ఢిల్లీలో సోమవారం నుంచి మెట్రో రైళ్ల నిలిపివేత : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-05-09T20:20:52+05:30 IST

విజృంభిస్తున్న కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలను

ఢిల్లీలో సోమవారం నుంచి మెట్రో రైళ్ల నిలిపివేత : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : విజృంభిస్తున్న కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలను అమలు చేయబోతున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న అష్ట దిగ్బంధనాన్ని మరొక వారంపాటు, అంటే, మే 17 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి మెట్రో రైలు సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నగరంలో గత కొద్ది రోజులుగా ఆక్సిజన్ సరఫరా చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడుతున్నట్లు తెలిపారు. 


కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నామని కేజ్రీవాల్ చెప్పారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ బెడ్స్‌ను పెంచినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్ పరిస్థితి మెరుగైందన్నారు. తమకు ఆక్సిజన్ కావాలంటూ ఫోన్ కాల్స్ రావడం లేదని చెప్పారు. 


18-44 సంవత్సరాల వయసువారికి వ్యాక్సినేషన్ జరుగుతోందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. తమకు వ్యాక్సిన్ల అదనపు డోసులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సినేషన్ కోసం పాఠశాలల్లో మెరుగైన ఏర్పాట్లు చేశామన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉందని, కేంద్ర ప్రభుత్వం సాయపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. 


కోవిడ్-19 పాజిటివిటీ రేటు తగ్గిందని చెప్పారు. గడచిన రెండు, మూడు రోజుల్లో పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందన్నారు. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఇప్పటి వరకు సాధించిన విజయాలు నిష్ఫలమవుతాయన్నారు. 


ఆక్సిజన్ సరఫరా విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అదనపు మద్దతు ఇస్తుండటంతో ఆక్సిజన్ కోసం ఆసుపత్రుల నుంచి ఫోన్లు రావడం లేదన్నారు. 


Updated Date - 2021-05-09T20:20:52+05:30 IST