టో (19), సమద్‌ (7)లను కోల్పోవడంతో 67/3 స్కోరుతో మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అటు పిచ్‌ ప్రమాదకరంగా మారడంతో క్రీజులో ఉన్న మనీశ్‌ పాండే (15), విజయ్‌ శంకర్‌ ఆచితూచి ఆడారు. బిష్ణోయ్‌ గూగ్లీ బంతులతో ఇబ్బంది పెట్టడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరగసాగింది. 10-13 ఓవర్ల మధ్య ఫోర్‌ కూడా రాలేదు. 14వ ఓవర్‌లో విజయ్‌ శంకర్‌ రెండు ఫోర్లు బాదడంతో రైజర్స్‌ కాస్త ఒత్తిడి తొలగించుకుంది. చివరి 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా 16వ ఓవర్‌లో బిష్ణోయ్‌ రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు వెళ్లిన మనీశ్‌ క్యాచ్‌ అవుట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగింది. 


జోర్డాన్‌, అర్ష్‌దీప్‌ మాయ: చివరి మూడు ఓవర్లలో రైజన్స్‌ దారుణంగా తడబడింది. 18వ ఓవర్‌లో ఓవర్‌త్రో హెల్మెట్‌కు బలంగా తాకడంతో ఇబ్బంది పడిన విజయ్‌ శంకర్‌ను ఆ తర్వాతి బంతికే పేసర్‌ అర్ష్‌దీప్‌ అవుట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 12 బంతుల్లో 17 రన్స్‌ కావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో హోల్డర్‌, రషీద్‌లను పెవిలియన్‌కు చేర్చిన జోర్డాన్‌ మూడు రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. దీంతో సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులకు వచ్చింది. ఇక ఈ ఓవర్‌లో సందీప్‌(0), గార్గ్‌ (3)లను అర్ష్‌దీప్‌ వరుసగా అవుట్‌ చేయగా ఐదో బంతికి ఖలీల్‌ రనౌట్‌ కావడంతో పంజాబ్‌ అదిరిపోయే విజయం సాధించింది.

బౌలర్ల కట్టడి: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఆరంభం నుంచే పరుగుల కోసం తీవ్రంగా చెమటోడ్చింది. ఎంతలా అంటే ఏడో ఓవర్‌లో సిక్సర్‌ సాధించిన జట్టు ఆ తర్వాత 19వ ఓవర్‌లో కానీ మరో ఫోర్‌ బాదలేకపోయింది. దీనికి తోడు సందీప్‌, రషీద్‌, హోల్డర్‌ల ధాటికి స్వల్ప విరామాల్లోనే వికెట్లు చేజార్చుకుంది. గాయం కారణంగా మయాంక్‌ అందుబాటులో లేకపోవడంతో రాహుల్‌కు జతగా మన్‌దీ్‌ప (17) ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయుతే అతడిని ఐదో ఓవర్‌లోనే సందీప్‌ అవుట్‌ చేశాడు. ఆరో ఓవర్‌లో గేల్‌ (20) రెండు ఫోర్లు బాదగా పవర్‌ప్లేలో జట్టు 47 పరుగులు చేసింది. రషీద్‌ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన అతడు ఊపు మీద కనిపించాడు. కానీ 10వ ఓవర్‌ చివరి బంతికి గేల్‌ను హోల్డర్‌ అవుట్‌ చేయగా.. ఆ వెంటనే కెప్టెన్‌ రాహుల్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేసి పంజాబ్‌కు ఝలక్‌ ఇచ్చాడు. ఇక పరుగులు రావడమేమో కానీ అటు వరుస ఓవర్లలో మ్యాక్స్‌వెల్‌ (12), హూడా (0) వికెట్లను కూడా కోల్పోయింది. పూరన్‌ అజేయంగా నిలిచినా ఎదుర్కొన్న 19వ బంతికి ఫోర్‌ బాదగలిగాడు. చివరికి డెత్‌ ఓవర్లలోనూ పంజాబ్‌ పరుగులు చేయలేక, వికెట్లు కాపాడుకోలేక విలవిల్లాడింది. పూరన్‌ చివరి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్‌ సాధించడంతో పంజాబ్‌ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.


తండ్రి చనిపోయినా..

పంజాబ్‌ ఓపెనర్‌ మన్‌దీ్‌ప సింగ్‌ తండ్రి హర్దేవ్‌ సింగ్‌ అనారోగ్యంతో శుక్రవారం రాత్రే మరణించాడు. అయినా బాధను దిగమింగుకుని బరిలోకి దిగిన మన్‌దీప్‌ ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడి తండ్రి మృతికి సంతాపంగా జట్టు ఆటగాళ్లంతా నల్లటి రిబ్బన్‌లు ధరించి ఆడారు. 


స్కోరు బోర్డు

కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌: రాహుల్‌ (బి) రషీద్‌ 27; మన్‌దీప్‌ (సి) రషీద్‌ (బి) సందీప్‌ శర్మ 17; గేల్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 20; పూరన్‌ (నాటౌట్‌) 32; మ్యాక్స్‌వెల్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 12; హూడా (స్టంప్డ్‌) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 0; జోర్డాన్‌ (సి) ఖలీల్‌ (బి) హోల్డర్‌ 7; ఎం.అశ్విన్‌ (రనౌట్‌/శంకర్‌) 4; రవి బిష్ణోయ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 126/7. వికెట్ల పతనం: 1-37, 2-66, 3-66, 4-85, 5-88. 6-105, 7-110. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-29-2; ఖలీల్‌ 4-0-31-0; హోల్డర్‌ 4-0-27-2; రషీద్‌ 4-0-14-2; నటరాజన్‌ 4-0-23-0.

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) రవి 35, బెయిర్‌స్టో (బి) మురుగన్‌ అశ్విన్‌ 19, మనీష్‌ పాండే (సి, సబ్‌) సుచిత్‌ (బి) జోర్డాన్‌ 15, అబ్దుల్‌ సమద్‌ (సి) జోర్డాన్‌ (బి) షమి 7, విజయ్‌ శంకర్‌ (సి) రాహుల్‌ (బి) అర్ష్‌దీప్‌ 26, హోల్డర్‌ (సి) మన్‌దీప్‌ (బి) జోర్డాన్‌ 5, ప్రియమ్‌ గార్గ్‌ (సి) జోర్డాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 3, రషీద్‌ ఖాన్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 0, సందీప్‌ శర్మ (సి) అశ్విన్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, నటరాజన్‌ (నాటౌట్‌) 0, ఖలీల్‌ (రనౌట్‌) బిష్ణోయ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.5 ఓవర్లలో 114 అలౌట్‌. వికెట్ల పతనం: 1-56, 2-58, 3-67, 4-100, 5-110, 6-112, 7-112, 8-114, 9-114. బౌలింగ్‌: షమి 4-0-34-1, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.5-0-23-3, మురుగన్‌ అశ్విన్‌ 4-0-27-1, రవి బిష్ణోయ్‌ 4-0-13-1, క్రిస్‌ జోర్డాన్‌ 4-0-17-3.

Updated Date - 2020-10-25T09:05:00+05:30 IST