Abn logo
Sep 18 2021 @ 00:05AM

‘ఆసరా’ బూచితో అక్రమ వసూళ్లు

జమ్మలమడుగు మెప్మా కార్యాలయంలో మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యం

బయోమెట్రిక్‌ నమోదుకు రూ.50 డిమాండు

ఆందోళనకు దిగిన డ్వాక్రా మహిళలు

ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్‌

జమ్మలమడుగు రూరల్‌, సెప్టెంబరు 17: జమ్మలమడుగు మెప్మా కార్యాలయంలో రెండు రోజుల నుంచి డ్వాక్రా మహిళల నుంచి ‘ఆసరా’ రుణమాఫీ కోసం బయోమెట్రిక్‌ వేలిముద్రలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సంబంధిత మహిళలు స్థానికంగా ఉన్నారా? లేక ఎక్కడైనా ఉన్నారా తదితర వాటి గురించి అధికారులు వివరాలు తీసుకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు ఆర్పీలు అక్రమంగా ఒక్కో మహిళ నుంచి రూ.50 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు పరిధిలో మొత్తం 763 సంఘాలున్నాయి. వీటికి సంబంధించి ఆర్పీలు 28 మంది ఉన్నారు.. ఒక్కో సంఘంలో 10 నుంచి 12 మంది ఉంటారు. ఒక్కో సంఘంలో సరాసరి 11 మంది అనుకున్నా మొత్తం 8,393 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 అంటే సుమారు రూ.4.20 లక్షలు అవుతుంది. ఇలా డబ్బు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బాధిత మహిళలంతా పెద్దఎత్తున మెప్మా కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మెప్మా అధికారులను నిలదీశారు. దీనిపై కమిషనర్‌ వెంకటరామిరెడ్డికి కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే మెప్మా కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనర్‌ రాగానే మహిళలంతా చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు, కార్యాలయం సిబ్బంది వచ్చి ఆందోళన చేస్తున్న మహిళలను బయటకు పంపించి వేశారు. అనంతరం మెప్మా కార్యాలయ సిబ్బందితో కమిషనర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్‌ పేరుతో మహిళల నుంచి డబ్బులు వసూలు చేయమని ఎవరు చెప్పారని, ఎందుకు చేస్తున్నారని ఆర్పీలను ప్రశ్నించారు. ఇప్పటివరకు మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని, అలా చెల్లించకపోతే విచారణ చేసి అందరిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. ఈవిషయంపై మెప్మా అధికారి గంగులయ్యను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా డబ్బులు వసూలు చేయలేదని తెలిపారు. ఏది ఏమైనా మెప్మా అధికారులపై, ఆర్పీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేశారు.