మోదీకి కేజ్రీవాల్ లేఖ

ABN , First Publish Date - 2021-11-28T20:44:33+05:30 IST

కరోనా వైరస్ కొత్త రూపాంతరం ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి

మోదీకి కేజ్రీవాల్ లేఖ

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కొత్త రూపాంతరం ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాలను భారత దేశానికి రానివ్వొద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఏడాదిన్నరపాటు మన దేశం ఈ మహమ్మారితో గట్టిగా పోరాడిందని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, అతి కష్టం మీద కరోనా వైరస్ నుంచి కోలుకుందని ఆదివారం రాసిన లేఖలో పేర్కొన్నారు. 


ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్ దేశాలు సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు ప్రయాణాలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఈ కొత్త రూపాంతరం ఆందోళన కలిగిస్తోందని, దీనిని మన దేశంలో నిరోధించడానికి చేయగలిగినదంతా చేయాలని పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రాంతాల నుంచి మన దేశానికి రాకపోకలను నిలిపేయాలని కోరారు. ఈ చర్యలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఒమిక్రాన్ ప్రభావిత వ్యక్తి భారత దేశంలో ప్రవేశిస్తే, తీవ్ర హాని జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ గురించి అధికారులు ఆయనకు వివరించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సరళీకరించాలనే యోచనను సమీక్షించాలని తెలిపారు. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. మరోవైపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. 


Updated Date - 2021-11-28T20:44:33+05:30 IST