రెండేళ్ల క్రితం పెళ్లి.. మొదటి కాన్పు జరిగిన రెండు రోజులకే పాప మృతి.. మళ్లీ వెంటనే గర్భవతి.. డెలివరీ అయిన వెంటనే మరో విషాదం

ABN , First Publish Date - 2021-10-22T21:03:20+05:30 IST

ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి తాను తల్లి కావాలని ఆరాటపడింది. అనుకున్నట్టుగానే మొదటిసారి గర్భం దాల్చింది. నవమాసాలు మోసి, పురిటినొప్పులు భరించి ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతోకాలం

రెండేళ్ల క్రితం పెళ్లి.. మొదటి కాన్పు జరిగిన రెండు రోజులకే పాప మృతి.. మళ్లీ వెంటనే గర్భవతి.. డెలివరీ అయిన వెంటనే మరో విషాదం

భోపాల్: ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి తాను తల్లి కావాలని ఆరాటపడింది. అనుకున్నట్టుగానే మొదటిసారి గర్భం దాల్చింది. నవమాసాలు మోసి, పురిటినొప్పులు భరించి ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పాప పుట్టిన రెండు రోజులకే చనిపోయింది. అపుడు ఆ తల్లి మనసు ఎంతగానో విలవిల్లాడిపోయింది. ఆ తర్వాత వెంటనే రెండోసారి గర్భం దాల్చింది. కానీ తొమ్మిది నెలల తర్వాత రెండోసారి డెలివరీ అయిన వెంటనే మరో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.


గుణలోని భల్లన్‌పుర ప్రాంతానికి చెందిన కీర్తి జటావ్‌కు సిరోంజ్‌ వాసి అయిన రాంబాబు జటావ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. రాంబాబు సిరోంజ్‌లోని  ఓ గిడ్డంగిలో పనిచేస్తున్నాడు. పెళ్లైన సంవత్సరం తర్వాత కీర్తి మొదటిసారి గర్భం దాల్చింది. ప్రసవ సమయంలో ఆమెకు సిరోంజ్‌లో ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కీర్తిని విధిషకు పంపించారు. అక్కడ పాపకు జన్మనిచ్చిన తర్వాత కీర్తి ఆరోగ్యం క్షీణించసాగింది.  ఆమెను వైద్యులు భోపాల్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ పుట్టిన రెండు రోజులకే అపుడు పాప చనిపోయింది.


అయితే మళ్లీ వెంటనే కీర్తి రెండోసారి గర్భం దాల్చింది. దీంతో ఆమె గుణలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే కీర్తికి గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. అపుడు కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నార్మల్ డెలివరీ చేస్తే తల్లి, బిడ్డ ప్రాణాలకే ప్రమాదమని, ఆపరేషన్ చేస్తే ఇద్దరినీ కాపాడవచ్చని చెప్పారు. దీంతో ఆమె భర్త కీర్తిని మధ్యాహ్యం 12గంటలకు ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించాడు. అక్కడి వైద్యులు రక్తం తక్కువగా ఉందని ఆమెకు రెండు బాటిళ్ల రక్తం ఎక్కించారు. గురువారం మధ్యాహ్యం మూడు గంటలకు కీర్తి పాపకు జన్మనిచ్చింది. అయితే రక్తం ఎక్కించినప్పటి నుంచి కీర్తి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది. పరీక్షించిన వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. కానీ కీర్తి సాయంత్రం చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కీర్తికి సరిపోయే రక్తవర్గం ఎక్కించకపోవడం వల్లే ఆమె చనిపోయిందని వారు ఆరోపించారు. వైద్యులు సాయంత్రం వరకు కీర్తి ఆరోగ్యపరిస్థితి గురించి తమకు చెప్పలేదని, తహశీల్దార్ వచ్చి ఆమె చనిపోయినట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం, చికిత్స అందించిన డాక్టర్‌పై కేసు నమోదు చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. అయితే శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో కీర్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2021-10-22T21:03:20+05:30 IST