అమ్మో డెల్టా!

ABN , First Publish Date - 2021-06-23T08:53:54+05:30 IST

డెల్టా వేరియంట్‌.. ప్రస్తుతం యూకేని, భారత్‌ను మరికొన్ని దేశాలను భయపెడుతున్న రకం. రోజుకు 4 లక్షలకు పైగా కేసులతో మనదేశంలో సెకండ్‌వేవ్‌ ..

అమ్మో డెల్టా!

డెల్టా వేరియంట్‌.. ప్రస్తుతం యూకేని, భారత్‌ను మరికొన్ని దేశాలను భయపెడుతున్న రకం. రోజుకు 4 లక్షలకు పైగా కేసులతో మనదేశంలో సెకండ్‌వేవ్‌ అంత భయంకరంగా ఉండడానికి కారణమైన వేరియంట్‌. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్లన్నింటికన్నా వేగంగా వ్యాప్తి చెందే గుణం, ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉండడం, వ్యాక్సిన్ల రక్షణను సైతం తప్పించుకుని ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం.. ఇవీ దాని పర్యవసానాలు. డబుల్‌ మ్యుటెంట్‌ (బి.1.617) రకంగా మహారాష్ట్రలో ప్రారంభమైన వేరియంట్‌లో కలిగిన మూడు ఉత్పరివర్తనాల వల్ల మూడు ఉపవర్గాలు దాంట్లోంచి పుట్టుకొచ్చాయి.


అవి.. బి.1.617.1, బి.1.617.2, బి.1.617.3. ఈ మూడింటిలోనూ బి.1.617.2 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా ప్రకటించింది. అంటే మానవాళికి ఆందోళనకారకమైన వైరస్‌ రకం అని అర్థం. దానికే గ్రీకు వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా.. డెల్టా అని నామకరణం చేసింది. బి.1.617.1 రకానికి ‘కప్పా’ అని పేరు పెట్టింది. నిజానికి ఈ రెండింటిలో డెల్టాతో పోలిస్తే కప్పా రకమే.. వ్యాక్సిన్‌ రక్షణను అధిగమించి తీవ్ర ఇన్ఫెక్షన్‌ను కలిగించగలదు. కానీ, డెల్టాతో పోలిస్తే దాని వ్యాప్తి వేగం తక్కువ. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని ఆందోళనకారిక వేరియంట్‌గా గుర్తించలేదు. డెల్టా మాత్రం ఇప్పటిదాకా వచ్చిన అన్ని వేరియంట్లకన్నా వేగంగా వ్యాపిస్తుంది కాబట్టే వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా ప్రకటించింది.


వ్యాప్తే దాని బలం..

కరోనా వేరియంట్లలో అలా అన్నింటికన్నా అత్యంత వేగంగా వ్యాపించే సూపర్‌ స్ర్పెడర్‌.. డెల్టా వేరియంట్‌. గత కొద్దిరోజులుగా బ్రిటన్‌లో భారీగా నమోదవుతున్న కేసుల్లో 87.1 శాతానికి కారణం ఈ వేరియంటేనంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇప్పటిదాకా 52 వేలకు పైగా డెల్టా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మూడు వేలకు పైగా డెల్టా కేసులు వెలుగుచూశాయి. మనదేశంలో 6,685 డెల్టా కేసులే నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జర్మనీ, సింగపూర్‌, కెనడా, రష్యా, బెల్జియం, స్పెయిన్‌, ఇటలీ ఇలా 70కి పైగా దేశాల్లో డెల్టా వేరియంట్‌ తన ఉనికిని చాటుకుందని, ప్రపంచం మొత్తానికీ వ్యాపించే ప్రమాదం కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యస్వామినాథన్‌ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ బ్రిటన్‌ వేరియంట్‌గా పిలిచిన ఆల్ఫా రకం కూడా సూపర్‌స్ర్పెడరేగానీ.. దాంతో పోలిస్తే డెల్టా 60ు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్‌ ఇంత వేగంగా వ్యాపించడానికి కారణం.. దాంట్లో వచ్చిన 452ఆర్‌, 478కె ఉత్పరివర్తనాలే. ఈ రెండు ఉత్పరివర్తనాల వల్ల డెల్టా వేరియంట్‌ వైరస్‌ మానవ కణాలకు మరింత సమర్థంగా అతుక్కోగల శక్తి, వ్యాక్సిన్‌ రక్షణను తప్పించుకోగల శక్తి వచ్చాయి. 

Updated Date - 2021-06-23T08:53:54+05:30 IST