జగన్‌ ఒత్తిడితోనే ‘పాస్టర్‌’పై చర్యల్లో జాప్యం!

ABN , First Publish Date - 2021-01-18T08:08:16+05:30 IST

‘‘హిందూ దేవుళ్లపై వ్యతిరేకతను చూపుతూ వీడియో, ప్రకటనలు చేసి ఏడాదైనా పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిపై ఇంత వరకు ఎందుకు చర్య తీసుకోలేదు.

జగన్‌ ఒత్తిడితోనే ‘పాస్టర్‌’పై చర్యల్లో జాప్యం!

సీఎం, బ్రదర్‌ అనిల్‌ నేతృత్వంలోనేహిందూ మతంపై దాడులు

ప్రవీణ్‌తో బ్రదర్‌ అనిల్‌కు సంబంధాలు

చక్రవర్తి వెనకున్న ప్రజాప్రతినిధుల

పేర్లు ఎప్పుడు ప్రకటిస్తారు డీజీపీ సార్‌?: టీడీపీ


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘హిందూ దేవుళ్లపై వ్యతిరేకతను చూపుతూ వీడియో, ప్రకటనలు చేసి ఏడాదైనా పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిపై ఇంత వరకు ఎందుకు చర్య తీసుకోలేదు. పాస్టర్‌ ప్రవీణ్‌ వ్యాఖ్యలు, చర్యలపై సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు? ఈ ఘటనలను టీడీపీకి అపాదిస్తారా? ఏడాదిగా హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాలు జరుగుతుంటే దోషులపై చర్యలు తీసుకోకుండా సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఏం చేస్తున్నారు? టీడీపీ, బీజేపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం వైసీపీ నేతల్ని, దుండగులను కాపాడటం కాదా?’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో వరుస ప్రశ్నలను సంధించారు. ‘‘పాస్టర్‌ ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవటంలో జాప్యానికి జగన్‌ సర్కార్‌ కారణం కాదా? జగన్‌రెడ్డి ఒత్తిడికి గురై ఆలస్యం చేశారా? విగ్రహాల ధ్వంసంలో తామే పాల్గొన్నామని అతను చెప్తుంటే.. అతనిపై ఏ చర్య తీసుకున్నారు? అతని వ్యాఖ్యలపై విచారణ జరిపారా? సీఐడీ ఏం తేల్చింది? పాస్టర్‌ ప్రవీణ్‌కు జగన్‌ బావమరిది బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఏమి నిర్ధారణకు వచ్చారు? అతనితో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ఎలా సంబంధాలు నెరుపుతున్నారు?’’ అని ప్రశ్నించారు. పాస్టర్‌ ప్రవీణ్‌తో, బ్రదర్‌ అనిల్‌కు సంబంధాలున్నాయని, జగన్‌ డైరెక్షన్‌లోనే అన్నీ జరుగుతున్నాయని మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు. 


డీజీపీ వీటిని పక్కన పెట్టి, టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాస్టర్‌ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌, బ్రదర్‌ అనిల్‌ నేతృత్వంలోనే హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయనే నిజాన్ని డీజీపీ గ్రహించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో అన్నారు. చంద్రబాబుని బెల్లంపల్లిలో ఓ పాస్టర్‌ దూషిస్తే అతనిపై డీజీపీ ఏ చర్య తీసుకున్నారని ప్రశ్నించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ వెనుక ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గర బంధువుల వివరాలు మీడియాకు ఎప్పుడు చెప్తారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అతని గురించి వైసీపీలో ఎవ్వరూ ఎందుకు నోరు తెరవడం లేదని ట్విటర్‌ వేదికగా నిలదీశారు. ‘‘జగన్‌ జగత్‌ కిలాడీ. రంగస్థల నటులు కూడా జగన్‌కు సరిరారు. టక్కు టమార విద్యలు ప్రదర్శించి, జనాన్ని బురిడీ కొట్టించగల జగన్‌ మేక వన్నె పులి.


తస్మాత్‌ జాగ్రత్త’’ అని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బుచ్చిరామ్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. సీఎం సొంత జిల్లా కొంగలవీడులో ఆంజనేయస్వామి విగ్రహానికి జరిగిన అపచారం ఘటనలో బొజ్జల సుబ్బారెడ్డి వైసీపీ నేత కాదా? అని టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి డీజీపీని ప్రశ్నించారు. జగనాసుర పాలన అంతానికి అమరావతి నుంచే నాంది అయిందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ అన్నారు. అమరావతి ఉద్యమం 397 రోజులైన సందర్భంగా ఆదివారం ఓప్రకటనలో... రాజధానిపై కులతత్వాన్ని రెచ్చగొట్టి జగన్‌ ఏంమూట కట్టుకున్నారని మంతెన నిలదీశారు. 

Updated Date - 2021-01-18T08:08:16+05:30 IST