సమాఖ్య న్యాయవ్యవస్థతోనే రక్షణ

ABN , First Publish Date - 2020-11-26T05:43:24+05:30 IST

భారత దేశానికి స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చాకా- ఆర్టికల్-131 ఒరిజినల్ జ్యురిస్‌డిక్షన్ (ప్రాథమిక విచారణ అధికార పరిధి), ఆర్టికల్-143...

సమాఖ్య న్యాయవ్యవస్థతోనే రక్షణ

సుప్రీంకోర్టులో సగటున సంవత్సరానికి 1000 కేసులు పెండింగ్‌ పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో కేసులు రెట్టింపై న్యాయమూర్తుల పని భారం పెరిగి ప్రజలకు సత్వర న్యాయమనేది కనుమరుగయ్యేలా ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సివిల్‌, క్రిమినల్‌ కేసులలో హైకోర్టు తీర్పులే అంతిమమని రాజ్యాంగ సవరణ చేయాలి. దీనితో సుప్రీంకోర్టుకు వెళ్ళే అప్పీల్‌ కేసులన్నీ హైకోర్టు స్థాయిలో పరిష్కారమవుతాయి. రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఈ తరహా సమాఖ్య న్యాయవ్యవస్థతోనే సాధ్యం.


భారత దేశానికి స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చాకా- ఆర్టికల్-131 ఒరిజినల్ జ్యురిస్‌డిక్షన్ (ప్రాథమిక విచారణ అధికార పరిధి), ఆర్టికల్-143 అడ్వయిజరీ జ్యూరిస్‌డిక్షన్ (సలహా పూర్వక విచారణ పరిధి) ఆర్టికల్స్‌ని భారత ప్రభుత్వ చట్టం-1935 నుంచి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉన్నట్లు సుప్రీం కోర్టుకి ఆపాదించారు. అదనంగా ఆర్టికల్ 132, 133, 134 అప్పిల్లేట్ జ్యూరిస్‌డిక్షన్ (సివిల్, క్రిమినల్ అప్పీల్స్ విచారణ అధికార పరిధి), ఆర్టికల్స్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్స్ (సుప్రీం కోర్టు ప్రత్యేక అనుమతితో అప్పీళ్ళను స్వీకరించే విచక్షణాధికారం) అధికరణలని రాజ్యాంగంలోకి చేర్చారు. 


సుప్రీం కోర్టు ఒరిజినల్ జ్యూరిస్‌డిక్షన్ ద్వారా కేంద్రం, రాష్ట్రాలు, అంతరాష్ట్ర వివాదాలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు పరిష్కరించాలి. కాని అప్పిల్లేట్ జ్యూరిస్‌డిక్షన్ కలిగి ఉండటం ద్వారా హైకోర్టులు ఇచ్చినటువంటి సివిల్ తగాదాల తీర్పులు, క్రిమినల్ తగాదాల తీర్పులను అప్పీల్ కేసులుగా స్వీకరించడంతో జి.ఎస్.టి ఆధార్ లాంటి అత్యంత కీలకమైన రాజ్యాంగపరమైన కేసుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఆర్టికల్ 370, ఎన్.ఆర్.సి.- సి.ఎ.ఎ., ఇ.డబ్ల్యు,ఎస్. రిజర్వేషన్ మొదలైన కేసులు కొలిక్కి రావటం లేదు. దీపావళికి టపాకాయలు కాల్చాలా వద్దా అన్న విషయంలో అప్పీల్ తీర్పులు రావడంతో వందల కేసులు పెండింగులో పడి విచారణకు నోచుకోవడం లేదు. సుప్రీంకోర్టులో కేసులన్నీ కోకొల్లలుగా పెండింగులో పడుతూ, అసలైన రాజ్యాంగపరమైన కేసులు కాకుండా 90శాతం సివిల్, క్రిమినల్ అప్పీల్స్, ఎస్.ఎల్.పి కేసుల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మారడంతో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు కేటాయించే కేసుల విషయంలో రోస్టర్ సమస్యలు తలెత్తుతున్నాయి. 


ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు సలహాపూర్వక విచారణ పరిధి ద్వారా గవర్నర్ జనరల్ నాలుగు సార్లు మాత్రమే సలహా సూచనలను అడిగితే, సుప్రీం కోర్టు ఏర్పడ్డాక రాష్ట్రపతి ఢిల్లీ న్యాయ చట్టాల అంశం 1951, కేరళ విద్యా బిల్లు 1958, రాష్ట్రపతి ఎన్నికలు 1974, రామజన్మభూమి వివాదం- 1993, 2జి స్పెక్ట్రమ్, సహజ వనరుల వేల వివాదాలు- 2012 లాంటి వివాదపరమైన అంశాలను పదిహేనుసార్లకు పైగా సలహా సూచనలను కోరారు. సుప్రీంకోర్టు కేంద్రానికీ రాష్ట్రానికీ తలెత్తిన వివాదంలో ఆర్టికల్ 131 ప్రకారం ఏ సమస్యనైనా పరిష్కరించాలి. కాని స్టేట్ ఆఫ్ మధ్య ప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పార్లమెంటు చేసిన చట్టం ప్రజలకు అన్యాయం చేస్తుందని ఈ చట్టానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టుకి వెళితే ఆర్టికల్ 256 క్రింద పార్లమెంటు చేసిన చట్టాల పరిధిలోకి, రాష్ట్రాలు ఆర్టికిల్ 131 ప్రకారం ఒరిజినల్ జ్యూరిస్‌డిక్షన్ కిందకు రావని, పార్లమెంటు చేసిన చట్టమే అంతమమైనదిగా, కేసును కొట్టివేసి సుప్రీంకోర్టు తన రాజ్యాంగ పరిధిని తానే తిరస్కరించుకుంది.


దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ట్రయల్‌ కోర్టులలో 2012 లెక్కల ప్రకారం పెండింగు కేసుల వివరాలు చూస్తే, ట్రయల్‌ కోర్టులలో సుమారు 2 కోట్ల 70 లక్షల కేసులు పెండింగులో ఉండగా, పనిచేసే జడ్జిల సంఖ్య 21 వేలకు పైగా ఉంది. అనగా సగటున ఒక్కొక్క జడ్జి 1200–1300 మధ్య కేసుల భారాన్ని కలిగి ఉన్నాడు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉండగా 700 మంది జడ్జీలు పనిచేస్తున్నారు. 42 లక్షల పైగా కేసులు పెండింగులో ఉన్నాయి. సుప్రీంకోర్టులో దాదాపు 60 వేల పైగా పెండింగు కేసులుండగా, ఒక్కొక్క న్యాయమూర్తి 2 వేల కేసులను పరిష్కరించే బాధ్యతను కలిగిఉండటంతో సగటున సుప్రీంకోర్టు జడ్జీలకి, జిల్లాకోర్టు జడ్జీల కంటే పెండింగ్‌ కేసులెక్కువ.  


సుప్రీంకోర్టు ప్రారంభంలో 176 రోజుల పనిదినాలతో మొదలై 193 రోజులుగా, 222 రోజుల పనిదినాలుగా సంవత్సరానికి పనిచేస్తూ రాజ్యాంగపరమైన అంశాలు, హైకోర్టు అప్పీల్స్‌ అయిన సివిల్‌, క్రిమినల్‌, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్స్‌ కేసులను స్వీకరించడంతో గత 70 సంవత్సరాలుగా 60 వేల పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే సగటున సంవత్సరానికి 1000 కేసులు పెండింగ్‌ పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో కేసులు రెట్టింపై న్యాయమూర్తుల పని భారం పెరిగి ప్రజలకు సత్వర న్యాయమనేది కనుమరుగయ్యేలా ఉంది.  


ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సివిల్‌, క్రిమినల్‌ కేసులలో హైకోర్టు తీర్పులే అంతిమమని రాజ్యాంగ సవరణ చేయాలి. దీనితో సుప్రీంకోర్టుకు వెళ్ళే అప్పీల్‌ కేసులన్ని హైకోర్టు స్థాయిలో పరిష్కారమవుతాయి. దీనికి కారణం లేకపోలేదు, భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం ప్రత్యేక భాషలను, సంస్కృతులను, ప్రత్యేక భూచట్టాలను కలిగి ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగపరమైన అంశాలను కాకుండా అతిచిన్న విషయాలైన ఆస్తి పంపకాలు, భూతగాదాలు, భార్యభర్తల వివాదాలు, దీపావళి పండుగకు బాంబులు కాల్చాలా వద్దా, ఒక వ్యక్తి ఆస్తిపన్ను నిజంగానే ఎగ్గొట్టాడా లేదా, విద్యాసంస్థలు ఎలా పనిచేస్తున్నాయి అంశాలను స్వీకరించడంతో ఎంతగానో సామాన్య ప్రజల సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. అంతే కాకుండా ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కూడా. రాజ్యాంగాన్ని రక్షించాలంటే సమాఖ్య న్యాయవ్యవస్థతోనే సాధ్యం. 

శ్రీకాంత్‌ పూసల 

రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్‌ ద్రావిడ లాయర్స్‌ అసోసియేషన్‌

Updated Date - 2020-11-26T05:43:24+05:30 IST