బిల్లులు ఆపేశారేం?

ABN , First Publish Date - 2021-09-17T05:17:45+05:30 IST

ఉపాధి హామీ కన్వర్జెన్సీ బిల్లుల చెల్లింపులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. జిల్లాలో కొందరు గ్రామ సర్పంచులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి ఉపాధి హామీ కన్వర్జెన్సీ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా.. తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. వివిధ కొర్రీలు పెడుతూ కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలో 184 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

బిల్లులు ఆపేశారేం?

- ఉపాధి కన్వర్జెన్సీ నిధుల చెల్లింపులో జాప్యం

- 184 పంచాయతీలకు షోకాజ్‌ నోటీసులు

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

 ఉపాధి హామీ కన్వర్జెన్సీ బిల్లుల చెల్లింపులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. జిల్లాలో కొందరు గ్రామ సర్పంచులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి ఉపాధి హామీ కన్వర్జెన్సీ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా.. తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా..    వివిధ కొర్రీలు పెడుతూ కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలో 184 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ హయాంలో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణ పనులకు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. గతంలో ఉపాధి కన్వర్జెన్సీ నిధులతో సిమెంట్‌ రహదారులు, అంగన్‌వాడీ, పంచాయతీ, మండల, మహిళా సమాఖ్య భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించారు. జిల్లాలో పంచాయతీల పరిధిలో సుమారు రూ.65కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ పనులకు సంబంధించిన బిల్లులను డ్వామాకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ బిల్లుల చెల్లింపులకు రకరకాల కొర్రీలు పెట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందించి.. ఉపాధి కన్వర్జెన్సీ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 1,190 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో చేపట్టిన సుమారు 2,070 అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ఇలా సుమారు రూ.45కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. చెల్లింపుల అనంతరం కాంట్రాక్టర్ల నుంచి నిరభ్యంతర పత్రాలు స్వీకరించి.. తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. కానీ, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 1,886 పనులకు సంబంధించిన బిల్లులే చెల్లించినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల సర్పంచ్‌లు కాంట్రాక్టర్లను పిలిచి, ఎం-బుక్‌ల ఆధారంగా డబ్బులు చెల్లిస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు తామెందుకు చెల్లించాలంటూ మొండికేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వివిధ రకాల సాకులు చూపి.. చెల్లించడం లేదు. జిల్లాలో 184 మంది సర్పంచ్‌లు ఈ విధంగా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి నిధులు చెల్లించలేదు. దీంతో వీరందరికీ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో నిధుల చెల్లింపు విషయమై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని.. లేదంటే పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సర్పంచ్‌లు తర్జనభర్జన పడుతున్నారు. 

Updated Date - 2021-09-17T05:17:45+05:30 IST