Abn logo
Jan 27 2021 @ 15:38PM

ట్రాక్టర్ ర్యాలీలో హింస: 200 మందిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇవాళ 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరందర్నీ విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళ వారం ఘర్షణలకు సంబంధించి మరింత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిన్న ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మార్గాల్లో కాకుండా రైతులు బారికేడ్లు దాటుకుని సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడం, అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి దిగడంతో ఘర్షణ చెలరేగింది. వేలాది మంది ఆందోళన కారులు బారికేడ్లను దాటుకుని, పోలీసులపై దాడిచేసి, పలు వాహానాలను ధ్వంసం చేశారు. ప్రముఖ చారిత్రక కట్టడం ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. దీంతో కొద్ది రోజులుగా ఢిల్లీలో శాంతియుతంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

Advertisement
Advertisement
Advertisement