Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిగ్రీ డీలా

సగం కూడా నిండని సీట్లు

ఇంజనీరింగ్‌పై ఆసక్తి, కరోనా ఎఫెక్ట్‌

ఉమ్మడి జిల్లాలో 37వేల సీట్లకు 13వేలే భర్తీ

నల్లగొండ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం పెరగడంతో సాధారణ గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం ‘దోస్త్‌’ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)ను ప్రవేశపెట్టింది. దోస్త్‌ మూడు విడతల్లో రిజిస్ట్రేషన్లు, సీట్ల కేటాయింపు, కళాశాలల్లో చేరికల ప్రక్రియ పూర్తికాగా, ఎం జీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు.

ఎంజీయూ పరిధిలో..

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 92 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో 11 ప్రభుత్వ, 79 ప్రైవేట్‌, రెండు ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. మొత్తం ఎంజీయూ పరిధిలో డిగ్రీ కళాశాలల్లో 37,320 సీట్లు ఉండగా, దోస్త్‌ మూడు దశల్లో కేవలం 13,852 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 23,468 సీట్లు మిగిలే ఉన్నాయి. కొన్ని కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరికొన్ని కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరడంతో యాజమాన్యాలు ఏంచేయాలో తెలియక తలపట్టుకుంటున్నాయి.

ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన చేరికలు

ప్రైవేట్‌ కళాశాలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలలో సీట్లకు డిమాండ్‌ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, 5,700 సీట్లు ఉన్నాయి. మూడు దశల్లో నిర్వహించిన దోస్త్‌ ప్రక్రియలో 3,463 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో 30,120 సీట్లకు కేవలం 9,397 మాత్రమే భర్తీ అయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, మిర్యాలగూడలోని నాగార్జున కళాశాల, సూర్యాపేటలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాల, భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. దీంతో ఈ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది.

ప్రైవేటు కళాశాలలకు స్పందన కరువు

దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకాగానే, తమ కళాశాలల్లో చేరితే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని ఆయా యజమాన్యాలు ప్రచారం చేసినా చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపలేదు. ప్రైవేట్‌ కళాశాల్లో కొన్నింట్లో ఒక్క అడ్మిషన్‌ కూడా నమోదుకాకపోవడం గమనార్హం. విద్యార్థులు మొగ్గు చూపకపోవడంతో ఎక్కువ సంఖ్యలో సీట్లు భర్తీ చేసుకోవాలని ఆరాటపడిన యాజమాన్యాలకు నిరాశే ఎదురైంది. కొన్ని కళాశాలల్లో ఒక్కో కోర్సులో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే చేరారు. దీంతో ఆ కోర్సులను కొనసాగించాలంటే తమకు భారమేనని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

ఇంజనీరింగ్‌పై ఆసక్తి, కరోనా ప్రభావం

సాధారణ డిగ్రీ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయనే భావనలో విద్యార్థులు ఉన్నారు. అదే ఇంజనీరింగ్‌ పూర్తిచేస్తే ఏదో ఒక ఉపాధి లభిస్తుందని విద్యార్థులు బీటెక్‌ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో డిగ్రీ కళాశాల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదు. దీనికి తోడు కరోనా ప్రభావం ఇంకా పనిచేస్తూనే ఉంది. ప్రైవేట్‌ కళాశాల్లో చేరితే పలు రకాల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం చెల్లించినా కరోనా కారణంగా ఆన్‌లైన్‌ బోధన, నామమాత్రపు పరీక్షలు, పాస్‌కావడం సర్వసాధారణం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డబ్బు చెల్లించి ప్రైవేట్‌ కళాశాలలకు వెళ్లేకంటే ప్రభుత్వ కళాశాలలే మేలనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు. దీంతో ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు సగం కూడా భర్తీకావడంలేదు. విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో కళాశాలల ఉనికిని కాపాడుకునేందుకు మిర్యాలగూడ, సూర్యాపేట వంటి పట్టణాల్లోని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకే ఎదురు డబ్బు చెల్లించి సీట్లు భర్తీ చేసుకున్నట్టు సమాచారం.

పలు కారణాలతో విద్యార్థులు దూరమవుతున్నారు  : ధనుంజయ్‌, విజేత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, మిర్యాలగూడ

ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులకు మూడేళ్లుగా రావాల్సిన స్కాలర్‌షిప్‌ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉంది. ఆ డబ్బులు వస్తేనే కళాశాలలకు ఫీజులు చెల్లిస్తారు. సకాలంలో ఫీజులు వసూలు అయితేనే మేం వేతనాలు చెల్లించగలం. రాజకీయ, ఇతర పలుకుబడుల కారణంగా గత ప్రభుత్వాల హయాంలో ఒక పట్టణంలో మూడు కళాశాలల అవసరం ఉంటే ఆరు కళాశాలలు మంజూరు చేశారు. ఫలితంగా డిగ్రీ అడ్మిషన్లకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. ఆదాయ వనరులు లేక లెక్చరర్లకు పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లించలేకపోవడంతో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల్లో క్రమంగా నాణ్యత పడిపోతోంది. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యకు విద్యార్థులు దూరమవుతూ వస్తున్నారు. దీనికి తోడు ఉపాధి అవకాశాల కారణంగా అంతా ఇంజనీరింగ్‌వైపు మొగ్గుచూపుతున్నారు.

Advertisement
Advertisement