కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యమేల ?

ABN , First Publish Date - 2021-04-14T06:30:11+05:30 IST

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటపొలాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక అయోమయ పరిస్థితిలో అన్నదాతలు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యమేల ?
చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులు

ముమ్మరంగా పంట కోతలు

అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం

ఆందోళనలో రైతులు  8 కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్‌

చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 13: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటపొలాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక అయోమయ పరిస్థితిలో అన్నదాతలు ఉన్నారు. దీంతో దళారులు ప్రవేశించి  రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. వారం రోజులుగా వరి కోతలు సాగుతున్నాయి. వ్యవసాయ బావుల వద్ద కళ్ళాలు లేని రైతులు ధాన్యం రాశులు పోసుకొనేందుకు వీలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కురిసిన అకాల వర్షం రైతుల గుండెలను పిండి చేసిం ది. సుమారు గంటసేపు కురిసిన వర్షంతో వరి పంటకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడు వర్షం కురిసి, పంట అంతా మునిగిపోతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరి కోతలను మరింత ముమ్మరం చేశారు.


తడిసిన ధాన్యం 

వ్యవసాయ బావుల వద్ద కళ్ళాలు లేని రైతులు తమ ధాన్యాన్ని తెచ్చి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రాశులుగా పోశారు. సోమవారం కురిసిన అకాల వర్షానికి 21 మంది రైతుల ధాన్యం రాశులు తడిసి పోయాయి. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తెరవకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


యాసంగిలో పెరిగిన సాగు 

చౌటుప్పల్‌ మండలంలో యాసంగిలో రెండు లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో ఐకేపీ, పీఏసీఎస్‌, ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,571 మంది రైతుల నుంచి 1.49లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలుచేశారు. యాసంగిలో వరిసాగు పెరిగినందున ధాన్యం దిగుబడి సైతం అదేస్థాయిలో రానుంది. వానాకాలం కంటే యాసంగిలో మరో 50వేల క్వింటాళ్ల ధాన్యం రానున్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. 


నాలుగైదు రోజుల్లో ప్రారంభిస్తాం : చింతల దామోదర్‌ రెడ్డి, చైర్మన్‌, పీఏసీఎస్‌, చౌటుప్పల్‌ 

మండలంలో నాలుగైదు రోజుల్లో తొమ్మిది ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ధాన్యాన్ని శుభ్రంచేసుకొని కేంద్రాలకు తీసుకురావాలి. ధాన్యంలో తాలు, మట్టితోపాటు తేమ అధికంగా ఉంటే  తిరస్కరణకు గురవుతాయి. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు రైతులు సహకరించాలి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన స్థలాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతులు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. 


అకాల కష్టం

యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన కాయలు నేలరాలడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. గుండాల మండలం సీతారాంపురం, అనంతారం, వెల్మజాల, సుద్దాల గ్రామాల్లోని తోటల్లో మామిడికాయలు నేలరాలా యి. పలు ప్రాంతాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. వలిగొండ మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన నిమ్మల యాదగిరి రూ.80వేలతో మూడు ఎకరాల మామిడితోటను కౌలుకు తీసుకోగా ఈదురు గాలులకు 50శాతం మామిడికాయలు రాలిపోయాయి. కాయకోతకు వచ్చే సమయంలో నేలరాలడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆత్మకూరు(ఎం) మండలం తిమ్మాపురం, పల్లెర్లలో పిడుగులు పడి 17గొర్రెలతోపాటు ఒక గేదె మృతి చెందింది. తిమ్మాపురంలో కొసన యాదయ్యకు చెందిన రూ.లక్ష విలువైన 11 గొర్రెలు, పల్లెర్లలో దండెబోయిన పర్వతాలుకు చెందిన రూ.54వేల విలువైన ఆరు గొర్రెలు, రూ.80వేల విలువైన గేదె మృతి చెందింది. తిమ్మాపురం, పల్లెర్ల గ్రామాల్లో పశువైద్యాధికారి సంతోష్‌, ఆర్‌ఐ యాదగిరి పంచనామా నిర్వహించారు. చౌటుప్పల్‌ మార్కెట్‌ యార్డులో 21 మంది రైతుల ధాన్యం రాశుల కిందకు వర్షపు నీరు చేరి తడిశాయి.  

Updated Date - 2021-04-14T06:30:11+05:30 IST