డేంజరస్‌గా డెల్టా

ABN , First Publish Date - 2021-07-24T08:21:36+05:30 IST

దేశవ్యాప్తంగా అత్యధిక కేసులకు డెల్టా వేరియంటే కారణమవుతోందని.. ..

డేంజరస్‌గా డెల్టా

దేశవ్యాప్తంగా అత్యధిక కేసులకు ఆ వేరియంటే కారణం: ఇన్సాకాగ్‌

వ్యాక్సిన్లు వేసినా డెల్టా కేసులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన


న్యూఢిల్లీ, జెనీవా, జూలై 23: దేశవ్యాప్తంగా అత్యధిక కేసులకు డెల్టా వేరియంటే కారణమవుతోందని.. మిగతా ఆందోళన కారక వేరియంట్ల (వీవోసీ) కేసులు తక్కువగా ఉంటున్నాయని ఇన్సాకాగ్‌ (ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం) తెలిపింది. ఒక్క మనదేశంలోనే కాక.. ఆగ్నేయాసియా దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త కేసుల నమోదుకు, కేసులు వేగంగా పెరగడానికి ఈ వేరియంటే కారణమవుతోందని పేర్కొంది. అయితే.. మెరుగైన ప్రజారోగ్య ప్రమాణాలను పాటించే, వ్యాక్సినేషన్‌ బాగా జరిగిన సింగపూర్‌ వంటి దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉం దని వెల్లడించింది. మనదేశంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అధ్యయనం ప్రకా రం.. డెల్టా వేరియంట్‌ వల్ల నమోదవుతున్న బ్రేక్‌- త్రూ ఇన్ఫెక్షన్లలో(వ్యాక్సిన్‌ వేయించుకున్నాక కూడా కరోనా ఇన్ఫెక్షన్‌ బారిన పడిన కేసులు) 9.8ు మందికి మాత్రమే ఆస్పత్రి చికిత్స అవసరమవుతోందని, వారిలో మరణాల రేటు 0.4 శాతానికి పరిమితమైందని ఇన్సాకాగ్‌ తెలిపింది. అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌ వల్ల ‘సెకండరీ అటాక్‌ రేటు’ శాతం ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడించింది.


సెకండరీ అటాక్‌ రేటు అంటే.. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకిన తర్వాత, వారి నుంచి మిగతా కుటుంసభ్యులకు సోకే రేటు. అలాగే, దేశంలో ఇంతవరకూ లాంబ్డా వేరియంట్‌ కేసులేవీ నమోదు కాలేదని ఇన్సాకాగ్‌ స్పష్టం చేసింది. ఆ వేరియంట్‌ ప్రధానంగా.. ప్రయాణికుల్లో, వారి సన్నిహితుల్లో మాత్రమే కనిపిస్తున్నట్టు యూకే డేటా ఆధారంగా తెలుస్తోంది. డెల్టా వేరియంట్‌లో మాత్రం.. అమెరికా, యూకే, ఇండియాలో కొత్త మ్యుటేషన్లు వస్తున్నట్టు ఆందోళన వెలిబుచ్చింది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగువారాలుగా భారత్‌, చైనా, రష్యా, ఇజ్రాయెల్‌, యూకే.. ఇలా పలు దేశాల్లో సేకరించిన కరోనా పాజిటివ్‌ల నమూనాలకు జీన్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. వాటిలో 75 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌ కేసులుగా తేలినట్టు కొవిడ్‌ తాజా అప్‌డేట్‌లో (జూలై 20న విడుదలైంది) వెల్లడించింది. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నట్టు తెలిపింది. ఉదాహరణకు.. ఇండోనేషియాలో గడిచిన వారం రోజుల్లో 3,50,273 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 44% ఎక్కువ. యూకేలో 2,96,447 కేసులు (41% అధికం), అమెరికాలో 2,16,433 కొత్త కేసులు (68% పెరుగుదల) నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇప్పటిదాకా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వచ్చిన 24 లక్షల కొవిడ్‌ పాజిటివ్‌ నమూనాల జన్యుక్రమాలను జీఐఎ్‌సఏఐడీ (గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా)కి సమర్పించగా.. వాటిలో 2,20,000 (దాదాపు 9%) డెల్టా వేరియంట్‌ కేసులేనని వెల్లడించింది. మున్ముందు డెల్టా వేరియంట్‌ మిగతా వేరియంట్లన్నింటినీ అధిగమించి.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలపాటు ప్రబల వేరియంట్‌గా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్య క్తం చేసింది. ఆందోళనకారకం కాని వేరియంట్లతో (నాన్‌ వీవోసీ) పోలిస్తే డెల్టా బారిన పడినవారిలో వైరల్‌ లోడ్‌ 1200 రెట్లు అధికంగా ఉంటున్నట్టు ఇటీవల చైనా అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. నాన్‌వీవోసీ రకం కరోనా వైర్‌సల బారిన పడినవారితో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌ బారిన పడినవారు ఆస్పత్రిపాలయ్యే ముప్పు 120%, ఐసీయూలో చేర్చాల్సిన అవసరం 287%, మరణించే ముప్పు 137% ఎక్కువని వెల్లడైందని పేర్కొంది.


Updated Date - 2021-07-24T08:21:36+05:30 IST