Abn logo
Sep 24 2021 @ 13:39PM

ఎయిర్‌బస్‌తో కేంద్రం మెగా డీల్

న్యూఢిల్లీ : స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ.20,000 కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 56 సీ-295 మీడియం ట్రాన్స్‌పోర్టు విమానాలను కొంటోంది. భారత వాయు సేనలోని అవ్రో-748 విమానాలకు బదులుగా వీటిని కొంటోంది. ఈ విమానాలను సేకరించాలనే ప్రతిపాదన చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ ప్రతిపాదనకు భద్రతపై కేబినెట్ కమిటీ రెండు వారాల క్రితమే ఆమోదం తెలిపింది. 


రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఏ భరత్ భూషణ్ బాబు శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ, స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. 56 సీ-295 రవాణా విమానాలను భారత వాయు సేన కోసం సేకరిస్తున్నట్లు తెలిపారు. 


16 విమానాలను ఫ్లైఅవే కండిషన్‌లో 48 నెలల్లోగా మన దేశానికి ఎయిర్‌బస్ అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను మన దేశంలోనే తయారు చేస్తారు. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కన్సార్షియం తయారు చేస్తుంది. వీటిని ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటి నుంచి పదేళ్ళలో తయారు చేసి, అందజేస్తాయి. సైనిక విమానాలను ఓ ప్రైవేటు కంపెనీ మన దేశంలో తయారు చేయడం ఇదే మొదటిసారి. 


సీ-295 ఎండబ్ల్యూ విమానం 5-10 టన్నుల సరుకును రవాణా చేయగలదు. ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేస్తున్న 56 విమానాల్లోనూ దేశీయ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను అమర్చుతారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవ్రో-748 విమానాలను మార్చాలనే నిర్ణయం తొమ్మిదేళ్ళ క్రితం జరిగింది.