లాబీయింగ్‌కే ఢిల్లీ యాత్ర!

ABN , First Publish Date - 2022-08-02T08:30:53+05:30 IST

‘వారం రోజుల మీ ఢిల్లీ పర్యటన.. కమీషన్లు వచ్చే అవకాశం ఉన్న కాంట్రాక్టర్ల బిల్లుల సొమ్ముల చెల్లింపునకు అవసరమైన నిధులు,..

లాబీయింగ్‌కే ఢిల్లీ యాత్ర!

కాంట్రాక్టర్ల బిల్లులు, కమీషన్ల కోసం ఆరాటం

నిధులు, అప్పుల కోసం చీకటి ప్రయత్నాలు

ఇదే మీ ఢిల్లీ వారం పర్యటన సారాంశం

 సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ


హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘వారం రోజుల మీ ఢిల్లీ పర్యటన.. కమీషన్లు వచ్చే అవకాశం ఉన్న కాంట్రాక్టర్ల బిల్లుల సొమ్ముల చెల్లింపునకు అవసరమైన నిధులు, అప్పుల కోసం బరితెగించి లాబీయింగ్‌ చేయడానికే జరిగింది. ఇందు కోసమే మీరు ఢిల్లీకి వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంటనష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, సాయం కోరతారేమోనని ప్రజలు ఆశించారు. దానికి భిన్నంగా వ్యవహరించి వారం రోజుల తర్వాత నిన్ననే తిరిగి రాష్ట్రానికి వచ్చారు. మీ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతులు, ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి కేవలం మీ సన్నిహిత కాంట్రాక్టర్ల బిల్లుల కోసం సిగ్గు ఎగ్గు లేకుండా వారం రోజులు ఢిల్లీలో చీకటి ప్రయత్నాలు చేయడం అత్యంత దారుణం’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు ఇవీ. 


ఘోరం జరిగితే పైసా సాయం లేదేమి?

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దాదాపు రూ.1500 కోట్ల పంట నష్టం జరిగింది. 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ రూ.498 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ రూ.449 కోట్లు, సాగునీటి శాఖ రూ.33 కోట్లు, పురపాలక శాఖ రూ.379 కోట్లు, విద్యుత్‌ శాఖ రూ. ఏడు కోట్లు కలిపి సుమారు రూ.1400 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు వేసి మీరు కేంద్రానికి ఓ తూతూ మంత్రపు నివేదిక పంపి చేతులు దలుపుకున్నారు. కానీ, అత్యంత కీలకమైన పంట నష్టంపై మాత్రం అంచనాలు వేయించలేదు. వరద ప్రాంతాల్లో మీరు చేసిన పర్యటన కౌబాయ్‌ లాగా విహార యాత్రకు వెళ్లినట్లు ఉందే తప్ప.. రైతులకు, వరద బాధితులకు ఏం ఊరట లభించిందో చెప్పగలరా? ఇక వరదలతో 40 మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 934 గ్రామాల్లో 12,704 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం నుంచి పైసా సాయం లేదు.  


జనాలు చస్తుంటే డ్రామాలేంటి...!?

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా తెలంగాణకు మొండి చేయి చూపుతున్నా జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు, నల్ల వ్యవసాయ చట్టాలు లాంటి అనేక కీలక అంశాలకు మీరు మద్దతిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేస్తే మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని 2017లోనే మహారాష్ట్ర తన్నుకు పోతుంటే ఆనాడు మీరు మోడీ చంకనెక్కి ఊరేగుతున్నారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ హామీని అటకెక్కిేస్త అడగలేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చుకునే సోయి మీకు లేదు. వరదలతో జనాలు చచ్చిపోతుంటే మీరు చేస్తున్న డ్రామాలేంటి?


పిల్లలు చస్తుంటే... జాలనిపించడం లేదా!?

ఒకవైపు రాష్ట్రంలో గిరిజన, బీసీ గురుకులాల్లో కలుషిత ఆహారం తిని పేద బిడ్డలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఒక్కనెలలోనే పది చోటుచేసుకున్నా, ఒక్క ఘటనపై కూడా విచారణకు ఆదేశించ లేదు. బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలన్నర క్రితం ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు. విద్యార్థులను బ్లాక్‌ మెయిల్‌ చేసే దుస్థితికి మీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం దిగజారింది. 


వరద బాధితులను ఆదుకోవాలి

నష్టపోయిన పంటకు ఎకరాకు కనీసం రూ.20 వేల పరిహారమివ్వాలి.  వరద నష్టం లెక్క తేలాలంటే ప్రభుత్వం అధికారికంగా సర్వే చేసి, నివేదికను శాసనసభలో ప్రవేశ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలి. ప్రభుత్వ బ్యాంకుల్లో రైతులు తీసుకొన్న అప్పులపై రెండేళ్ల పాటు మారటోరియం విధించాలి. 

Updated Date - 2022-08-02T08:30:53+05:30 IST