ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో పేర్ల తొలగింపు

ABN , First Publish Date - 2022-09-17T06:50:10+05:30 IST

కొందరు రెవెన్యూ అధికారులు ఇప్పుడు ప్రైవేటు భూములపైనా పడుతున్నారు.

ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో పేర్ల తొలగింపు

ప్రైవేటు భూముల్లోనూ రెవెన్యూ లీలలు

ఆర్టీఐ కింద వివరాలు కోరితే రికార్డులు కనిపించలేదని సమాధానం

న్యాయం కోసం తిరుగుతున్న బాధిత రైతులు


ప్రభుత్వ భూములను అధికార పార్టీల నేతలకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్న కొందరు రెవెన్యూ అధికారులు ఇప్పుడు ప్రైవేటు భూములపైనా పడుతున్నారు. కోట్ల రూపాయల భూములను రియల్టర్లకు దొడ్డిదారిన అప్పగించేస్తున్నారు. దీనికి రెవెన్యూ చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు హక్కుదారులైన రైతులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 


రేణిగుంట, సెప్టెంబరు 16: రేణిగుంట మండలం తండ్లం రెవెన్యూ లెక్కదాఖలాలో ఉన్న సర్వే నెంబరు  7/1లో 5.04 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి హక్కుదారులు 13మంది ఉన్నారు. వీరు వంశపారంపర్యంగా  ఈ పొలాన్ని అనుభవిస్తున్నారు.2017వరకు ఇదంతా సజావుగా సాగింది. 2018లో రేణిగుంట మండల తహసీల్దారుగా నరసింహులు నాయుడు బాధ్యతలు చేపట్టాక ఈ భూమికి రక్షణ కరువైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఓ రియల్టర్‌ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆ రియల్టర్‌కు కొత్తగా వచ్చిన తహసీల్దార్‌ ఆ భూమిని రియల్టర్‌కు అప్పగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు విమర్శలున్నాయి. ఇందులో భాగంగా తహసీల్దార్‌ తనకున్న అధికారంతో రెవెన్యూ చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని డి.డిఐఎ్‌స/బి/145/2018లో ఓ ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను విడుదల చేశారు. ఈ ప్రొసీడింగ్‌ అమలు చేయక ముందు ఆ భూమిపై ఉన్న హక్కుదారులకు నోటీసులు జారీ చేయాలి. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఆరుగురు రైతుల పేర్లను ఆన్‌లైన్‌నుంచి తొలగించి.. రియల్టర్‌కు అనుకూలంగా ఉన్న ఆరుగురి పేర్లను కొత్తగా ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరిగేలా వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. ఈ ఆరుగురు రైతులపై 2.60 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వెంటనే వీరంతా వెంటనే ఆ రియల్టర్‌కు విక్రయించేశారు. మిగిలిన ఏడుగురు రైతుల్లో కొంతమందికి భూమి లేనట్టుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇది తెలిసి హక్కుదారులైన రైతులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించగా.. తమకేమీ తెలియదని రెవెన్యూ అధికారులు చెప్పారు. దాంతో ఓ రైతు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సర్వే నెంబరు 7/1లో ఉన్న 5.04 ఎకరాలకు సంబంధించి పూర్తి వివరాలను కావాలని కోరారు. అందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేదని రెవెన్యూ అధికారులు సమాధానం ఇచ్చారు. రికార్డులు తారుమారయ్యాయని అర్థమవడంతో బాధిత రైతులు.. ఆర్డీవో కోర్టులో గత ఏడాది (రిట్‌ పిటిషన్‌ నెంబర్‌ 1524/21, 60/22) పిటిషన్‌ వేశారు. ఇదిలా ఉంటే.. ప్రొసీడింగ్స్‌ విడుదలైన అనంతరం ఆ భూములపై తమకు హక్కు లేదన్నప్పుడు ఇతరులకు ఎలా హక్కు వస్తుందని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. 


విచారణ జరిపి న్యాయం చేయాలి 

పట్టా భూముల్లో రెవెన్యూ అధికారుల జోక్యం లేకున్నా మా భూముల విషయంలో కలుగజేసుకుని ప్రత్యేక ప్రొసీడింగ్స్‌ ఎలా ఇస్తారు? పైగా ఆరుగురి పేర్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఎలా చేరుస్తారు? ఉన్న పేర్లను ఎలా తొలగిస్తారు? మా పేర్లు ఆన్‌లైన్‌లో పెట్టాలని మూడేళ్లనుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటి? కోట్ల రూపాయల భూములకు సంబంధించిన రికార్డులను ఎలా తారుమారు చేస్తారు?  ఆర్డీవో కోర్టులో కేసులు ఉన్నప్పటికీ విక్రయాలెలా జరుగుతాయి?  దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి. 


ప్రైవేటు భూములపై ప్రొసీడింగ్స్‌ ఇచ్చే అవకాశం ఉండదు 

ప్రైవేటు భూములపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల జోక్యం ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య భూతగాదాలు ఏర్పడినపుడు శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్‌ భూములపై ప్రత్యేక ప్రొసీడింగ్స్‌ ఇచ్చే అవకాశాలు లేవు. ఈ సంఘటనపై విచారించి చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-09-17T06:50:10+05:30 IST