రెండు స్టేషన్లలో కోవిడ్ కేర్ కోచ్‌లు.. కేంద్రానికి ఢిల్లీ సర్కార్ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-04-18T23:18:51+05:30 IST

దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రెండు రైల్వేస్టేషన్లలో..

రెండు స్టేషన్లలో కోవిడ్ కేర్ కోచ్‌లు.. కేంద్రానికి ఢిల్లీ సర్కార్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రెండు రైల్వేస్టేషన్లలో సుమారు 5,000 పడకలతో కోవిడ్ కేర్ కోచ్‌లు అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని ఢిల్లీ సర్కార్ కోరింది. షకూర్ బస్తి, ఆనంద్ విహార్ స్టేషన్లలో ఈ కోవిడ్ కోర్ కోచ్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. గత 24 గంటల్లో 25,000కు పైగా కోవిడ్ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయని, పాజిటివిటీ రేటు సుమారు 30 శాతానికి చేరిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారంనాడు మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో 100 కంటే తక్కువగానే ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని, పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతోందని అన్నారు.


కాగా, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకరంగా ఉన్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ దేవ్ లేఖ రాశారు. ఆనంద్ విహార్, షకుర్ బస్తీ రైల్వే స్టేషన్లలో లాజిస్టిక్ సపోర్ట్, మెడికల్, పారామెడికల్ సిబ్బంది, ఆక్సిజన్ సౌకర్యాలను అత్యవసర ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని ఆ లేఖలో సీఎస్ కోరారు. గత ఏడాది జూలైలో 12,472 పడకలతో కూడిన 813 కోచ్‌లను రైల్వేలు అందుబాటులో ఉంచాయి. వీటిలో ఢిల్లీలో 530 కోచ్‌లు, యూపీలో 270, బీహార్‌లో 40 కోచ్‌లు అందుబాటులోకి తెచ్చారు. అయితే, వీటిలో ఎక్కువ కోచ్‌లు వినియోగంలోకి రాలేదు. కోచ్‌లలో వేడి, దోమల బెడద ఎక్కువగా ఉన్నట్టు ఫిర్యాదులు కూడా వచ్చాయి.

Updated Date - 2021-04-18T23:18:51+05:30 IST