సీఎంఆర్‌లో జాప్యం

ABN , First Publish Date - 2022-10-01T04:45:34+05:30 IST

ప్రతి ఏటా సకాలంలో రైస్‌మిల్లర్ల చేత కస్టమ్‌ మిల్లింగ్‌ చేయించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది.

సీఎంఆర్‌లో జాప్యం

- ప్రభుత్వం గుప్పిట్లో లేని మిల్లర్లు

- ప్రతి ఏటా ఆలస్యమవుతున్న వైనం

- బ్యాంకు గ్యారంటీలు లేకపోవడమే కారణం

- మిల్లర్ల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రతి ఏటా సకాలంలో రైస్‌మిల్లర్ల చేత కస్టమ్‌ మిల్లింగ్‌ చేయించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఇందుకు కారణం మిల్లర్లు ప్రభుత్వం గుప్పిట్లో లేకపోవడమే కారణమని తెలుస్తున్నది. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పథకం మాత్రం మిల్లర్లకు వరంగా మారింది. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం ఇచ్చే వరి ధాన్యాన్ని మర ఆడించి తగిన నిష్పత్తిలో బియ్యాన్ని ఎఫ్‌సీఐకి గానీ, సివిల్‌ సప్లయ్‌కు ఇవ్వడమే వారి విధి. అయితే దీనిని ఆసరా జేసుకుంటున్న కొంతమంది మిల్లర్లు తమ అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఆ ధాన్యం స్థానంలో రీసైక్లింగ్‌ చేసిన బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి అందిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో తాము ఇచ్చిన ధాన్యం లేదని తెలిసినా కూడా వారిపై కొరడా ఝుళిపించలేకపోతున్నారు. ఒకవేళ వారిపై క్రిమినల్‌ కేసులు పెడితే నాలుగు రోజులు జైలులో ఉండి వస్తున్నారు. ఆ కేసు తెగే వరకు తన నుంచి బియ్యాన్ని రికవరీ చేసే పరిస్థితి లేకుండా పోతున్నాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన బ్యాంకు గ్యారంటీ నిబంధనను అమలు చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 

జిల్లాలోనే అత్యధిక రైస్‌మిల్లులు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలోనే రైస్‌ మిల్లులు ఉండడం గమనార్హం. ఇక్కడ 200కు పైగా పార్‌బాయిల్డ్‌, రారైస్‌ మిల్లులు ఉన్నాయి. ప్రతి ఖరీఫ్‌, రబీ సీజన్‌లో జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు, ఇతర జిల్లాల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సైతం జిల్లాలో ఉన్న రైస్‌మిల్లులకు కేటాయిస్తున్నారు. 2021-22 రబీ సీజన్‌లో 2,74,310 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేశారు. ఇతర జిల్లాల నుంచి 1,25,826 టన్నులు, మొత్తం 4,00,137 టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించారు. ఇందులో 2,72,093 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐ, సివిల్‌ సప్లయ్‌కు పెట్టాల్సి ఉంటుంది. ఖరీఫ్‌ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యంలో 3,95,191 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని మిల్లర్లకు అందజేశారు. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి 2,64,778 టన్నుల బియ్యాన్ని ఇవ్వాలి. ఇప్పటివరకు 80,456 టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. సీఎంఆర్‌లో జాప్యం చేస్తుండడంతో పాటు మిల్లర్లు బయట మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వం ఉచిత రేషన్‌ బియ్యం ఇవ్వడాన్ని నిలిపివేయడంతో ఆగ్రహించిన కేంద్రం సీఎంఆర్‌ను నిలిపివేసింది. రెండు మాసాలకు పైగా బియ్యం సేకరించకపోవడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సీఎంఆర్‌లో జాప్యం జరిగింది. ఈ నెలాఖరుతో పూర్తికావాల్సి ఉండగా, ప్రభుత్వం గడువు కూడా పెంచింది. ప్రభుత్వం ఇస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వడంలో రైస్‌మిల్లర్లు తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు వారిని ఏమి చేయలేకపోతున్నారు. అడకత్తెరలో పోక చెక్కలా అధికారుల పరిస్థితి మారింది. సుల్తానాబాద్‌ మండలంలోకి ఒక రైస్‌ మిల్‌ యజమాని సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించడంతో యజమానులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. సదరు యజమానులు పక్కదారి పట్టించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకపోవడం గమనార్హం. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకు గ్యారంటీ విధానం అమల్లో ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తవనే అభిప్రాయాలు అధికార వర్గాల్లో వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక రైస్‌మిల్‌కు కేటాయించే వరి ధాన్యంలో సగం ధాన్యానికి సంబంధించిన సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ తీసుకునేవాళ్లు. దీంతో మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ పూర్తిచేయడంతోపాటు ధాన్యాన్ని పక్కదారి పట్టించకుండా ఉండేవాళ్లు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంతో పోలిస్తే వరిసాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు లేకుండానే మిల్లర్లకు నేరుగా ధాన్యాన్ని కేటాయిస్తుండడంతో లక్ష్యం నెరవేరడం లేదు. సీఎంఆర్‌ విషయంలో బ్యాంకు గ్యారంటీ విధానాన్ని ప్రవేశపెడితేనే అధికారులకు గానీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2022-10-01T04:45:34+05:30 IST