అందని పుస్తకం... అర్థంకాని పాఠం!

ABN , First Publish Date - 2021-08-03T04:54:13+05:30 IST

పాఠ్యపుస్తకాలు లేక ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్‌లైన్‌లో తరగతులు బోధిస్తున్నా చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మెదక్‌ జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రభుత్వం గతనెల జూలై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించింది.

అందని పుస్తకం... అర్థంకాని పాఠం!

ఇంటర్‌ విద్యార్థులకు తప్పని కష్టాలు

అరకొరగా పాఠ్యపుస్తకాల సరఫరా

ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు

చదువుకునేందుకు పుస్తకాలు కరువు


మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 2: పాఠ్యపుస్తకాలు లేక ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్‌లైన్‌లో తరగతులు బోధిస్తున్నా చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మెదక్‌ జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రభుత్వం గతనెల జూలై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించింది. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 2,272 మంది ఉన్నారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 2,735 మంది ప్రవేశాలు పొందారు. 


జిల్లాకు కావాల్సిన పుస్తకాల వివరాలు

ఇంటర్‌ మొదటి సంవత్సరం తెలుగు మీడియం పుస్తకాలు 2,581 సెట్లు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్ధులకు 475 సెట్లు, అలాగే సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగు 2,070, హిందీ భాష 362 పుస్తకాలు కావాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం తెలుగు మీడియం విద్యార్థులకు 1,983, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు 234 సెట్లు, సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగు 1,730, హిందీ భాష 484 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని అధికారిక లెక్కలు తేల్చిచెప్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదు. 


అరకొరగా పుస్తకాలు

ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను అరకొరగా అందజేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో క్లాసులు వినడం పూర్తయిన అనంతరం సంబంధిత పాఠాలను చదువుకుందామంటే పుస్తకాలు లేక విద్యార్థుల చదువు ముందుకుసాగడం లేదు. మరోవైపు స్మార్ట్‌ ఫోన్‌, టీవీలు అందుబాటులోలేని నిరుపేద విద్యార్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సొంతంగా చదువుదామన్నా వారి వద్ద పుస్తకాలులేవు. కనీసం ఇలాంటి వారికైనా పాఠ్యపుస్తకాలు యుద్ధప్రాతిపాదికన అందించాల్సిన ప్రభుత్వం స్పందించడం లేదు. జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాల వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ లేక్కప్రకారం ప్రభుత్వం తెలుగు అకాడమీకి ముద్రణ బాధ్యత అప్పగించింది. ముద్రణలో ఆలస్యం కారణంగా పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యమవుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 


70 శాతం సిలబస్‌ టార్గెట్‌

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 70 శాతం సిలబ్‌సను తప్పనిసరిగా బోధించాలని ఇంటర్‌ బోర్టు ఆదేశించింది. ఈ ఏడాది సిలబ్‌సలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీనికి అనుగుణంగా పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా పుస్తకాలు అరకొరగానే అందాయి. గతేడాది మాత్రం సెకండియర్‌ విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ అందజేశారు. మరోవైపు ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించినా కొన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. అతిథి అధ్యాపకుల నియామకంపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధ్యాపకులు ప్రదేశాల్లో ఆయా సబ్జెక్టుల్లో సందేహాలను తీర్చేందుకు ఎవరిని అడగాలో తెలియడంలేదని విద్యార్థులు వాపోతున్నారు.

Updated Date - 2021-08-03T04:54:13+05:30 IST