ఢిల్లీ ధమాకా

ABN , First Publish Date - 2021-04-11T09:15:20+05:30 IST

గురు శిష్యుల సమరంగా పేర్కొన్న చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లో చివరకు రిషభ్‌ పంత్‌దే పైచేయి అయ్యింది. సీఎ్‌సకే పేలవమైన బౌలింగ్‌ను చెండాడిన శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85), పృథ్వీ షా (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) ఢిల్లీ క్యాపిటల్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని...

ఢిల్లీ ధమాకా

  • చెన్నైపై అలవోక విజయం  
  • దంచికొట్టిన పృథ్వీ షా, ధవన్‌ 

గతేడాది చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. తాజా సీజన్‌ను కూడా   పేలవంగానే ఆరంభించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధవన్‌ వీర బాదుడుకు సీఎ్‌సకే బౌలర్లు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడిపోయారు. ఏ బంతిని ఎవరు వేసినా.. ఎలా వేసినా బౌండరీకే దారి.. అనే రీతిలో వీరు చెలరేగారు. దీంతో 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. ఇక,  సురేశ్‌ రైనా హాఫ్‌ సెంచరీకి తోడు చివర్లో సామ్‌ కర్రాన్‌ మెరుపులతో  చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.


ముంబై: గురు శిష్యుల సమరంగా పేర్కొన్న చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లో చివరకు రిషభ్‌ పంత్‌దే పైచేయి అయ్యింది. సీఎ్‌సకే పేలవమైన బౌలింగ్‌ను చెండాడిన శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85), పృథ్వీ షా (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) ఢిల్లీ క్యాపిటల్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందించారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. రైనా (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), మొయిన్‌ అలీ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), సామ్‌ కర్రాన్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) రాణించారు. వోక్స్‌, అవేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 190 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ధవన్‌ నిలిచాడు. 


ఓపెనర్ల ధనాధన్‌: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు ధవన్‌, పృథ్వీ షా మెరుపు ఆరంభాన్ని అందించారు. చెన్నై బౌలర్లను స్వేచ్ఛగా ఎదుర్కొంటూ బౌండరీల వరద పారించారు. ఓవర్‌కో బౌండరీ చొప్పున.. స్ట్రయిక్‌ను రొటేట్‌ చేసుకుంటూ కదం తొక్కారు. నాలుగో ఓవర్‌లో ధవన్‌ 4,6.. షా మరో 4తో 17 రన్స్‌ వచ్చాయి. ఇక తర్వాతి ఓవర్‌లో షా హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 65 పరుగులు సాధించింది. 2008 తర్వాత చెన్నైపై తొలి ఆరు ఓవర్లలో ఢిల్లీకివే అత్యధిక రన్స్‌. అటు పృథ్వీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు వదిలేయగా 27 బంతుల్లోనే అతడి అర్ధసెంచరీ పూర్తయ్యింది. ఆ వెంటనే ధవన్‌ కూడా 35 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించాడు. అలాగే 2016 తర్వాత జట్టుకు తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం జత చేరింది. అయితే 13వ ఓవర్‌లో 6,4 సాధించిన పృథ్వీ షా ఇన్నింగ్స్‌కు బ్రావో అడ్డుకట్ట వేశాడు. 14వ ఓవర్‌లో అతడి క్యాచ్‌ను మొయిన్‌ అలీ డీప్‌ కవర్‌లో అందుకున్నాడు. అప్పటికే తొలి వికెట్‌కు 138 పరుగులు రావడం విశేషం. కాసేపటికే జోరు మీదున్న ధవన్‌ను 17వ ఓవర్‌లో శార్దూల్‌ ఎల్బీగా అవుట్‌ చేయగా, అప్పటికి ఢిల్లీకి 21 బంతుల్లో 22 రన్స్‌ అవసరం కావడంతో ఇబ్బంది ఎదురుకాలేదు. చివరకు కెప్టెన్‌ పంత్‌ (15 నాటౌట్‌) ఫోర్‌తో మరో 8 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


ఆదుకున్న రైనా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఏడు పరుగులకే ఓపెనర్లు డుప్లెసి (0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (7) వికెట్లను కోల్పోయింది. అయితే ‘మిస్టర్‌ ఐపీఎల్‌’ సురేశ్‌ రైనా చక్కటి భాగస్వామ్యాలతో పటిష్ఠ స్కోరు అందేలా చూశాడు. ఆరంభంలో మొయిన్‌ అలీతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో ఓవర్‌లో అలీ రెండు ఫోర్లు బాదగా.. రైనా ఐదో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు సాధించడంతో స్కోరులో కదలిక వచ్చింది. అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నై ఆటతీరు మారింది. స్పిన్నర్‌ అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకున్న మొయిన్‌ అలీ చెలరేగాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో రెండు ఫోర్లు, తొమ్మిదో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. కానీ అశ్విన్‌కే అలీ దొరికిపోవడంతో మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రైనా విజృంభించాడు. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను ఆడుకుంటూ 12వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 17 పరుగులు రాబట్టాడు. అలాగే ఓ సిక్సర్‌తో 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక ఉన్న కాసేపు చెలరేగిన అంబటి రాయుడు (23)ను 14వ ఓవర్‌లో టామ్‌ కర్రాన్‌ అవుట్‌ చేశాడు. వీరి మధ్య నాలుగో వికెట్‌కు 33 బంతుల్లోనే 63 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్‌లో  రైనా రనౌట్‌.. ధోనీ డకౌట్‌తో ఝలక్‌ తగిలింది. కానీ చివర్లో సామ్‌ కర్రాన్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. తన సోదరుడు టామ్‌ కర్రాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 పరుగులు సాధించగా.. చివరి ఓవర్‌లో మరో పది పరుగులు రావడంతో చెన్నై సవాల్‌ విసిరే స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. సామ్‌-జడేజా (26) మధ్య ఏడో వికెట్‌కు 51 పరుగులు వచ్చాయి.


2015 తర్వాత ఢిల్లీ ఓపెనర్లు హాఫ్‌ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి.


స్కోరుబోర్డు

చెన్నై: రుతురాజ్‌ (సి) ధవన్‌ (బి) వోక్స్‌ 5; డుప్లెసి (ఎల్బీ) అవేశ్‌ ఖాన్‌ 0; మొయిన్‌ అలీ (సి) ధవన్‌ (బి) అశ్విన్‌ 36; రైనా (రనౌట్‌) 54; రాయుడు (సి) ధవన్‌ (బి) టామ్‌ కర్రాన్‌ 23; జడేజా (నాటౌట్‌) 26; ధోనీ (బి) అవేశ్‌ 0; సామ్‌ కర్రాన్‌ (బి) వోక్స్‌ 34; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 188/7; వికెట్ల పతనం: 1-7, 2-7, 3-60, 4-123, 5-137, 6-137, 7-188; బౌలింగ్‌: వోక్స్‌ 3-0-18-2; అవేశ్‌ 4-0-23-2; అశ్విన్‌ 4-0-47-1; టామ్‌ కర్రాన్‌ 4-0-40-1; అమిత్‌ మిశ్రా 3-0-27-0; స్టొయినిస్‌ 2-0-26-0.


ఢిల్లీ: పృథ్వీషా (సి) అలీ (బి) బ్రావో 72; శిఖర్‌ ధవన్‌ (ఎల్బీ) శార్దూల్‌ 85; రిషభ్‌ పంత్‌ (నాటౌట్‌) 15; స్టొయినిస్‌ (సి) సామ్‌ కర్రాన్‌ (బి) శార్దూల్‌ 14; హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.4 ఓవర్లలో 190/3; వికెట్ల పతనం: 1-138, 2-167, 3-186; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-36-0; సామ్‌ కర్రాన్‌ 2-0-24-0; శార్దూల్‌ 3.4-0-53-2; జడేజా 2-0-16-0; మొయిన్‌ అలీ 3-0-33-0; బ్రావో 4-0-28-1.



Updated Date - 2021-04-11T09:15:20+05:30 IST