ఐపీఎల్‌లో మరో షాక్.. వారికి కూడా కరోనా..

ABN , First Publish Date - 2021-05-04T05:23:51+05:30 IST

ఇన్నాళ్లూ ప్రశాంతంతా సాగిన ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పుడు కల్లోలం రేగుతోంది. ఎంతో పటిష్ఠ బందోబస్తు నడుమ, బయోబబుల్ వాతావరణంలో ఉంటున్న ఆటగాళ్లు కరోనా బారిన పడడమే దీనికి కారణం. అయితే తాజాగా ఢిల్లీలోని..

ఐపీఎల్‌లో మరో షాక్.. వారికి కూడా కరోనా..

ఢిల్లీ: ఇన్నాళ్లూ ప్రశాంతంతా సాగిన ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పుడు కల్లోలం రేగుతోంది. ఎంతో పటిష్ఠ బందోబస్తు నడుమ, బయోబబుల్ వాతావరణంలో ఉంటున్న ఆటగాళ్లు కరోనా బారిన పడడమే దీనికి కారణం. అయితే తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్ స్టాఫ్ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదుగురు మైదాన సిబ్బంది కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారికంగా వెల్లడికావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారని, ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోందని అధికారులు చెప్పారు. బయో బబుల్‌ వాతావరణంలో ఉన్నా కూడా ఏకంగా ఐదుగురికి వైరస్ సోకడం ఇప్పుడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పెద్దల్లో ఆందోళన రేపుతోంది.


ఇదిలా ఉంటే ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోని వరుణ్ చక్రవర్తి, సందీప్‌కు కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కేకేఆర్ మధ్య ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. కేకేఆర్ ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో వారెంత కాలం ఐసోలేషన్‌లో ఉంటే అంతకాలం జట్టు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక చెన్నై జట్టులో కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఢిల్లీ మైదాన సిబ్బందికి కూడా కరోనా సోకడంతో ఐపీఎల్ కొనసాగుతుందా..? అనేదే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ పరిస్థితుల్లో ఢిల్లీ మైదానంలో జరిగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచును బీసీసీఐ నిర్వహిస్తుందా... లేదా అనేది చూడాలి.

Updated Date - 2021-05-04T05:23:51+05:30 IST