మల్లన్న ఆలయ ఆదాయ, వ్యయాల వెల్లడిలో జాప్యం

ABN , First Publish Date - 2021-04-18T04:58:47+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ వార్షిక ఆదాయ, వ్యయాల వివరాల వెల్లడిలో జాప్యం వహిస్తుండటం పట్ల ఆలయాధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి 31తోనే ముగిసింది.

మల్లన్న ఆలయ ఆదాయ, వ్యయాల వెల్లడిలో జాప్యం

 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం

 ఆలయాధికారుల తీరుపై అనుమానాలు


చేర్యాల, ఏప్రిల్‌ 17: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ వార్షిక ఆదాయ, వ్యయాల వివరాల వెల్లడిలో జాప్యం వహిస్తుండటం పట్ల ఆలయాధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి 31తోనే ముగిసింది. ఏడాదిపాటుగా నిర్వహించిన లావాదేవీలు, ఆదాయ, వ్యయాల వివరాలను పొందుపరుస్తూ నివేదిక రూపొందించి లాభ, నష్టాలను వెల్లండించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన మొదటి వారంలోగా ఈ తంతు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు వెల్లడించలేదు. దొంగబిల్లుల కోసమే అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినివస్తున్నాయి. గతేడాది వార్షిక ఆదాయం రూ.26.45కోట్లు, వ్యయం రూ.24.68కోట్లు రాగా, కరోనా ఎఫెక్ట్‌తో సుమారు రూ.1.50 కోటి నష్టం చేకూరింది. కొన్నినెలల పాటు స్వామివారి దర్శనం నిలిపివేసి,  తిరిగి ప్రారంభించిన కొద్దిరోజులకే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అదనంగా జాతర వారాల సంఖ్య పెరగడంతో పాటు రూ.500దర్శన టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ఆదాయం పెరిగే అవకాశముంది. ఆయా లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నప్పటికీ ఆలయాధికారులు ఇప్పటి వరకు కూడా లెక్కల సంగతి తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 


జాతర బిజీ కారణంగా ఆలస్యం: ఈవో బాలాజీ


నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన మూడు, నాలుగు రోజులకే క్యాష్‌ బుక్‌ను క్లోజ్‌ చేశామని, జాతర బిజీ కారణంగా నివేదిక తయారీలో ఆలస్యం జరుగుతుందని ఈవో బాలాజీ తెలిపారు. లెక్కల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడడం లేదని, త్వరలోనే ఆదాయ, వ్యయాల వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.


 

Updated Date - 2021-04-18T04:58:47+05:30 IST