ప్రసవం కోసం నరకం

ABN , First Publish Date - 2021-05-17T05:13:53+05:30 IST

ఆమె నిరుపేద. నిండు చూలాలు. పురిటినొప్పులతో బాధపడుతూ కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే వైద్యులు పట్టించుకోలేదు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అక్కడ పరీక్షల పేరుతో కాలయాపన చేశారు. చివరికి లేని కరోనా ఉన్నదని చెప్పి తాము వైద్యం చేయలేమని సెలవిచ్చారు.

ప్రసవం కోసం నరకం
ఆడబిడ్డకు జన్మనిచ్చిన నాగలక్ష్మి

ప్రభుత్వ వైద్యశాలలో పట్టించుకోని వైనం

ప్రైవేటు ఆసుపత్రులో ‘పరీక్ష’

కనిగిరి నుంచి కందుకూరుకు

అక్కడి నుంచి ఒంగోలుకు

పురిటినొప్పులతో 16 గంటలు ప్రయాస

ఒంగోలులో ఆడ శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి


కనిగిరి, మే 16 : ఆమె నిరుపేద. నిండు చూలాలు. పురిటినొప్పులతో బాధపడుతూ కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే వైద్యులు పట్టించుకోలేదు.  ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అక్కడ పరీక్షల పేరుతో కాలయాపన చేశారు. చివరికి లేని కరోనా ఉన్నదని చెప్పి తాము వైద్యం చేయలేమని సెలవిచ్చారు. కన్నీటితో ఇంటిబాట పట్టిన వారిపై తహసీల్దార్‌ కనికరం చూపారు. ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. కానీ శస్త్ర చికిత్సకు అవసరమైన సౌకర్యాలు లేవని వైద్యులు కందుకూరుకు సిఫార్సు చేశారు. అంబులెన్స్‌లో అక్కడికి వెళ్లిన ఆమెకు వైద్యం అందలేదు. చివరికి ఒంగోలులోని మాతా వైద్యశాలకు తరలించగా వైద్యులు ప్రసవం చేశారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పురిటినొప్పులతో 16 గంటలపాటు ఆమె నరకం అనుభవించిన తీరు ప్రభుత్వ వైద్యశాలల్లో డొల్లతనాన్ని పట్టి చూపుతోంది. అదేసమయంలో ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

అక్కడ పాజిటివ్‌.. ఇక్కడ నెగెటివ్‌

కనిగిరి పట్టణంలో ఓ సినిమా థియేటర్‌లో పనిచేసే నాగలక్ష్మికి శనివారం ఉదయం 11 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమె స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. అక్కడ వైద్యులుకానీ, సిబ్బందికానీ పట్టించుకోకపోవడంతో నాగలక్ష్మి  తల్లి ఆమెను గార్లపేటరోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి సిబ్బంది పరీక్షల పేరుతో కాలయాపన చేశారు. సాయంత్రం వరకూ ఆమె ప్రసవ వేదన అనుభవిస్తూనే ఉంది. అనేక పరీక్షల అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్‌ ఉందని, తాము ఇక్కడ వైద్యం చేయలేమని చెప్పి పంపించారు. దీంతో విలపిస్తూ వారు ఇంటి దారి పట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ పుల్లారావు నాగలక్ష్మిని స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్‌ ఫలితం వచ్చింది. తహసీల్దార్‌ ఉన్నంత వరకూ ఏమీ మాట్లాడని వైద్యులు ఆయన వెళ్లిన తర్వాత ఆమెకు సర్జరీ చేయాల్సిన అవరం ఉందని, ఇక్కడ కుదరదని చెప్పారు. కందుకూరుకు సిఫార్సు చేశారు. దీంతో నాగలక్ష్మిని 108లో కందుకూరుకు  తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు స్పందించకపోవడంతో ఆమెను ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలకు తరలించారు. సుమారు 16 గంటలపాటు నరకం అనంతరం నాగలక్ష్మి అక్కడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

కారకులెవరు?

ఇంతటి దుస్థితికి వైద్యశాఖ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పాలనా వైఫల్యమే కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా కనిగిరి ఏరియా వైద్యశాలలో ఆపరేషన్లు చేయాలంటే మత్తు డాక్టర్‌ అవసరమని తెలిసినా పట్టించుకున్న నాథుడే లేడు. ఉన్న వైద్యులు ఈ వంకతో ప్రతి కేసునూ ఇతర ప్రాంతాలకు సిఫార్సు చేస్తున్నారు. కాలికి దెబ్బ తగిలినా, కాలు విరిగినా, తల పగిలినా, తల గీసుకున్నా  ఒంగోలుకు పంపుతున్నారు. ఇప్పకైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యశాలలో అవసరమైన మత్తుడాక్టర్‌ను నియమించడంతోపాటు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-17T05:13:53+05:30 IST