ఒంటరి తల్లులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త!

ABN , First Publish Date - 2022-01-05T19:08:37+05:30 IST

భర్త నుంచి విడాకులు పొందిన, భర్త మరణించిన భార్యలు తమ

ఒంటరి తల్లులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త!

న్యూఢిల్లీ : భర్త నుంచి విడాకులు పొందిన, భర్త మరణించిన భార్యలు తమ బిడ్డలకు తమ కులాన్నిబట్టి కుల ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఓ ఒంటరి తల్లి సామాజిక నేపథ్యం ఆధారంగా ఆమె బిడ్డకు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా మంగళవారం అందజేశారు. ఎనిమిదేళ్ళపాటు ఆమె చేసిన కృషికి కరోల్ బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవి జోక్యంతో ఫలితం దక్కింది. 


గతంలో ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను తండ్రి కులం ఆధారంగా, పితృవర్గం కులం ఆధారంగా జారీ చేసేవారు. దీనివల్ల చాలా మంది ఒంటరి తల్లులు తమ బిడ్డలకు ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను పొందలేకపోయేవారు. ఫలితంగా ఉపకార వేతనాలు, రిజర్వేషన్లను కోల్పోయేవారు. అలాంటివారిలో గీతా దేవి ఒకరు. ఆమె తన బిడ్డకు కుల ధ్రువీకరణ పత్రం పొందడం కోసం ఎనిమిదేళ్ళ నుంచి శ్రమిస్తున్నారు. ఆమె దరఖాస్తును అధికారులు అనేకసార్లు తిరస్కరించారు. అయినా ఆమె పట్టువీడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రవి రెవిన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల దృష్టికి తీసుకెళ్ళారు. అధికారులు అనేకసార్లు సమావేశాలు నిర్వహించి, ఈ విషయంపై చర్చించారు. ఒంటరి ఎస్సీ, ఎస్టీ తల్లులు అనుభవిస్తున్న ఇబ్బందులను ఆయన శాసన సభలో కూడా ప్రస్తావించారు. రవి కృషి ఫలించి, గీతా దేవి తన కుమారునికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందగలిగారు. ఒంటరి తల్లి కులం ఆధారంగా ఆమె బిడ్డకు జారీ చేసిన మొట్టమొదటి కుల ధ్రువీకరణ పత్రం ఇదే. దీనిని ఆమెకు మనీశ్ శిశోడియా మంగళవారం అందజేశారు. 


ఈ విధంగా ఒంటరి తల్లి కులం ఆధారంగా ఆమె బిడ్డకు ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసేందుకు వీలు కల్పిస్తూ గతంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.


Updated Date - 2022-01-05T19:08:37+05:30 IST