రిపబ్లిక్ డే: ఉగ్రవాదుల పోస్టర్లు వేసిన ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2021-01-18T00:13:11+05:30 IST

రిపబ్లిక్ డే సందర్భంగా ఖలిస్థాన్, అల్ ఖైదా, తదితర ఉగ్రవాద సంస్థల నుంచి భద్రతాపరమైన..

రిపబ్లిక్ డే: ఉగ్రవాదుల పోస్టర్లు వేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ఖలిస్థాన్, అల్ ఖైదా, తదితర ఉగ్రవాద సంస్థల నుంచి భద్రతాపరమైన ముప్పు ఉండవచ్చన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 'వాంటెడ్ టెర్రరిస్టుల' ఫోటోలున్న పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా వాంటెడ్ టెర్రరిస్టుల ఫోటోలతో పోస్టర్లు ఏర్పాటు చేయడంతో సహా పలు భద్రతా పరమైన చర్యలు తీసుకున్నట్టు కన్నాట్ ప్లేస్ ఏసీపీ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. దాడులకు అవకాశమున్న మార్కెట్, రెసిడెన్స్ ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ పెంచినట్టు ఆయన చెప్పారు.


'కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరేడ్‌కు అనుమతించే వారి సంఖ్యను 1.5 లక్షల నుంచి 25 వేలకు కుదించాం. పరిమిత సంఖ్యలో మాత్రమే పాస్‌లు, టిక్కెట్లు ఇస్తున్నాం. వెరిఫికేషన్ ప్రక్రియలో ఫోటోలున్న ఐడీ కార్డులు తేవాలని అడుగుతున్నాం. నిలబడి చూసేందుకు ఎవరినీ అనుమతించం. సీటింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాం' అని ఏసీపీ తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు మార్గదర్శకాలను కూడా ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.

Updated Date - 2021-01-18T00:13:11+05:30 IST