ఉత్తరాఖండ్‌ ఎన్నికలపై 'ఆప్' దృష్టి.. ఉచిత విద్యుత్తే ప్రధానాస్త్రం

ABN , First Publish Date - 2021-07-10T19:56:28+05:30 IST

వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి..

ఉత్తరాఖండ్‌ ఎన్నికలపై 'ఆప్' దృష్టి.. ఉచిత విద్యుత్తే ప్రధానాస్త్రం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టి సారించారు. విద్యుత్ సమస్యలు, ఉచిత విద్యుత్ వంటి అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారంనాడు ఆయన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఓ ట్వీట్‌లో కేజ్రీవాల్ తెలియజేశారు.


''ఉత్తరాఖండ్ స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముతోంది. అయినప్పటికీ ప్రజలు ఎందుకు ఎక్కువ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది? ఢిల్లీలో సొంతంగా విద్యుదుత్పత్తి లేదు. బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అయినప్పటికీ ఢిల్లీలో ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఉత్తరాఖండ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేమా? రేపు (ఆదివారం) డెహ్రాడూన్‌లో కలుద్దాం'' అని కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. గృహ అవసరాల కోసం నెలవారీ వినియోగించే విద్యుత్‌కు 100 యూనిట్ల వరకూ ఉచితంగా సరఫరా చేస్తామని, 101 నుంచి 200 యూనిట్ల వరకూ 100 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఉత్తరాఖండ్ విద్యుత్ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - 2021-07-10T19:56:28+05:30 IST