30 ఏళ్లుగా తెరుచుకోని మహిళ నోరు... క్లిష్టమైన సర్జరీతో...

ABN , First Publish Date - 2021-03-31T15:27:35+05:30 IST

30 ఏళ్లుగా తెరుచుకోని మహిళ నోరు... క్లిష్టమైన సర్జరీతో...

30 ఏళ్లుగా తెరుచుకోని మహిళ నోరు... క్లిష్టమైన సర్జరీతో...

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ 30 ఏళ్లుగా నోటి సమస్యతో బాధపడుతోంది. అయితే ఆమె ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. దీంతో 30 ఏళ్లుగా మూతబడిన ఆమె నోరు తెరుచుకుంది. ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసి, బాధితురాలికి కొత్త జీవితం ప్రసాదించారు. ఆస్థా అనే ఈ మహిళ జన్మతహా పలు శారీరక సమస్యలను ఎదుర్కొంటోంది. 


ఆమె దవడ ఎముక నోటి ఇరువైపుల నుండి వెళ్లి పుర్రె ఎముకకు అతుక్కుపోయింది. దీంతో ఆమె పుట్టుకతోనే నోటిని తెరవలేకపోయేది. కనీసం తన వేలితో నాలికను కూడా తాకలేని స్థితిలో ఉండేది. ఇన్నాళ్లూ ఆమె ద్రవ పదార్థాలు తీసుకుంటూ మాత్రమే జీవితం సాగిస్తూ వస్తోంది. మరోవైపు నోటి సమస్య కారణంగా ఆమె దంతాలు కూడా పాడయిపోయాయి. ఆమెకు ఒక కన్ను కూడా కనిపించదు. ఫలితంగా ఆమె ముఖం అందవికారంగా  కనిపించేది. ఫలితంగా శస్త్ర చికిత్సలకు కూడా అందని విధంగా ఆమె పరిస్థితి ఉండేది. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడి వైద్యులు ఆమెకు అత్యంత క్షిష్టమైన సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, రేడియాలజీ విభాగం వైద్యులు సంయుక్తంగా ఆమెకు మూడు గంటల పాటు సర్జరీ చేశారు. మార్చి 20న ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స అనంతరం మార్చి 25న కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. ఇప్పుడు ఆమె తన నోటిని కొద్దిగా తెరవగలుగుతోంది. ఫిజియో థెరపీ, వ్యాయామాల ద్వారా ఆమె నోరు మరింతగా తెరుచుకునేందుకు అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-03-31T15:27:35+05:30 IST