నత్తనడక

ABN , First Publish Date - 2021-08-02T04:02:50+05:30 IST

నత్తనడక

నత్తనడక
పైపులైను పనులు నిలిచిపోవడంతో ఒక్కడ పైపులు అక్కడే పడి ఉన్నాయి

- ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పనుల్లో జాప్యం

- కాంట్రాక్టర్లలో కొరవడుతున్న స్పందన 

(ఇచ్ఛాపురం రూరల్‌)

జల్‌జీవన్‌ మిషన్‌ పథకం నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 2024 నాటికి పనులు పూర్తిచేసి తాగునీరు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించిన పనులకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో పరిపాలనా ఆమోదం ఇచ్చింది. అప్పటి నుంచి ఈ పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం రూ.301 కోట్లతో 1,786 పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.5 లక్షల లోపు 455 పనులు, రూ.5లక్షల నుంచి రూ. 40 లక్షలలోపు 1199 పనులు, రూ.40 లక్షల కంటే అధిక విలువైనవి 132 పనులు చేపట్టనున్నారు. వాటిద్వారా జిల్లాలో 6,18,752 కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. కొన్ని పనులకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువై ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. రూ.40 లక్షల కంటే విలువైన పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో మరోసారి వీటికి టెండర్లు పిలవనున్నారు. ప్రభుత్వం నిర్ధేశం మేరకు రూ.5 లక్షల లోపు విలువైన పనులకు నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించారు. ఇందులో 238 పనులకు సంబంధించి ఒప్పందాలు పూర్తయి, చేపట్టారు. రూ.40 లక్షలలోపు పనులకు జిల్లా స్థాయిలో 572 టెండర్లు రాగా, వారికి అప్పగిస్తున్నారు. ఇంకా 220 టెండర్లు ఓపెన్‌ చేయాల్సి ఉంది. ఇప్పటికే చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యమవుతుండడంతో కాంట్రాక్టర్లు  ఆచితూచి స్పందిస్తున్నారు. దీంతో ఒప్పందాలు పూర్తయి.. పనులు చేపట్టడంలో  జాప్యమవుతోంది. గడువులోగా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.  


ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీరు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీటిని సరఫరా చేసే లక్ష్యంతో ఇప్పటివరకు పథకాలు రూపొందించారు. దీనిని 55 లీటర్లకు పెంచి నీటిని సరఫరా చేసేలా జల్‌ జీవన్‌ మిషన్‌లో పనులు చేపడుతున్నారు. పనులను మూడు దశలుగా విభజించారు. తొలిదశలో ఇప్పటికే 40 లీటర్లు ఇస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉన్న పథకాన్ని విస్తరించడం... అంతర్గతంగా పైపులైన్లు నిర్మించడం ద్వారా నీటిని సరఫరా చేస్తారు. రెండో దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు జలాలను సమకూరుస్తారు. పైపులైను సామర్థ్యం పెంచి 55 లీటర్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. మూడో దశలో కొత్త పథకాలు నిర్మించి లక్ష్యం మేరకు తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇస్తారు. మూడు దశల్లో ఉపరితల జలాలను సరఫరా చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుబాటులో లేని ప్రాంతాల్లో మాత్రమే సురక్షితమైన భూగర్భ జలాలను వినియోగించుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పూర్తయితే ప్రతి వ్యక్తికి 55 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తారు.


గడువులోగా పూర్తి చేస్తాం 

జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఒకేసారి పెద్ద ఎత్తున 1,786 పనులు చేపట్టడంతో కాంట్రాక్టర్ల నుంచి పోటీ తక్కువగా ఉంది. నామినేషన్‌ కింద ఇచ్చిన పనులకు సంబంధించి 60శాతం పూర్తయ్యాయి. 2024 వరకు గడువు ఉన్నందున అప్పటిలోగా పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఒకసారి పిలిచిన టెండర్లకు స్పందన రాకపోతే, మళ్లీ పిలిచి పనులు అప్పగిస్తాం.

- డి.తిరుపతి నాయుడు, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

 

Updated Date - 2021-08-02T04:02:50+05:30 IST