స్థలం సరే..పట్టా ఏది?

ABN , First Publish Date - 2021-07-31T05:59:36+05:30 IST

‘నాకు ఓటు వేసిన వాళ్లకు, వేయని వాళ్లకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి..’ అని ఉన్నతాధికారుల సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతుంటారు.

స్థలం సరే..పట్టా ఏది?

పట్టా అందుకోని లబ్ధిదారులు పదివేల మందికి పైనే! 

అర్హులకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం ఎందుకో!

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లే కారణమా? 

ఇతర పార్టీలకు చెందిన వారున్నారని తొలగింపా? 

శంకుస్థాపనల సమయంలోనూ అందని పట్టాలు 


‘నాకు ఓటు వేసిన వాళ్లకు, వేయని వాళ్లకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి..’ అని ఉన్నతాధికారుల సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతుంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. జిల్లాలో పది వేల మందికి పైగా లబ్ధిదారులు ఇప్పటికీ పట్టా అందుకోలేదు. ఇంటి మంజూరు పత్రం వచ్చినా.. పట్టా రాకపోవటానికి లబ్ధిదారులకు రాజకీయాలను ఆపాదిస్తున్న అధికారపక్ష ప్రజాప్రతినిధుల తీరే కారణమని తెలుస్తోంది.


 (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మరో 50 వేల మంది లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఉన్నారు. వీరికి రెండవ దశలో పట్టాలను ఇవ్వాల్సి ఉంది. ఇంటి పట్టాల పంపిణీని నిరంతర కార్యక్రమంగా మార్చటంతో ఇప్పటికీ ప్రజల నుంచి వార్డు, గ్రామ సచివాలయాలు, రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. మొదటి దశలోనే లబ్ధిదారులు ఇంటి మంజూరు పత్రం పొందినప్పటికీ, వేలాదిమంది ఇప్పటికీ పట్టాను అందుకోకపోవటం గమనార్హం. ఇలా పట్టా అందుకోని వారిలో సింహభాగం ఇతర పార్టీల వారు ఉన్నారని తెలుస్తోంది. దీనిని బట్టి రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వీరికి పట్టా రాలేదన్నది అర్ధమవుతోంది. 


జిల్లా అంతటా ఇదే పరిస్థితి

జిల్లాలోని 53 మండలాల పరిధిలోనూ ఇలాంటి వారు ఉన్నారు. అత్యధికంగా విజయవాడ నగర పరిధిలో పట్టారానివారు ఉన్నారని తెలుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో దీనిని బట్టి అర్థమవుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలోనూ వంద మంది వరకు లబ్ధిదారులు ఇలా ఇంటి పట్టాలు అందుకోని వారున్నారు. వారికి కేటాయించాలనుకున్న ప్లాట్లను వేరే వారికి ఇస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక స్థానికంగా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరిగింది. చాలా వరకు స్థానిక శాసనసభ్యులు సూచించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. రాజకీయ సిఫార్సులకనుగుణంగా ఇంటి పట్టాలను పొందిన లబ్ధిదారులు చాలా మంది ఉన్నారన్నది తెలుస్తోంది. వీరిలో అర్హులెందరో తెలియదు.  అయితే అర్హులను కూడా పక్కన పెట్టడం గమనించాల్సిన విషయం. ఇంటి పట్టా అర్హత నుంచి పంపిణీ వరకు కొనసాగుతున్న విధానం చూస్తే రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. 


ఆన్‌లైన్‌లో పేరున్నా ప్రింటింగ్‌ కాదు..

డివిజన్‌, లేదా గ్రామ పరిధిలో ఇంటి పట్టా కోసం వార్డు, గ్రామ సచివాలయాలకు వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న వాటిని స్థానిక అధికార పార్టీ నేతలు పరిశీలిస్తారు. వారు అర్హులే అయినా, స్థానిక నేతల కొలమానాల ప్రకారం ఎంపిక జరుగుతోంది. అలాంటి వాటినే ఆన్‌లైన్‌లో ఎక్కిస్తారు. ఇలా ఆన్‌లైన్‌లో ఎక్కించిన వారినే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి కార్పొరేషన్‌, రెవెన్యూ కార్యాలయాల పరిధిలో ఆమోదించి ప్రింటింగ్‌కు పంపిస్తుంటారు. అలా పంపిన ప్రతి ఒక్కరి పేరుమీదా ఇంటి పట్టా ప్రింట్‌ అయి వస్తుంది. ఇంటి పట్టా ప్రింటింగ్‌ ఒక విఽధానం ప్రాతిపదికన నడుస్తోంది. దానిపై ఎలాంటి సందేహాలు లేవు. లబ్ధిదారుడి పేరు వెళ్లకపోతే పట్టా ప్రింట్‌ కాదు. దీనిని బట్టి జిల్లావ్యాప్తంగా 10 వేల వరకు ఇంటి పట్టాలు ప్రింటింగ్‌ కాకపోవటానికి ఎక్కడికక్కడ స్థానికంగా తొక్కిపట్టడమే కారణమని స్పష్టంగా అర్ధమవుతోంది. పట్టారాని లబ్ధిదారుల పేర్లు ఇంటి పట్టా మంజూరు జాబితాలోనే ఉంటాయి. కానీ వారి చేతికి మాత్రం పట్టారాదు. 


కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా..

 తమకు పట్టా ఎందుకు రాలేదో తెలియక  లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో రెండో దశలో ఇళ్ల పట్టాలు వస్తాయని చెబుతున్నారు.  లబ్ధిదారులను మభ్య పెట్టడానికి 90 రోజుల పట్టాల పంపిణీలో ఉన్నాయని చెబుతున్నారు. 90 రోజుల కార్యక్రమం ఎప్పుడో దాటిపోయింది. శంకుస్థాపనల ఘట్టం మొదలైనా, ఇళ్ల పట్టాలు రాకపోవటంతో  లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంటోంది. జిల్లా యంత్రాంగం వీటిపై దృష్టి సారించి త్వరిత గతిన పెండింగ్‌ ఇంటి పట్టాలను కూడా ఇప్పించే బాధ్యతలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-07-31T05:59:36+05:30 IST