ఢిల్లీ కమాల్‌

ABN , First Publish Date - 2021-04-21T08:55:32+05:30 IST

వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌లో తడబడింది. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (4-0-24-4) బంతితో మాయాజాలం ప్రదర్శించడంతో రోహిత్‌ సేన

ఢిల్లీ కమాల్‌

ముంబైపై విజయం 

అమిత్‌ మిశ్రాకు నాలుగు వికెట్లు 


స్వల్ప స్కోర్లను విజయవంతంగా కాపాడుకుంటూ వస్తున్న ముంబై ఇండియన్స్‌కు ఈసారి ఝలక్‌ తగిలింది. అయితే 138 పరుగుల ఛేదనలో ముంబై బౌలర్ల పోరాటంతో ఢిల్లీ చివరి ఓవర్‌ వరకు వేచి చూడాల్సి వచ్చింది. ధవన్‌, స్మిత్‌ ఆరంభంలో.. లలిత్‌, హెట్‌మయెర్‌ చివర్లో ఆదుకున్నారు. అంతకుముందు ముంబై ఆరంభం బాగానే ఉన్నా.. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ధాటికి మిడిలార్డర్‌ కుప్పకూలింది. చివర్లోనూ పరుగులు రాకపోవడంతో ముంబై కనీసం 150 పరుగులు కూడా చేయలేకపోయింది.  


చెన్నై: వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌లో తడబడింది. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (4-0-24-4) బంతితో మాయాజాలం ప్రదర్శించడంతో రోహిత్‌ సేన బేజారెత్తింది. ఆ తర్వాత శిఖర్‌ ధవన్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), స్మిత్‌ (29 బంతుల్లో 4 ఫోర్లతో 33) కీలక ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), సూర్యకుమార్‌ (15 బంతుల్లో 4 ఫోర్లతో 24) వేగంగా ఆడారు. అవేశ్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. చివర్లో లలిత్‌ యాదవ్‌ (25 బంతుల్లో 1 ఫోర్‌తో 22 నాటౌట్‌), హెట్‌మయెర్‌ (9 బంతుల్లో 2 ఫోర్లతో 14 నాటౌట్‌) సంయమనంతో ఆడారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అమిత్‌ మిశ్రా నిలిచాడు.


ధవన్‌, స్మిత్‌ కీలక ఇన్నింగ్స్‌: స్వల్ప ఛేదనలో ఢిల్లీ చివరి ఓవర్‌ వరకు ఆగాల్సి వచ్చినా ఒత్తిడికి గురి కాలేదు. రెండో ఓవర్‌లోనే పృథ్వీ షా (7) వికెట్‌ కోల్పోగా ఆ తర్వాత ధవన్‌-స్మిత్‌ జోడీ రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించింది. మూడో ఓవర్‌లో స్మిత్‌ రెండు ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లేలో జట్టు 39/1 స్కోరుతో నిలిచింది. ఈ దశలో తొమ్మిదో ఓవర్‌లో స్మిత్‌ రెండు ఫోర్లు బాదాడు. అయితే క్రీజులో చక్కగా కుదురుకున్న అతడిని పొలార్డ్‌ ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు పిచ్‌ కూడా బౌలర్లకు సహకరించడంతో ఢిల్లీ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమైంది.


అయితే రాహుల్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో గబ్బర్‌ వరుసగా 6,4తో జోష్‌ నింపినా భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. కెప్టెన్‌ పంత్‌ (7) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. చివరి 2 ఓవర్లలో 15 పరుగులు కావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో 10 రన్స్‌ వచ్చాయి. ఇక ఆరు బంతుల్లో 5 రన్స్‌ కోసం తొలి బంతినే హెట్‌మయెర్‌ ఫోర్‌కు పంపగా మరో బంతిని పొలార్డ్‌ నోబ్‌ వేయడంతో మ్యాచ్‌ ముగిసింది.


మధ్య ఓవర్లలో తడబాటు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై రోహిత్‌, సూర్యకుమార్‌ దూకుడుతో పవర్‌ప్లేలోనే 55 పరుగులు సాధించింది. భారీ స్కోరు ఆలోచనతో ఆది నుంచే ఎదురుదాడికి దిగాలనే వ్యూహంతో ముంబై ఆడింది. అందుకే రెండో ఓవర్‌లో డికాక్‌ (2) వెనుదిరిగినా కూడా ఎక్కడా తగ్గలేదు. కానీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా వారి ప్రయత్నాన్ని వమ్ము చేశాడు. కీలక సమయంలో దెబ్బ వేసిన అతడు తిరిగి ముంబైని కోలుకోనీయలేదు. ఓ దశలో 17 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో రోహిత్‌ 4,6.. సూర్య ఓ ఫోర్‌తో 15 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇరువురూ ఓవర్‌కో ఫోర్‌ ఉండేలా ఆడారు. ఏడో ఓవర్‌లో అవేశ్‌ చేతిలో సూర్య అవుట్‌ కావడంతో రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ముంబైకి అసలు షాక్‌ తొమ్మిదో ఓవర్‌లో తగిలింది. మూడు బంతుల వ్యవధిలో రోహిత్‌, హార్దిక్‌ (0)లను అమిత్‌ మిశ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అంతేకాకుండా తన తర్వాతి ఓవర్‌లోనే ప్రమాదకర పొలార్డ్‌ (2) పనిబట్టడంతో ముంబై 84/6తో దిక్కుతోచని స్థితిలో పడింది. దీనికి ముందే క్రునాల్‌ (1)ను లలిత్‌ బౌల్డ్‌ చేశాడు. కొద్దిసేపు వికెట్ల పతనానికి ఇషాన్‌ (26), జయంత్‌ యాదవ్‌ (23) జోడీ బ్రేక్‌ వేసింది. ఏడో వికెట్‌కు 39 పరుగులు జోడించాక మళ్లీ మిశ్రానే ఇషాన్‌ వికెట్‌ తీశాడు. చివరి ఓవర్‌లో రాహుల్‌ చాహర్‌ (6) వికెట్‌ కోల్పోయిన ముంబై ఏడు పరుగులే చేయడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 44; డికాక్‌  (సి) పంత్‌ (బి) స్టొయినిస్‌ 2; సూర్యకుమార్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 24; ఇషాన్‌ (బి) మిశ్రా 26; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 0; క్రునాల్‌ (బి) లలిత్‌ 1; పొలార్డ్‌ (ఎల్బీ) మిశ్రా 2; జయంత్‌ (సి అండ్‌ బి) రబాడ 23; రాహుల్‌ చాహర్‌ (సి)పంత్‌ (బి) అవేశ్‌ 6; బుమ్రా (నాటౌట్‌) 3; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 137/9. వికెట్ల పతనం: 1-9, 2-67, 3-76, 4-77, 5-81, 6-84, 7-123, 8-129, 9-135. బౌలింగ్‌: స్టొయినిస్‌ 3-0-20-1; అశ్విన్‌ 4-0-31-0; రబాడ 3-0-25-1; అమిత్‌ మిశ్రా 4-0-24-4; అవేశ్‌ 2-0-15-2; లలిత్‌ యాదవ్‌ 4-0-17-1.


ఢిల్లీ: పృథ్వీషా (సి అండ్‌ బి) జయంత్‌ 7, ధవన్‌ (సి) క్రునాల్‌ (బి) చాహర్‌ 45, స్టీవెన్‌ స్మిత్‌ (ఎల్బీ) పొలార్డ్‌ 33, లలిత్‌ (నాటౌట్‌) 22, పంత్‌ (సి) క్రునాల్‌ (బి) బుమ్రా 7, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.1 ఓవర్లలో 138/4. వికెట్లపతనం: 1-11, 2-64 3-100, 4-115. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-23-0, జయంత్‌ 4-0-25-1, బుమ్రా 4-0-32-1, క్రునాల్‌ పాండ్యా 2-0-17-0, రాహుల్‌ చాహర్‌ 4-0-29-1, పొలార్డ్‌ 1.1-0-9-1.

Updated Date - 2021-04-21T08:55:32+05:30 IST