ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

ABN , First Publish Date - 2020-05-12T10:10:13+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. హమాలీల కొరత, మిల్లర్లు తొందరగా అన్‌ లోడింగ్‌ చేసుకోకపోవడం, లారీలు రాకపోవడంతో

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

ఖమ్మం ధాన్యానికి ప్రాధాన్యం ఇస్తున్న మిల్లర్లు

ఆ వాహనాలు రాగానే తొందరగా ఆన్‌ లోడింగ్‌

వెయిటింగ్‌లో స్థానిక ధాన్యం లారీలు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. హమాలీల కొరత, మిల్లర్లు తొందరగా అన్‌ లోడింగ్‌ చేసుకోకపోవడం, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. వరి కోసి పది, పదిహేను రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తూకం వేయడం లేదు. అప్పుడప్పుడు వర్షాలు పడుతుండడంతో రైతులు ఎక్కడ ధాన్యం తడుస్తుందోనని కలవరానికి గురవుతున్నారు. కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు లేకపోవడంతో పరదాలను కిరాయికి తీసుకుని ధాన్యం కుప్పలపై కప్పుతున్నారు. కొన్ని కేంద్రాలకు ఇప్పటి వరకు కూడా లారీలు రాకపోవడంతో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఆయా మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. శరామామూలుగా కేంద్రాల్లో ధాన్యం తూకం తరుగు తీస్తూనే ఉన్నారు. క్వింటాలు ధాన్యానికి 2 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు చెబుతున్నారు. కేవలం కొంత ధాన్యానికే కోతలు లేకుండా తీసుకుంటున్నారని చెబుతున్నారు. 


విస్తారంగా పంట సాగు..

జిల్లాలో ఈ సీజన్‌లో 291 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1,65,945 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 3.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా వరకు ధాన్యం కేంద్రాల్లో, వరి కల్లాల్లో ఉన్నది. తాలు, చెత్త ఉందనే సాకుతో క్వింటాలుకు 2 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో విస్తారంగా వరి పంట సాగయ్యింది. కోతలు 85 శాతం వరకు పూర్తయ్యాయి. ఆలస్యంగా వేసిన వరి ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నది. వారం రోజుల్లో మొత్తం కోతలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయా, లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 17 శాతం లోపే తేమ వచ్చినా పది, పదిహేను రోజుల తర్వాత కాంటాలు వేస్తున్నారని రైతులు చెబుతున్నారు.


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలోనే రైసుమిల్లులు ఉన్నాయి. ప్రస్తుతానికి 147 వరకు మిల్లులు నడుస్తున్నాయి. ఈ మిల్లులకు జిల్లాలో సాగైనా వరి ధాన్యమే గాకుండా మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి ధాన్యాన్ని కేటాయించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల ధాన్యం నాణ్యతగా ఉందని అక్కడి నుంచి లారీల్లో వచ్చే ధాన్యాన్ని తొందరగా దించుకుంటున్నారుని రైతులు చెబుతున్నారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తొందరగా ధాన్యాన్ని దించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో లారీలు తక్కువగా వస్తున్నాయి. 


ఏ గ్రేడ్‌ ధాన్యం కామన్‌ గ్రేడ్‌ కింద కొనుగోలు...

సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన 8 కేంద్రాల ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడంతో నిర్వాహకులు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కేంద్రాల నుంచి ధాన్యం తొందరగా తరలక పోవడంతో కాంటాలు పెట్టడం లేదు. ఒకసారి కాంటా అయిన తర్వాత ధాన్యం తడిస్తే దాని వల్ల వాటిల్లే నష్టం నిర్వాహకులే భరించాల్సి ఉండడంతో కాంటా పెట్టడం లేదు. ధాన్యం తరలింపును బట్టి కాంటాలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ధాన్యం కేంద్రాల్లో పని చేస్తున్న హమాలీలు మాస్కులు ధరించకుండానే విధులు నిర్వహిస్తున్నారు.


కొన్ని కేంద్రాల్లో హమాలీలు తక్కువగా ఉన్నారు. ఎండల వల్ల తూకాలు ముందుకు సాగడం లేదు. క్వింటాలు ధాన్యానికి హమాలీ చార్జీ కింద 30 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా, కేంద్రాన్ని బట్టి 35 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కూడా కామన్‌ గ్రేడ్‌ కింద కొన్ని కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో రైతులు క్వింటాలుకు 20 రూపాయలు నష్టపోతున్నారు. చాలా కేంద్రాల్లో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికారులు సత్వరమే స్పందించి ధాన్యం తరలింపు, మిల్లుల వద్ద తొందరగా దించుకునేలా, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2020-05-12T10:10:13+05:30 IST