విదేశీ తబ్లిగీలపై అదనపు ఎఫ్ఐఆర్‌ల రద్దుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసు

ABN , First Publish Date - 2020-08-04T20:34:23+05:30 IST

ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులపై

విదేశీ తబ్లిగీలపై అదనపు ఎఫ్ఐఆర్‌ల రద్దుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసు

న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులపై దాఖలైన అదనపు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లను రద్దు చేయాలంటూ రెండు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 10న జరుగుతుందని తెలిపింది. 


తబ్లిగి జమాత్ సభ్యులపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్‌ల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ, సవివరమైన నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. 


విదేశీ జమాత్ సభ్యులు, పిటిషనర్ల తరపున న్యాయవాదులు అషిమా మంద్లా, మందాకిని సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమాలకు సంబంధించి దాఖలైన కేసును సాకేత్ కోర్టు విచారణ జరుపుతోందని మంద్లా చెప్పారు. విదేశీయులపై దాఖలైన అదనపు అభియోగ పత్రాల గురించి వారికి పోలీసులు తెలియజేయలేదని తెలిపారు. 


విదేశీ జమాతీలపై దాఖలైన అదనపు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరిన రెండు వేర్వేరు పిటిషన్లపై స్పందిస్తూ, ఢిల్లీ హైకోర్టు జూలై 31న నోటీసులు జారీ చేసింది. 


నిజాముద్దీన్ మర్కజ్ జమాత్‌పై మర్కజ్‌లోని పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న సెక్షన్లనే విదేశీయులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లలో కూడా పేర్కొన్నారని కోర్టుకు కొందరు పిటిషనర్లు తెలిపారు. మర్కజ్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఎఫ్ఐఆర్ నిందితుల్లో చాలా మంది అభ్యర్థన బేరసారాలు జరిపి, జరిమానాలు చెల్లించినట్లు తెలిపారు. ఇటువంటివారు ఈ దేశం నుంచి వెళ్ళిపోయే అవకాశం వచ్చినపుడు, ఈ అదనపు ఎఫ్ఐఆర్‌ల కారణంగా వెళ్ళలేకపోతున్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-04T20:34:23+05:30 IST